భారత్ లో ట్విట్టర్ బ్లూ టిక్ ఛార్జీలు ఎప్పట్నుంచి?

ట్విట్టర్ లో ఇకపై బ్లూ టిక్ మార్క్ కావాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. ట్విట్టర్ బోర్డు ఏకైక సభ్యుడు, కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని ప్రకటించాడు. బ్లూ టిక్…

ట్విట్టర్ లో ఇకపై బ్లూ టిక్ మార్క్ కావాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. ట్విట్టర్ బోర్డు ఏకైక సభ్యుడు, కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని ప్రకటించాడు. బ్లూ టిక్ కావాలనుకునే వినియోగదారులు ఇకపై 8 డాలర్లు చెల్లించాలి. ఈ మేరకు ఐఓఎస్ అప్లికేషన్ లో ఎంపిక చేసిన దేశాల్లో ఈ విధానం అందుబాటులోకి వచ్చింది.

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ లో ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ట్విట్టర్ ను వాడుతున్న వినియోగదారులు, సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త అప్ డేట్ (పాప్-అప్) అందుబాటులోకి వచ్చింది. నెలకు 7.99 డాలర్లు చెల్లిస్తే బ్లూటిక్ వెరిఫైడ్ మార్క్ ఉంటుంది.

అయితే ఈ విధానం ఇంకా భారత్ లోకి అందుబాటులోకి రాలేదు. అలా అని ఎక్కువ రోజులు కూడా పట్టదు. నెల కంటే తక్కువ గడువులోపే ఇండియాలో ఛార్జీలు అమల్లోకి వస్తాయని మస్క్ ప్రకటించాడు. అయితే ఇండియాకు సంబంధించి ఇంకా సబ్ స్క్రిప్షన్ ఛార్జీ ఫిక్స్ చేయలేదు.

బ్లూ టిక్ కలిగిన ట్విట్టర్ వినియోగదారులకు యాడ్స్ గోల సగానికి సగం తప్పుతుంది. వీళ్లు ఎక్కువ నిడివి కలిగిన వీడియోల్ని కూడా పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా, వీళ్లకు రిప్లయ్, సెర్చ్, మెన్షన్స్ లో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

ఉద్యోగుల తొలగింపులు.. సాగనంపే ప్యాకేజీలు

మరోవైపు ట్విట్టర్ లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ అప్రతిహతంగా కొనసాగుతోంది. వేల మంది తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు. దాదాపు సగం ఉద్యోగాల్ని తీసేయాలని టార్గెట్ గా పెట్టుకున్న మస్క్, ఆ దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఇండియాలో ట్విట్టర్ కు సంబంధించి మార్కెటింగ్, ఎడిటోరియల్, సేల్స్ విభాగాలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రస్తుతం జాబ్స్ కోల్పోతున్న ఉద్యోగులందరికీ పని లేకుండా 2 నెలల జీతం ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాడు మస్క్. స్వచ్ఛందంగా ఎవరైనా రిజైన్ చేయడానికి ముందుకొస్తే, వాళ్లకు 3 నెలల వేతనాన్ని ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు.