ఏపీ రాజధాని అమరావతి చుట్టూ చంద్రబాబు అతడి అనుచరులు చేస్తున్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు రకరకాల అభూతకల్పనలు సృష్టించి రాజధాని అంశంతో రాజకీయాలు చేస్తున్నారు టీడీపీ నేతలు. కానీ అదే రాజధాని వెనక చంద్రబాబు చేసిన చెత్త పనుల్ని, సాగించిన అరాచకాల్ని మాత్రం ఎవ్వరూ లేవనెత్తడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ అదే పనిమీద ఉన్నారు.
ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన అరాచకాలకు అంతుపొంతు లేదు. ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా సాక్ష్యాలతో సహా బయటపడుతున్నాయి. ఇక రాజధాని విషయానికొస్తే.. అమరావతికి శంకుస్థాపన జరిగిన రోజు నుంచే చంద్రబాబు ఈ కోణంలో చాలా అవకతవకలకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. చాలా సందర్భాల్లో జగన్ కూడా ఈ అనుమానాల్ని వ్యక్తంచేశారు కూడా. మరోవైపు టీడీపీ శ్రేణులు మాత్రం రాజధాని కుంభకోణానికి సంబంధించి సాక్ష్యాలుంటే బయటపెట్టాలని, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం తగదని తాటాకుచప్పుళ్లు చేస్తున్నాయి.
ఇప్పుడు వీళ్లందరి నోళ్లు మూయించేలే, కళ్లుచెదిరేలా రాజధానికి సంబంధించి వాస్తవాలు బయటపడుతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజధాని పేరిట వసూలు చేసిన డబ్బు అంతటినీ చంద్రబాబు, తన ఎన్నికల అవసరాలకు, ఆఖరి నిమిషంలో ప్రవేశపెట్టిన పథకాలకు వాడేశారు. ఇదీ ఏపీ నూతన రాజధాని అమరావతిపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ-నిబద్ధత. పైకి మాత్రం అమరావతిని తన కలల రాజధానిగా కబుర్లు చెబుతుంటారు బాబు.
అమరావతి అభివృద్ది పేరిట వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చారు చంద్రబాబు. ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాక్ లాంటి ప్రముఖ కంపెనీల నుంచి దాదాపు 2వేల కోట్లు సేకరించారు. ఇవి కాకుండా రాజధాని పేరిట ఆయన బాండ్లు కూడా ప్రవేశపెట్టి పబ్లిక్ ఇష్యూకు వెళ్లారు. స్వయంగా బాబు ముంబయి వెళ్లి గంట కొట్టి ఇష్యూ ప్రారంభించారు. ఆ విధంగా మరో 2వేల కోట్లు సమకూర్చుకున్నారు. అయితే వీటిలో కేవలం 10శాతం నిధుల్ని మాత్రం రాజధాని పేరిట వినియోగించినట్టు స్వయంగా లెక్కలు చెబుతున్నాయి. మిగతా 90శాతం నిధుల్ని ఓట్ల కోసం ఆఖరి నిమిషంలో ప్రవేశపెట్టిన పథకాల కోసం ఖర్చుచేశారు. ఇంకా సూటిగా చెప్పాలంటే ఆ పథకాల పేరిట తెలుగు తమ్ముళ్లందరికీ వాటాలు చేరిపోయాయి. ప్రచార ఖర్చులు అందిపోయాయి.
మరి రాజధాని పరిస్థితి ఏంటి? లండన్, సింగపూర్ ను తలదన్నే రీతిలో రాజధాని నగరాన్ని నిర్మిస్తానని కాకమ్మ కబుర్లు చెప్పిన చంద్రబాబు, తెరవెనక చేసిన పని ఇది. స్వయంగా అధికారులు మంత్రి బొత్స, ముఖ్యమంత్రి జగన్ కు చెప్పిన పచ్చి నిజాలివి. చంద్రబాబు మాత్రం చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఇప్పుడు పైపైన విమర్శలు చేస్తున్నారు. రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే సీఆర్డీఏ పరిథిలో పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయి. పైపైన లెక్కలు తీస్తేనే 2500 కోట్ల రూపాయల మేరకు బకాయిలు ఉన్నాయి. వీటిని క్లియర్ చేయడం జగన్ సర్కార్ కు తలకుమించిన భారంగా మారింది. అప్పుడు చంద్రబాబు, నిధుల్ని దారిమళ్లించకుండా రాజధాని డబ్బుని అమరావతి కోసమే ఉంచినట్టయితే, ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అప్పుడు చేసిందంతా చేసి, ఇప్పుడు తగుదునమ్మా అంటూ సిగ్గులేకుండా జగన్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు బాబు. ఇప్పుడు చెప్పండి.. రాజధాని పేరిట రాజకీయం చేస్తోంది ఎవరు?