Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ సర్కారుకు పవన్ జై కొడతారా?

జగన్ సర్కారుకు పవన్ జై కొడతారా?

నిజంగా ప్రజాసమస్యల మీద శ్రద్ధ, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే.. తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకోసమే తప్ప అధికారం కోసం కాదనే మాట నిజమే అయితే జనసేనాని పవన్ కల్యాణ్, రాష్ట్రంలోని జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి జై కొట్టి తీరాలి. ఉద్ధానం ప్రాంత ప్రజలు అనుభవిస్తున్న కిడ్నీ సమస్యల గురించి పవన్ అప్పట్లో ఎంత పోరాడారో అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహనరెడ్డి సర్కారు.. ఉద్ధానం కిడ్నీ సమస్యలగురించి ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంది. వ్యాధి బాధితులకు ఊరటతో పాటు, వ్యాధి వస్తున్నందుకు గల మూలాలనుకూడా గుర్తించే పనిలో ఉంది. అందుకే.. ఉద్ధానం బాధితులకోసం ఇంత మంచి నిర్ణయాలు తీసుకున్న జగన్మోహనరెడ్డి సర్కారుకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు చెబితేనే.. ఆయనలో చిత్తశుద్ధి ఉన్నట్లు నిరూపణ అవుతుంది.

అప్పట్లో ఉద్ధానం బాధితుల గళాన్ని పవన్ కల్యాణ్ చాలా పెద్దస్థాయిలో వినిపించే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతంలో పర్యటించారు. సొంతంగా తన చొరవతో విదేశీ డాక్టర్లను తీసుకువచ్చి.. ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోడానికి రీసెర్చి చేయించారు. ఆ రీసెర్చిలో కనుగొన్న వివరాలతో పాటు, ప్రజల బాధలనుకూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నివేదించే ప్రయత్నం చేశారు. కానీ.. చంద్రబాబు తీసుకున్న చర్యలు మాత్రం పరిమితం.

తాజాగా జగన్ సర్కారు ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు మంచి ప్రయత్నం చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్‌ స్ఫెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయబోతోంది. ఈ  ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌ కూడా ఏర్పాటు అవుతాయి. వీటన్నింటికి కలిపి మొత్తం 50 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జీవో కూడా జారీ అయింది.

పవన్ కల్యాణ్ కు నిజంగానే ఉద్ధానం కిడ్నీ బాధితుల గురించి శ్రద్ధ ఉంటే గనుక.. ఇంత గొప్ప  ఇనిషియేషన్ తీసుకున్న జగన్ సర్కారుకు కృతజ్ఞతలు చెప్పడం ఆయన బాధ్యత. ఇప్పటికి కూడా.. జగన్ కు థాంక్స్ చెప్పకుండా.. మడిగట్టుకు కూర్చుంటే గనుక.. పవన్ కల్యాణ్ సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసమే జగన్ మీద విమర్శనాస్ర్తాలు రువ్వుతున్నారే తప్ప.. ప్రజాక్షేమాన్ని ఆశించి కాదని ప్రజలు తెలుసుకుంటారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?