పవన్:: అక్కడా ఉంటారు.. ఇక్కడా ఉంటారు!

జనసేనాని పవన్ కల్యాణ్ ఇక రాజకీయాలనుంచి విరమించుకోనున్నట్లుగా ఒక పుకారు పుట్టింది. ఆయన రాజకీయాలనుంచి తప్పుకుంటున్నారని, మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ఒక తప్పుడులేఖ విడుదలైంది. సోషల్ మీడియాలో దానిని స్ప్రెడ్ చేసే ప్రయత్నం…

జనసేనాని పవన్ కల్యాణ్ ఇక రాజకీయాలనుంచి విరమించుకోనున్నట్లుగా ఒక పుకారు పుట్టింది. ఆయన రాజకీయాలనుంచి తప్పుకుంటున్నారని, మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ఒక తప్పుడులేఖ విడుదలైంది. సోషల్ మీడియాలో దానిని స్ప్రెడ్ చేసే ప్రయత్నం జరిగింది. అయితే సదరు తప్పుడు లేఖ కంటె వేగంగా.. పవన్ పార్టీ దానిని ఖండించేసింది.

సరిగ్గా పవన్ కల్యాణ్ పుట్టినరోజు నాడు.. ఇలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న దాన్ని బట్టి.. పవన్ మాత్రం అక్కడా ఉంటారు.. ఇక్కడా ఉంటారు..!

పవన్ కల్యాణ్ సాధారణంగా తన పుట్టినరోజు నాడు.. అభిమానులు ఎవ్వరికీ అందుబాటులో ఉండకుండా.. కుటుంబంతో కలిసి అజ్ఞాతంలోకి వెళతారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి అందరికీ అందుబాటులోకి వస్తారు. ఇది మామూలే. ఈ ఏడాది ఆయన పుట్టినరోజునాడే ఇలాంటి ఒక వివాదం రేగింది.

‘పవన్ కల్యాణ్ తన పదవిని వదలుకుని సినిమాల్లో నటిస్తున్నారనే కట్టుకథలతో కూడిన’ లేఖ ఇంటర్నెట్ లో సర్కులేట్ అయినట్లుగా.. పార్టీ తన ఖండనలో పేర్కొంది. ‘ఆ లేఖ పచ్చి మోసపూరితమైనదని.. ఎవరూ విశ్వసించవద్దని’ అందులో కోరారు. తప్పుడులేఖను సృష్టించి, సర్కులేట్ చేస్తున్న వారిపై కేసుపెట్టి, లీగల్ చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఉన్నారు.

పవన్ పుట్టినరోజు నాడు అభిమానులు చేస్తున్న సేవాకార్య్రమాలను చూసి ఓర్వలేకనే.. ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నట్లు.. జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో భాగం మాత్రమేనని, నిరంతరం ప్రజల పక్షాన నిలబడడమే తన బాధ్యత అని పవన్ నమ్ముతారని, అందుకు అనుగుణంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారని.. అందులో స్పష్టత ఇచ్చారు. అయితే లేఖలో ఎక్కడాకూడా.. సినిమాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని మాత్రం చెప్పలేదు.

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. పవన్ అటు రాజకీయాల్లోనూ ఉంటారు.. ఇటు సినిమాల్లోనూ ఎంట్రీ ఇస్తారు అని తెలుస్తున్నది. పవన్ తిరిగి సినిమాలు చేయడానికి సంబంధించి సుమారు ఏడాది కిందటే ముమ్మరంగా పుకార్లు వచ్చాయి. దర్శకుడు బాబీతో ఒక నిర్మాత కథ సిద్ధం చేయిస్తున్నారని.. పవన్ కథను విని సూచించిన మేరకు ఆ కథకు మార్పుచేర్పులు కూడా జరుగుతున్నాయని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన లేఖకు ఖండనలో కూడా.. ’ఇక సినిమాలకు నో చాన్స్’ అని పార్టీ చెప్పలేదు. కాబట్టి అది నిప్పులేకుండా పుట్టిన పొగ కాకపోవచ్చు.

అయితే.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన పవన్ రాజకీయాలను వదిలేయరు. ఎటూ రాజకీయంలో ఏడాదిలో అన్నిరోజులూ పనిచేయాల్సినంత అవసరం ఇప్పుడు లేదు. అప్పుడప్పుడూ విజయవాడ, ఏపీలోని ఇతర ప్రాంతాలు వెళుతూ ఉండడం తప్ప.. రాజకీయంగా పవన్ మీద ఒత్తిడి లేదు. సినిమాలను వదులుకుని చాలా కోట్ల రూపాయలు త్యాగం చేశానని ఆయన చాలా సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. అలాగే.. పార్టీ నిర్వహణకు నిధు కొరత ఉన్నదనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ సినిమాలు కూడా చేయడం గ్యారంటీ అనే పలువురు భావిస్తున్నారు.