ఆన్ లైన్ టికెట్-కులపిచ్చ పీక్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను తీసుకువస్తాం అనగానే పెన్నల నిండా విషం నింపుకుని రెడీగా వుండే తెలుగుదేశం అనుకుల సామాజిక మీడియా కట్టలు తెచ్చుకుంది. విచ్చలవిడి ఊహాగానాలు చేసింది. ఈ ఊహాగానాలు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను తీసుకువస్తాం అనగానే పెన్నల నిండా విషం నింపుకుని రెడీగా వుండే తెలుగుదేశం అనుకుల సామాజిక మీడియా కట్టలు తెచ్చుకుంది. విచ్చలవిడి ఊహాగానాలు చేసింది. ఈ ఊహాగానాలు ఎంత వరకు వెళ్లిపోయాయి అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఎవరు చూస్తున్నారో టికెట్ బుకింగ్ ద్వారా తెలుసుకుని, వాళ్లకి పింఛన్లు ప్రభుత్వం నిలిపి వేసే అవకాశం వుందనే వరకు. 

గమ్మత్తేమిటంటే కొన్ని నెలల క్రితం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ఓ ప్రకటన చేసారు. ఆన్ లైన్ బుకింగ్  చేస్తామని. కానీ ఒక్కరంటే ఒక్కరు మాట్లాడలేదు. దాని మీద ఇలాంటి ఊహాగానాలు ఏవీ చేయలేదు. కిందా మీదా అయిపొయి, బట్టలు చింపుకుని పొర్లేయలేదు. 

అసలు ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను ప్రభుత్వం తీసుకువస్తామని ప్రకటించింది అంతే. ఇంకా విధి విధానాలు ఏవీ ప్రకటించలేదు. ఇప్పటికే మార్కెట్ లో పలు యాప్ లు వున్నాయి. వాటితో పాటే ఇదీనా? లేక ఇదే నిర్బంధంగా అమలు చేస్తారా? అలా అమలు చేయడానికి కూడా వీలులేదు. ఈ మేరకు న్యాయ ఆదేశాలు గతంలోనే వున్నాయని తెలుస్తోంది.

సరే, అమలు చేస్తారే అనుకుందాం. టికెట్ కట్ కాగానే డబ్బులు ఆటోమెటిక్ గా వెళ్లే ఏర్పాటు వుంటుంది కానీ ప్రభుత్వం దగ్గర ఎందుకు వుండిపోతుంది? బుక్ మై షో లాంటి యాప్ లు అలాగే పని చేస్తున్నాయి కానీ, డబ్బులువుంచేసుకోడం లేదుకదా?

ఆన్ లైట్ టికెటింగ్ ఇప్పుడు అన్ని థియేటర్లలో వుంది. కౌంటర్ టికెట్ లు కూడా ఆన్ లైన్ యాప్ ద్వారానే అమ్ముతున్నారు కదా? రెండు లైన్లు యాప్ లో అమ్మి, మిగిలినవి కౌంటర్లలో అదే యాప్ ద్వారా విక్రయిస్తున్నారు కదా? సినిమా విడుదలయినపుడు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు షో లకు షో లు టికెట్ లు ఎలా పక్కన పెట్టగలుగుతున్నారు. ఇదే యాప్ వున్నా కూడా. ప్రభుత్వ యాప్ వున్నా ఇదే వెసులుబాటు వుంటుందని ఎందుకు అనుకోవడం లేదు?

అన్నింటికి మించి నిర్మాతలు, హీరోలు, డైరక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంతా ఆన్ లైన్ వ్యవస్థను స్వాగతిస్తున్నారు. కేవలం ఎగ్జిబిటర్లు తప్ప. సినిమా జనాలు అందరికీ ట్రాన్స్ పరెన్సీ అన్నది కావాలి. ఎందుకుంటే ఓవర్ ఫ్లోస్ రావడం లేదు. ఇవ్వడం లేదు. థియేటర్ థియేటర్ దగ్గర అన్ని షో లకు ఎంతకని కాపలా వుంచగలరు?

యాప్ ద్వారా టికెట్ ల అమ్మితే కోట్లకు కోట్లు కమిషన్ ప్రభుత్వానికి వచ్చేస్తుందని, దాని మీదు ముందస్తు అప్పలు తెచ్చేసుకుంటుందని గోల మొదలైంది. కోట్లకు కోట్లు కమిషన్ ఇప్పుడు బుక్ మై షో కు వస్తోంది. వందల కోట్లు వస్తోంది నిజమే. కానీ అది ప్రైవేట్  వ్యక్తులకు ఉపయోగం. అదే ప్రభుత్వానికి వస్తే జనాలకు ఉపయోగపడుతుంది. అది అభివృద్ది కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు. 

ప్రభుత్వానికి డబ్బులు వెళ్లిపోతాయి. ప్రైవేట్ కు వెళ్లిపోయినా ఫర్వాలేదు అని గోలపెట్టే  మీడియాను చూస్తుంటే చిత్రంగా వుంది. ఇంత దిక్కుమాలిన రాతలు ఇంకెక్కడా వుండవేమో?

సినిమా జనాలకు ఇష్టమైంది. ఎవరికీ కష్టం కాదు. విధి విధానాలు రావాల్సి వుంది. వాటిపై చర్చలు వుంటాయి. మార్పులు చేర్పులువుంటాయి. అమలు పై కూడా విధివిధానాలు వుంటాయి. ఇన్ని విషయాలు పెండింగ్ లో వుండగా, అర్థం లేని ఊహాగానాలు చేసి, లేని పోని అపోహలు క్రియేట్ చేసి, జగన్ ప్రభుత్వంపై తమకు వున్న కులసమీకరణల కక్షలు తీర్చుకునే ప్రయత్నం చేయడం అంటే ఏమనుకోవాలి?