మసాలా టీ తెలుసు.. గ్రీన్ టీ తెలుసు, లెమన్ టీ, గ్రాస్ టీ, జింజర్ టీ.. ఇలా చాలా రకాల టీ రుచులు వచ్చాయి. చివరికి ఈమధ్య తందూరీ టీ కూడా వచ్చేసింది. మరి కిక్కిచ్చే మత్తు టీ ఎప్పుడైనా తాగారా? కనీసం అలాంటి టీ ఒకటి ఉందని విన్నారా?
అవును.. టీలో మద్యం కలిపి విక్రయిస్తున్నాడు ఓ వ్యక్తి. ఈ టీ స్టాల్ గోవాలో ఉంది. కాండోలిమ్ లో ఉన్న సింక్వేరియమ్ బీచ్ కు వెళ్తే ఈ టీ తాగొచ్చు. ఇంతకీ ఇతగాడు ఏం చేస్తాడో తెలుసా..? టీలో 2 చుక్కలు ఓల్డ్ మంక్ రమ్ కలుపుతాడంతే.
ఈ వినూత్నమైన టీ తయారుచేసే విధానాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టాడు. ముందుగా మట్టి కప్పును కొలిమిలో బాగా కాలుస్తాడు. అందులో కొన్ని చుక్కల ఓల్డ్ మంక్ రమ్ వేస్తాడు. దీంతో అది మరింత భగ్గుమంటుంది. ఆ వెంటనే దాంట్లో సాధారణ చాయ్ పోస్తాడు. అటుఇటు కలిపి గ్లాసులో పోసి ఇస్తాడు.
ఈ వెరైటీ ఛాయ్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మద్యానికి మండే గుణం ఉంటుందని, కాబట్టి ఆ చాయ్ పై ఓల్డ్ మంక్ ప్రభావం పెద్దగా ఉండదని కొందరు అంటుంటే, కాస్త మత్తుగా ఉంటోందని మరికొందరు చెబుతున్నారు. ట్రెడిషనల్ చాయ్ ను ఇలా బ్రష్టుపట్టించడం సమంజసం కాదని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ, స్థానికంగా ఈ చాయ్ బాగా పాపులర్ అయింది. ఈ చలికాలం సాయంత్రం వేడివేడిగా ఓ కిక్కిచ్చే చాయ్ తాగడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.