టీడీపీ ‘ప్రేమ’ని జనసేనాని తట్టుకోగలడా.?

తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా తెగిస్తుందని చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది. 2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ని ఎంత చక్కగా టీడీపీ వాడుకుందో చూశాం. ఆ తర్వాత అదే…

తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా తెగిస్తుందని చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది. 2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ని ఎంత చక్కగా టీడీపీ వాడుకుందో చూశాం. ఆ తర్వాత అదే పవన్‌ కళ్యాణ్‌ మీద తెలుగుదేశం పార్టీ నేతలు కత్తులు దూశారు.. చివరికి మళ్ళీ ఎన్నికల సమయంలో 'పవన్‌ కళ్యాణ్‌ మావాడే..' అంటూ నిస్సిగ్గుగా టీడీపీ నేతలు చెప్పుకున్నారు.. ఆ కోణంలోనే ఎన్నికల ప్రచారం కూడా చేశారు. 

ఓ రాజకీయ పార్టీగా ఎదగాలనుకున్నప్పుడు ఇతర పార్టీలతో స్నేహం నడపడం తప్పేమీ కాకపోవచ్చు. కానీ, ఈ క్రమంలో ఆయా పార్టీల్ని ఎంతవరకు విశ్వసించవచ్చునన్నది పవన్‌ కళ్యాణ్‌ తెలుసుకుని వుండాలి. ఎన్నికల్లో టీడీపీ ఆరోపణల సంగతి పక్కన పెడితే, పవన్‌ కళ్యాణ్‌ పరోక్షంగా టీడీపీకి మద్దతిచ్చారన్న సంకేతాలు జనంలోకి గట్టిగానే వెళ్ళిపోయాయి. ఇప్పుడు రాజధాని విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులకు మడుగులొత్తేలానే కన్పిస్తోంది పవన్‌ కళ్యాణ్‌ వైఖరి. అది టీడీపీ నేతల గేమ్‌ ప్లాన్‌లో భాగమే.. అన్న సంకేతాలకు స్వయానా పవన్‌ కళ్యాణ్‌ 'అవకాశం' ఇస్తున్నారు. 

ఏ కొత్త ప్రభుత్వానికైనా కనీసం ఆరు నెలల సమయం ఇవ్వడం అనేది ఓ పద్ధతి. ఆ పద్ధతిని పవన్‌ కళ్యాణ్‌ అయినా పాటించి వుండాలి. అలా చేసి వుంటే, కాస్తయినా జనసేన పార్టీకి కొంత ప్రయోజనం వుండేదేమో. ప్రజా సమస్యల విషయంలో స్పందించడాన్ని కాదనలేం. కానీ, టీడీపీ దారిలోనే నడుస్తూ.. ఇంకా ఆ పార్టీతో స్నేహం చెడిపోలేదన్న సంకేతాలు ఖచ్చితంగా జనసేనను ముంచేస్తాయ్‌. 

ఇక, పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు పవన్‌ కళ్యాణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. చంద్రబాబు శుభాకాంక్షలు చెబితే అదొక లెక్క. నారా లోకేష్‌ కూడా పవన్‌కి శుభాకాంక్షలు చెప్పేయడం గమనార్హం. మరోపక్క, గల్లా జయదేవ్‌, కింజరాపు రామ్మోహన్‌నాయుడు కూడా పవన్‌ కళ్యాణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. 

గల్లా జయదేవ్‌కీ పవన్‌ కళ్యాణ్‌కీ మధ్య ఎన్నికల సమయంలో పెద్ద రచ్చే జరిగింది. సోషల్‌ మీడియా వేదికగా జరిగిన ఈ రచ్చ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి గల్లా జయదేవ్‌, షడెన్‌గా తన వాయిస్‌ మార్చేసుకున్నారు. ఇదంతా టీడీపీ అధినేత స్క్రిప్ట్‌ కారణంగానే జరిగివుండొచ్చుగానీ.. ఆ టీడీపీ 'మకిలి' వదిలించుకోకపోతే, పవన్‌ కళ్యాణ్‌కి రాజకీయ భవిష్యత్తు వుండదన్నది నిర్వివాదాంశం. కానీ, పవన్‌ కళ్యాణ్‌కి ఇంకో ఆప్షన్‌ లేనట్టుంది. టీడీపీ దెబ్బకి ఆల్రెడీ బలైపోయిన జనసేన, ఇంకోసారి టీడీపీ పంచన చేరితే.. అంతే సంగతులు.