తెలంగాణ భవిష్యత్‌ను తేల్చే మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ మొదలైంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ ఉప ఎన్నిక సెమీఫైనల్‌గా ప్రచారం జరిగింది. అందుకే ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యం. మునుగోడులో గెలుపు కోసం ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య బిగ్ ఫైట్ జరిగింది.
ఉప ఎన్నిక హడావుడి మొదలైన రోజు నుంచి తెలంగాణలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా జాతీయ దృష్టిని ఆకర్షించింది. అయితే టీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో ఆ పార్టీకి జాతీయస్థాయిలో రాజకీయ ప్రయోజనం దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల్లో కంటే ఎక్కువగా పోలింగ్ జరిగింది. ఉప ఎన్నికలో 93శాతం ఓటింగ్ నమోదు కావడం చిన్న విషయం కాదు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న గిడ్డంగులశాఖ గోడౌన్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట 680 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు.
ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 21 టేబుళ్లపై ఒకే సమయంలో ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. మధ్యాహ్నానికి ఫలితం వెలువడొచ్చు. ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం టీఆర్ఎస్దే గెలుపు. మరి ఎగ్జాట్ పోల్స్‌లో ఎవరనేది కాసేపట్లో తెలియనుంది.