మునుగోడు ఉప ఎన్నిక పోరు హోరాహోరీని తలపిస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్టు కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది. మునుగోడు బరిలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (టీఆర్ఎస్), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (బీజేపీ), పాల్వాయ్ స్రవంతి (కాంగ్రెస్) ప్రధాన అభ్యర్థులు నిలిచారు.
ఇవాళ కౌంటింగ్ సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి సొంత గ్రామస్తులే షాక్ ఇచ్చారు. ఆ గ్రామంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ప్రభాకర్‌రెడ్డి కంటే ఆధిక్యత లభించడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండలంలో లింగవారిగూడెం వుంటుంది. సుమారు 600 వరకు జనాభా ఉంటుంది.
టీఆర్ఎస్ అభ్యర్థి స్వగ్రామంలో కూడా అభివృద్ధి చేయలేదని, అందుకే ఓటర్లు షాక్ ఇచ్చారని సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్‌పై ప్రజాభిప్రాయం ఏంటో అభ్యర్థి స్వగ్రామంలో ఫలితం చూస్తే ఎవరికైనా అర్థమవుతుందంటూ బీజేపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రచారం మొదలు పెట్టారు. మొత్తానికి టీఆర్ఎస్ అభ్యర్థికి స్వస్థలంలోనే ఆదరణ లభించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.