జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గరినుంచి.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో రాష్ట్రానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఈ మాత్రం సత్సంబంధాలు ఉండడం చాలా మంచి పరిణామం. ఇద్దరు సీఎంలు కొన్నిసార్లు భేటీ అయ్యారు. హైదరాబాదులోని సచివాలయంలో.. ఏపీ వాటాకు వచ్చే భవనాలను తెలంగాణకు అప్పగించేయడానికి జగన్ అంగీకరించేయడం ఇలాంటివన్నీ జరిగిపోయాయి.
అయితే ఇరురాష్ట్రాలు సంయుక్తంగా చేయవలసిన వాటిలో కొన్ని కీలక ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్, జగన్ ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతంనుంచే తీసుకువచ్చి.. శ్రీశైలం డ్యాంలో కలిపితే గనుక… ఆ నీటిని అక్కడినుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా.. రాయలసీమ జిల్లాలకు కూడా తరలించుకోవచ్చుననేది కేసీఆర్ ప్రతిపాదన. ఆ రకంగా గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసి, ఉభయ రాష్ట్రాల్లోనూ నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు పంపవచ్చుననేది కేసీఆర్ ప్రతిపాదన.
ఈ పథకం మీద పలువురిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సూత్రప్రాయంగా ఈ ప్రతిపాదనకు జగన్ అంగీకరించినట్లుగా వార్తలువచ్చాయి. జగన్ డిల్లీకి వెళ్లి.. పీఎంను కలిసినప్పుడు.. ఈ పథకానికి కూడా ఆర్థిక సాయం చేయాల్సిందిగా అడిగినట్లు సమాచారం. అయితే.. ఈ పథకం వల్ల గోదావరి నుంచి శ్రీశైలానికి నీటిని మళ్లించే కాలువలన్నీ తెలంగాణలోనే ఉంటాయి. మొత్తం ఆ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుంది. శ్రీశైలానికి చేరే వాటిలో ఎంత మేరకు రాయలసీమ జిల్లాలకు మళ్లుతాయో గ్యారంటీ లేదు.
అయితే ఈ పథకం మంచిది కాదని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ అంటున్నారు. అదంతా భవిష్యత్తరాల మీద భారీ ఆర్థికభారం మోపే ఆలోచన అంటున్నారు. ఎటూ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వద్ద.. పట్టిసీమనుంచి గోదావరి జలాలు వచ్చి కృష్ణలో ఇప్పుడూ కలుస్తున్నాయి. అనుసంధానం ఆల్రెడీ జరిగింది. వైఎస్సార్ హయాంలో తవ్వించిన కాలువలకు అనుసంధానించి.. పట్టిసీమ ఎత్తిపోతలనుంచి నీళ్లు కృష్ణలోకి తెస్తున్నారు.
జయప్రకాశ్ నారాయణ్ చేస్తున్న సూచన ఏంటంటే… ఈ నీటిద్వారా పులిచింతల రిజర్వాయరును పూర్తిస్థాయికి నింపినట్లయితే ఇబ్బందే ఉండదు. వాటిని రివర్స్ పంపింగ్ ద్వారా.. (ఆల్రెడీ అక్కడ ఏర్పాటుచేసిన ఉన్న మోటార్లు) 70, 80 అడుగుల మేర చిన్నఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఇది సాధ్యమవుతుంది. పులిచింతల నిండితే.. నాగార్జున సాగర్ లెవెల్ కు దరిదాపుగా వస్తుంది. ఇక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు నీటిని వదలాల్సిన అవసరమే ఉండదు. ఆ రకంగా అటు నాగార్జున సాగర్ లోగానీ, ఇటు శ్రీశైలంలోగానీ.. ఉండే జలాలను తెలంగాణ మెట్ట ప్రాంతాలకు, రాయలసీమ జిల్లాలకు పంపుకోవడం సాధ్యమవుతుంది. చాలా తక్కువ కర్చుతో ఇది సాధ్యమవుతుంది అని ఆయన అంటున్నారు.
విశాఖలో వైఎస్ఆర్ వర్ధ:తి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఆయన చేసిన ఈ సూచనలు.. కేసీఆర్ ప్రతిపాదన పట్ల జగన్ కు హెచ్చరికలాగా కనిపిస్తున్నాయి. జగన్మోహనరెడ్డి… ఈ విషయంలో కేసీఆర్ మాటలకు బోల్తా కొట్టకుండా… ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని పలువురు ఆశిస్తున్నారు.