ఉరుములేని పిడుగులా సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టాడు నటుడు కమ్ దర్శకుడు అర్జున్. విశ్వక్ సేన్ పై తీవ్ర విమర్శలు చేశాడు. ఇకపై తనతో సినిమా చేసేది లేదని తెగేసి చెప్పేశాడు. ఆ వెంటనే విశ్వక్ కూడా రియాక్ట్ అయ్యాడు. సినిమా పాటలు, డైలాగ్స్, మ్యూజిక్ విషయంలో అర్జున్ కు సూచనలు చేసిన మాట నిజమేనని, అయితే అర్జున్ అవేవీ పట్టించుకోలేదని ఆరోపించాడు.
తను చెప్పినట్టే నడుచుకోవాలనే మొండి వైఖరితో అర్జున్ వ్యవహరించాడని, తనకు కనీసం గౌరవం ఇవ్వలేదని విశ్వక్ అన్నాడు. అందుకే ఆ సినిమా నుంచి బయటకొచ్చినట్టు వివరణ ఇచ్చుకున్నాడు. మొత్తానికి ఈ పంచాయితీ నిర్మాతల మండలి ముందుకు చేరింది. అదే టైమ్ లో ఈ వివాదంపై తెరవెనక సంప్రదింపుల పర్వం మొదలైంది.
విశ్వక్-అర్జున్ ను కలిపేందుకు కొంతమంది ప్రయత్నిస్తుంటే.. విశ్వక్ ఇమేజ్ మరింత డామేజ్ అవ్వకుండా కాపాడేందుకు మరికొంతమంది రంగంలోకి దిగారు. అర్జున్ కు టాలీవుడ్ ప్రముఖులతో మంచి సంబంధాలున్నాయి. జగపతిబాబు, చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్.. ఇలా చాలామంది నటులతో మంచి సాన్నిహిత్యం ఉంది. తన పరిచయాలతో అర్జున్, విశ్వక్ ను మరింత బ్యాడ్ చేయొచ్చని అతడి వర్గం ఆందోళన చెందుతోంది.
అటు నిర్మాతల మండలి నుంచి కొంతమంది ఈ కాంబినేషన్ ను తిరిగి కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్జున్-విశ్వక్ ప్రాజెక్టును మళ్లీ పట్టాలపైకి తీసుకొచ్చి, తమ మండలి చాలా చురుగ్గా ఉందని చాటిచెప్పాలని వీళ్ల ప్రయత్నం.
అయితే ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలపైకి రావడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే, వంద కోట్లు ఇచ్చినా విశ్వక్ తో సినిమా చేయనని చెప్పిన అర్జున్, కాంప్రమైజ్ అవ్వొచ్చేమో కానీ,.. విశ్వక్ మాత్రం ఈ ప్రాజెక్టులో నటించడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే అతడికి బేసిగ్గా ఈ కథ నచ్చలేదు.
విశ్వక్ స్థానంలోకి వచ్చే హీరో ఎవరు..?
విశ్వక్ తో సినిమా చేయకపోయినా, తను అనుకున్న కథను మరో హీరోతో సెట్స్ పైకి ఎక్కిస్తానని ఇప్పటికే ప్రకటించాడు అర్జున్. కొత్త హీరో ఎవరు, సినిమా టైటిల్ ఏంటనే అంశాలతో త్వరలోనే మీడియాను కలుస్తానని తెలిపాడు. కాబట్టి ఆయన ఈ కథను వదిలే ప్రసక్తి లేదు.
ఎందుకంటే, ఈ సినిమాతో తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్ కు గ్రాండ్ గా పరిచయం చేయాలనేది ఆయన డ్రీమ్. సో.. టాలీవుడ్ నుంచే మరో హీరో విశ్వక్ స్థానంలోకి రాబోతున్నాడు. ఆ మేరకు అర్జున్ ఆల్రెడీ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు.