మీరు చదివింది కరెక్టే. 8 ఏళ్ల బాబును కోబ్రా కాటేసింది. కానీ బాబుకు ఏం కాలేదు. పైపెచ్చు విషనాగు కోబ్రా చనిపోయింది. చత్తీస్ గఢ్ లోని జస్పూర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన.
8 ఏళ్ల దీపక్ తన ఇంటి పెరట్లో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చిదో ఓ కోబ్రా హఠాత్తుగా దీపక్ ముందుకొచ్చింది. అతడి చేతిని చుట్టుకుంది. ఆ వెంటనే అతడి చేతిని కాటేసింది.
భయంతో పామును విడిపించుకునే ప్రయత్నం చేశాడు దీపక్. కానీ అది వదల్లేదు. దీంతో రివర్స్ లో దీపక్ కూడా పామును కరిచాడు. దీంతో పాము, దీపక్ చేయి వదిలేసింది. కానీ దీపక్ గట్టిగా రెండు సార్లు కరవడంతో అది అక్కడికక్కడే చచ్చిపోయింది.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దీపక్ ను హుటాహుటిన స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లారు. దీపక్ కు చికిత్స చేసిన వైద్యులు అతడి శరీరంలో విషం లేదని తేల్చారు. దీన్ని వైద్య పరిభాషలో డ్రై బైట్ అంటారు. అంటే, పాము కాటేసిన మాట వాస్తవమే, కాకపోతే ఆ టైమ్ లో దాని కోరల్లో విషం లేదు.
అప్పటికే మరో జీవిని అది కాటేసి ఉంటుందని, దాంతో కోరల్లో విషం పోయి ఉంటుందని, ఆ తర్వాత దీపక్ ను అది కాటేసి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. మొత్తమ్మీద దీపక్ బతికి బయటపడ్డాడు. కోబ్రా మాత్రం దీపక్ కాటుకు గురై చచ్చిపోయింది.