మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడిపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫలితాలను వెల్లడించకుండా, టీఆర్ఎస్‌కు అనుకూలంగా ప్రజాతీర్పును మార్చే కుట్ర జరుగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ ఎన్నికల సంఘంపై బీజేపీ సీరియస్ అయ్యింది.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్ చేసి, ఫలితాల వెల్లడిలో అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి మండిపాటు తర్వాత పది నిమిషాల్లో ఎన్నికల సంఘం నాలుగు రౌండ్ల ఫలితాలను అప్‌డేట్ చేయడం గమనార్హం.
రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌కు మెజార్టీ వచ్చిన రౌండ్ల సమాచారం మాత్రం ఎన్నికల సంఘం ఇస్తోందన్నారు. బీజేపీకి లీడ్ వస్తే, దాన్ని మాత్రం ప్రకటించకుండా అలసత్వం ప్రదర్శిస్తోందని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్‌కు అనుకూలంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.