రాజకీయాల్లో పొగడ్తలు ఎంత సహజమే, తెగడ్తలు కూడా అంతే సహజం. అయితే ప్రత్యర్థులు పరస్పరం విమర్శించుకోవడం మాత్రమే చూశాం. ఇటీవల కాలంలో విమర్శల పరిధి దాటి, పరస్పరం దూషణలకు దిగుతున్న వైనాన్ని చూస్తున్నాం. జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రత్యర్థుల విషయంలో ఎప్పుడు, ఎలా వ్యవహరిస్తారో ఆయనకే తెలియదన్న అభిప్రాయం వుంది. నిన్న మాట్లాడిన దానికి, ఆ తర్వాత పది రోజులకు అదే మనిషిపై పవన్ అభిప్రాయం భిన్నంగా వుంటోంది.
గుంటూరు జిల్లా ఇప్పటంలో పవన్‌కల్యాణ్ రచ్చరచ్చ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. ఇదే పవన్‌కల్యాణ్ గత మే నెల 25న పూర్తి భిన్నంగా ఎంతో గౌరవాన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ఆ రెండు అంశాల గురించి తెలుసుకుందాం.
ఇప్పటంలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ…
‘ఈ రాష్ట్రానికి సజ్జల రామకృష్ణే డీఫ్యాక్టో ముఖ్యమంత్రి. ఒక్క జనసైనికుడి ప్రాణం పోయినా, సగటు మనిషి ప్రాణం పోయినా దానికి సజ్జల బాధ్యత వహించాల్సిందే’ అని పవన్ హెచ్చరించారు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో అక్కడ హింస చెలరేగింది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యే ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో గత మే నెల 25న మంగళగిరిలో జనసేన కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ సజ్జల గురించి ఏమన్నారంటే…
‘వైసీపీలో మేధావులు, అనుభవజ్ఞులు ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే నాకు చాలా గౌరవం. సజ్జల వంటి పెద్దల అనుభవం కుల ఘర్షణలకు కారణం కాకూడదు’ అని పవన్ అన్నారు. ఆరు నెలల కాలంలోనే సజ్జలను విలన్‌గా చూడడం పవన్‌కే చెల్లింది. సజ్జలపై పవన్ కోపానికి దారి తీసిన కారణాలేంటో మరి. పవన్‌లో స్థిరత్వం లేదనేందుకు సజ్జలపై కామెంట్స్‌ను నిదర్శనంగా చెబుతున్నారు.