మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా, వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించడం జరిగిపోయాయి. దీంతో మునుగోడులో బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాలనే పట్టుదలతో టీఆర్ఎస్ ఉందనే సంకేతాలు వెలువడ్డాయి. మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయం మరింత వేడెక్కింది.
ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బీజేపీ, టీఆర్ఎస్ గెలుపు కోసం చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టలేదు. మునుగోడు ఉప ఎన్నికకు ఓటర్లు భారీగా తరలి వెళ్లారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మాత్రం టీఆర్ఎస్ ఏక పక్షంగా విజయం సాధిస్తుందని వచ్చింది. అయితే ఇవాళ ఫలితాలు వెల్లడవుతుండడాన్ని చూస్తే…టీఆర్ఎస్‌కు విజయం అంతా ఈజీ కాదని తేలిపోయింది.
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్‌కు కేవలం నాలుగు ఓట్ల మాత్రమే మెజార్టీ వచ్చింది. దీంతో టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతున్నదో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే చెప్పకనే చెప్పాయి. ఆ తర్వాత మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ మెజార్టీ సాధించింది. రెండు, మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. నాలుగో రౌండ్ వచ్చే సరికి టీఆర్ఎస్ మళ్లీ ఆధిక్యత కనబరిచింది.
ఇలా ప్రతిరౌండ్‌లోనూ ప్రజాతీర్పు భిన్నంగా రావడం గమనార్హం. ఇప్పటి వరకూ నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి 700 పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ వుంది. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 15 రౌండ్లు ఉన్న నేపథ్యంలో, గెలుపుపై ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకుంది. మొత్తానికి టీఆర్ఎస్, బీజేపీలకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారనేది నిజం.