కరోనా నివారణ వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా తన భారీ లక్ష్యానికి క్రమక్రమంగా చేరువ అవుతోంది. ఒకవైపు ప్రజల్లో వ్యాక్సిన్ పై ఇప్పుడు అనాసక్తి నెలకొని ఉంది. కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు మరీ పెద్ద ఆసక్తితో ఏమీ లేరు. అయితే ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కు సంబంధించి లక్ష్యానికి చేరువ అవుతున్నాయి నంబర్లు.
ఇప్పటి వరకూ దేశంలో సుమారు 74 కోట్ల వ్యాక్సిన్ డోసులను వినియోగించినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 95 కోట్ల మంది వయోజనులు ఉన్నారనే లెక్కల నేపథ్యంలో, 74 కోట్ల డోసులు వాడటం విశేషమైన అంశమే అని చెప్పవచ్చు.
95 కోట్ల మంది వయోజనుల్లో కొందరు వయోవృద్ధులు ఉండారు. 80 యేళ్ల పై వయసు పడ్డవారు. వారిలో రకరకాల మందులు తీసుకుంటున్న వాళ్లు, వ్యాక్సిన్ వేయడం వద్దేమో అని వైద్యులు చెబుతున్న వారి జనాభా ఎంతో కొంత ఉంటుంది. అలాగే తమ వరకూ వ్యాక్సిన్ వచ్చినా వేయించుకోవడానికి అనాసక్తి చూపుతున్న వాళ్లు చాలా మంది ఉంటారు.
యుక్తవయసులోని పల్లె ప్రజల్లో చాలా మంది వ్యాక్సిన్ పై అనాసక్తి చూపిస్తున్నారు. ఇంత పెద్ద దేశంలో ఇలాంటి వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఈ రకంగా చూస్తే.. 74 కోట్ల వ్యాక్సిన్ డోసులంటే, వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్న వారందరికీ కనీసం ఒక డోసు లభించినట్టే. ఇక మిగిలిన వారు వద్దన్న వాళ్లు, చూద్దాంలే అనుకుంటున్న వాళ్లే అని చెప్పవచ్చు. వారిలో కూడా చాలా మందికి త్వరలోనే బతిమాలో, బెదిరించో వ్యాక్సిన్ వేసేలా ఉన్నాయి ప్రభుత్వాలు.
ఇక రెండో డోసు పొందిన వారి సంఖ్య ఇప్పటి వరకూ నెమ్మదినెమ్మదిగా పెరిగినా, ఇక వేగంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు 18 శాతం వయోజనాలకు రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ శాతంలో ఇక పెరుగుదల వేగంగా ఉండవచ్చు. 84 రోజుల వ్యవధిలో రెండో డోసు వ్యాక్సిన్ ఇస్తున్నారు. తొలి డోసు వేసుకోవడానికి కొందరు అనాసక్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండో డోసు వారికి వ్యాక్సిన్ విరివిగా లభించే అవకాశాలున్నాయి.
అయితే 84 రోజుల గడువు చాలా మందికి ప్రతిబంధకంగా మారుతోంది. 84 రోజుల గడువు పూర్తి కానిదే, సిప్టమ్ లో అప్ డేట్ చేయడానికి వీల్లేని పరిస్థితి. దీంతో కొందరు రెండో డోసు పట్ల ఆసక్తితోనే ఉన్నా, గడువు పూర్తి కాని నేపథ్యంలో వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి వీల్లేకుండా పోతోంది. ఒకవేళ ఈ మినహాయింపును గనుక కేంద్రం ప్రకటిస్తే.. మరో రెండు నెలల వ్యవధిలోనే రెండో డోసు వ్యాక్సినేషన్ ను చాలా మంది పొందుతారు.
తొలి డోసు పొందిన వాళ్లందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. వ్యాక్సిన్ విరివిగా అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో అయినా గడువు విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలేమో!