సీఎం జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లవుతోంది. అంటే సగం పాలన మనమందరం చూశాం. అయితే ఈ పాలనలో ఆయన సంక్షేమానికే పెద్దపీట వేశారని ఈజీగా చెప్పేయొచ్చు. అదే సమయంలో అభివృద్ధి పనులపై అంతగా ఫోకస్ పెట్టలేదనే విమర్శలూ ఉన్నాయి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూపిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కాయని అంటున్నారు కొంతమంది.
అయితే ఈ మాత్రానికే జగన్ పాలనను తప్పుబట్టడానికి లేదు. సంక్షేమం-అభివృద్ధి రెండూ సమానమే. కానీ సంక్షేమమే కాస్త ఎక్కువ సమానం అనేటట్టుగా జగన్ తొలి అర్థభాగం తన పాలన కొనసాగించారు. ఇప్పుడు సెకండాఫ్ లోకి వెళ్తున్నాం. ఈసారి సంక్షేమం కంటే అభివృద్దే కాస్త ఎక్కువ సమానం అనబోతున్నారు జగన్.
అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించేలా..?
ఈ రెండున్నరేళ్లలో ప్రాజెక్ట్ ల నిర్మాణం జెట్ స్పీడ్ అందుకుంటుంది, రోడ్ల రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి. రాష్ట్రానికి కొత్త కంపెనీలు వస్తాయి, వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఉంటుందట. ఇప్పటివరకూ పెట్టిన ఖర్చులను కాస్త తగ్గించుకునే క్రమంలో
ఉంది ప్రభుత్వం.
అందులో భాగంగానే అనర్హులకు పింఛన్లు, ఇతర పథకాల నిలిపివేత మొదలవుతోంది. రేషన్ సరకుల పంపిణీ కూడా సక్రమంగా సాగుతుంది. ఎక్కడా వృథా ఉండదు, అనవసర ఖర్చులుండవు, అనర్హులకు పథకాలుండవు. అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల లేమి లేకుండా ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి.
రెండున్నరేళ్లలో పూర్తి మార్పు..
మిగిలిన రెండున్నరేళ్లలో అభివృద్ధిని పరుగులు పెట్టించి ఐదేళ్ల పాలన సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలనేది సీఎం జగన్ ప్లాన్. ఈలోగా నవరత్నాల్లో మిగిలిన హామీలను కూడా వీలైనంత మేర అమలు చేయడానికి ఆయన ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
మద్యపాన నిషేధం, 3వేల రూపాయల వరకు పింఛన్ల పెంపు, ఉద్యోగులకు పీఆర్సీ, సీపీఎస్ రద్దు, ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ వంటి కార్యక్రమాలు కూడా అమలులోకి వస్తాయి. ఒకవేళ వాటిని అమలు చేయలేకపోతే అందుకు గల కారణాలను కూడా ప్రజలకు వివరించేలా ప్లాన్ చేస్తున్నారు.
సంక్షేమ కార్యక్రమాల అమలులో జగన్ ఇప్పటికే నూటికి నూరు మార్కులు సాధించారని చెప్పాలి. ఇతర రాష్ట్రాలు కూడా మన సచివాలయ వ్యవస్థను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. నాడు-నేడు వంటి పథకాలపై దృష్టిసారించాయి. ఈ దశలో అభివృద్ధిలో కూడా ఏపీని దేశానికే ఓ నమూనాగా నిలపాలని అనుకుంటున్నారు జగన్. మూడు రాజధానులను ప్రకటించడమే కానీ, దానిపై ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రత్యేకంగా కసరత్తు చేసినట్టు కనిపించడంలేదు.
కోర్టు కేసులు ఓవైపు వెనక్కు లాగుతున్నా.. మూడు ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో పూర్తి స్థాయిలో దృష్టి పెడుతుందని సమాచారం. అధికారికంగా రాజధాని అనే పేరు లేకపోయినా.. కోర్టు కేసులు తేలిన వెంటనే పరిపాలనా కార్యక్రమాలను మార్చేసేందుకు సర్వం సిద్ధం చేయబోతున్నారట.
సో.. మొత్తమ్మీద ఐదేళ్ల జగన్ పాలన చూస్తే రెండున్నరేళ్లు సంక్షేమం, మిగిలిన రెండున్నరేళ్లు అభివృద్ధి అనేలా సాగుతుందని అర్థమవుతోంది. అదే కనుక జరిగితే జగన్ కు ఇక తిరుగుండదు.