‘మా కష్టాలు తీర్చండి మహాప్రభో’ అంటూ ప్రజలు పదేపదే తమ చుట్టూ తిరిగితే తప్ప వారి వైపు దృష్టి సారించని నాయకులు మాత్రమే ఇవాళ్టి రోజుల్లో మనకు తెలుసు. అలాంటిది అడిగినా అడగకపోయినా వారు ఎదుర్కొంటున్న సమస్య తన దృష్టికి వస్తే చాలు, తన పరిధిలో దాన్ని పరిష్కరించే తత్వం నాయకులలో చాలా అరుదుగా మాత్రమే ఉంటుంది. అలాంటి అరుదైన గొప్ప నాయకులలో చెరుకు ముత్యంరెడ్డి ఒకరు. తెలంగాణ సమకాలీన రాజకీయ నాయకులలో చెరుకు ముత్యంరెడ్డి అనుపమాన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సీనియర్ నాయకుడు అనారోగ్య కారణాలతో సోమవారం నాడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు నాయకులందరూ నివాళులర్పించారు.
ఈ నేపథ్యంలో ఆయన మంత్రిగా ఉన్న రోజుల నాటి ఒక సంఘటనను గుర్తు చేసుకుంటే ఆయన వ్యక్తిత్వం, ప్రజల పట్ల, సమస్యల పరిష్కారం పట్ల ఆయన చిత్తశుద్ధి మనకు అర్థమవుతాయి. చెరుకు ముత్యంరెడ్డి పౌరసరఫరాల మంత్రిగా ఉన్న రోజుల్లో ఒక సంఘటన జరిగింది. సెక్రటేరియట్లో ప్రతిరోజు ఎంతపని ఉన్నా పూర్తి చేసుకుని గాని వెళ్లే అలవాటు లేని ఒక మహిళా ఉద్యోగి సాయంత్రం నాలుగు గంటలకే ఇంటికి వెళ్లి పోతుండడాన్ని ఒకరోజు ఆయన గమనించారు. ‘ఏమ్మా తొందరగా వెళ్లి పోతున్నావు’ అని అడిగారు. ‘కొద్దిగా సరుకులు తెచ్చుకోవలసిన పని ఉంది సార్ ఆదివారం ఒక్కరోజు సెలవు వస్తే అన్ని పనులు జరగడం లేదు’ అని ఆమె సమాధానం ఇచ్చారు. అప్పటికి మౌనంగా ఉండిపోయారు ముత్యంరెడ్డి.
కానీ ఆయనకు అర్థమైంది. ఈ ఇబ్బంది ఆమె ఒక్కరిదే కాదని, సెక్రటేరియట్ లో పనిచేస్తున్న అందరికీ ఇలాంటి కష్టాలు ఉంటాయని ఆయన భావించారు. పౌరసరఫరాల శాఖ తరఫున సెక్రటేరియట్ ఆవరణలోని ఒక స్టోర్ ఏర్పాటు చేశారు. ఇంటికి కావలసిన నిత్యావసర వస్తువులు అన్నీ సిబ్బంది తీసుకు వెళ్ళగలిగే ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగలేదు, తోపుడు బండ్లపై కూరగాయలను విక్రయించే వారికి సెక్రటేరియట్ వెలుపల ప్రతి సాయంత్రం అమ్మకాలు చేసుకునేలా నిర్ణీత స్థలం కేటాయించారు. ముత్యం రెడ్డి కేవలం సెక్రటేరియేట్ ఉద్యోగుల విషయంలో మాత్రమే కాదు. ప్రజలందరి పట్ల కూడా అలాగే తన పరిధిలోని మంచి పనులను, అడగకపోయినా చేసే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ రకంగా తనను అడగకపోయినా ఉద్యోగుల బాగోగులు చూసుకునే సంక్షేమ దృక్పథం ఉండే మంత్రి ఆయన. అలాంటి మంచి మనిషి మరణించిన నేపథ్యంలో ఆయన గురించి తెలిసిన వారందరూ నివాళులు అర్పిస్తున్నారు.