శ్రద్ధాదాస్ వస్తుందనుకున్నారు. హెబ్బా పటేల్ పేరు గట్టిగా వినిపించింది. ఆఖరి నిమిషంలో ఈషా రెబ్బా అంటూ అంతా ఫిక్స్ అయిపోయారు. చివరికి హీరోయిన్ లేకుండా చేశారు బిగ్ బాస్ నిర్వహకులు. కొన్ని రోజులుగా ఆసక్తిరకంగా మారిన వైల్డ్ కార్డ్ ఎంట్రీని తుస్సుమనిపించారు. హీరోయిన్ వస్తుందనుకుంటే, ఆ స్థానంలో పాత యాంకర్ శిల్పా చక్రవర్తిని పంపించారు.
అస్సలు లైమ్ లైట్లో లేని వ్యక్తి శిల్పా చక్రవర్తి. ఆమె యాంకరింగ్ మానేసి కూడా చాన్నాళ్లయింది. అరకొరగా మాత్రమే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. హాట్ హీరోయిన్ హౌజ్ లోకి వస్తుందనుకుంటే.. ఇలా ఫేడ్ అవుట్ యాంకర్ ను పంపించి అందరి ఉత్సాహాన్ని నీరుగార్చారు బిగ్ బాస్ నిర్వహకులు. చివరికి ఒకదశలో హౌజ్ లో కూడా దీనిపై డిస్కషన్ జరిగింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శిల్పా చక్రవర్తిని పంపించే ముందు.. ఓ చీకటి గదిలో ఆమె ముఖం కనిపించకుండా, హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్లతో ఆమెను మాట్లాడించారు. ఆమ ఎవరై ఉంటుందా అనే అనుమానాన్ని చాలా మంది వ్యక్తంచేశారు. చివరికి బాబా భాస్కర్ అయితే, రెజీనా వచ్చినట్టుందని తన అనుమానాన్ని వ్యక్తంచేశాడు కూడా. అంటే కంటెస్టెంట్లు కూడా హీరోయిన్ వస్తుందని ఫిక్స్ అయిపోయారు. కానీ శిల్పా చక్రవర్తి రావడంతో.. ఇటు ప్రేక్షకులతో పాటు అటు కంటెస్టెంట్లు కూడా ఓస్ ఇంతేనా అనుకున్నారు.
నిజానికి హౌజ్ లోకి హీరోయిన్ రాలేదని, శిల్పా చక్రవర్తి వచ్చిందనే విషయం ముందుగానే ప్రేక్షకులకు అర్థమైపోయింది. చీకట్లో ఆమె వాయిస్ విన్న చాలామంది ఆ గొంతు శిల్పా చక్రవర్తిదే అని గుర్తించారు. దీంతో షో రక్తికట్టలేదు. మొత్తమ్మీద బిగ్ బాస్ సీజన్-3లో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తుస్సుమంది. తొలి వైల్డ్ కార్డ్ గా వచ్చిన తమన్న సింహాద్రి, హౌజ్ ను రచ్చరచ్చ చేసేస్తే.. ఏమాత్రం క్రేజ్ లేని శిల్పా చక్రవర్తి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎలాంటి హైప్ ఇవ్వలేకపోయింది.