రిలీజ్ రోజు నుంచి కనిపించకుండాపోయిన సాహో దర్శకుడు సుజీత్ ఎట్టకేలకు బయటకొచ్చాడు. సాహో రిజల్ట్ పై రియాక్డ్ అవ్వకుండా చిన్నప్పట్నుంచి తను ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు. చేసిన తప్పుల నుంచి చాలా నేర్చుకున్నానంటున్న ఈ దర్శకుడు.. సాహో నుంచి చాలామంది చాలా ఎక్కువ ఆశించారని, అక్కడే వ్యవహారం తేడాకొట్టిందని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. అంతేకాదు.. సినిమాను రెండోసారి చూస్తే ఇంకాస్త బాగుంటుందని భరోసా ఇస్తున్నాడు.
“చాలామంది సాహో చూశారు. కొంతమంది ఇంకాస్త ఎక్కువ ఆశించారు. కానీ చాలామంది ఇష్టపడ్డారు. సినిమా చూసిన వాళ్లందరికీ థ్యాంక్స్. ఏదైనా మిస్ అయిందనిపిస్తే దయచేసి మరోసారి సినిమా చూడండి. కచ్చితంగా చెబుతున్నాను, ఈసారి ఇంకాస్త ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు.”
ఈ సందర్భంగా తన లైఫ్ జర్నీకి చెందిన కొన్ని ఫొటోల్ని షేర్ చేశాడు సుజీత్. తను షార్ట్ ఫిలిమ్స్ తీసిన రోజుల నాటి వర్కింగ్ స్టిల్స్ అవి. ప్రభాస్ తో దిగిన ఫొటోల్ని రిలీజ్ కు ముందే షేర్ చేసిన ఈ దర్శకుడు.. రిలీజ్ తర్వాత మాత్రం తమ కెరీర్ జర్నీనే చెప్పుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాడు.
“17 ఏళ్లకే షార్ట్ ఫిలిం తీశాను. డబ్బుల్లేవు, టీమ్ లేదు. కానీ నా కుటుంబం నుంచి ఆర్కుట్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. నా తప్పుల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా ప్రయాణంలో విమర్శలు నాకు ఎక్స్ ట్రా బలాన్నిచ్చాయి. చాలా అడ్డంకులొచ్చినా ఎప్పుడూ మధ్యలో ఏదీ వదిలేయలేదు.”
మొత్తమ్మీద తాజా పోస్ట్ తో సాహో సినిమాపై వచ్చిన నెగెటివ్ టాక్ ను సుజీత్ పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది. ఇక ఇవాళ్టి నుంచి ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందనేది అందర్లో ఆసక్తికరంగా మారింది. వీకెండ్ అయిపోయింది, పండగ మూడ్ కూడా పోయింది. ప్రభాస్ నిజమైన స్టామినా, సినిమా అసలు రంగు ఇవాళ్టి నుంచి బయటపడుతుంది.