జనసేనాని పవన్‌కల్యాణ్‌తో పాటు చంద్రబాబుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అదిరిపోయే పంచ్‌లు విసిరారు. రూ.250 కోట్ల సుపారీ ఇచ్చి పవన్ కల్యాణ్‌ను అంతమొందించే క్రమంలో రెక్కీ నిర్వహించారనే ప్రచారంపై కొడాలి నాని సూపర్ పంచ్ వేశారు. అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి ఏదైనా చేయడం కంటే, ఆ మొత్తాన్ని పవన్‌కల్యాణ్‌కు ప్యాకేజీ ఇస్తే ఈయన వచ్చి తమ పక్కనుంటాడని సెటైర్ విసిరారు. తమ కోసం తిరుగుతాడని ఘాటు విమర్శ చేశారు.
గుడివాడలో శనివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పవన్, చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులని మండిపడ్డారు. హైదరాబాద్‌లో రెక్కీ డ్రామా జరిగినా సీఎం వైఎస్ జగన్‌కే సంబంధమా? అని ఆయన ప్రశ్నించారు.
రెక్కీ పేరుతో పవన్ గాలి మాటలు మాట్లాడాడని ధ్వజమెత్తారు. అప్పుడు విశాఖలో, నేడు ఇప్పటంలో పవన్ నానా హంగామా చేశారని విమర్శించారు. మునుగోడులో కేఏ పాల్ మాదిరిగా ఇప్పటంలో పవన్‌కల్యాణ్ పరుగులు పెట్టారని వెటకరించారు. మునుగోడులో కేఏ పాల్ ఎంటర్టైన్మెంట్తో రక్తి కట్టించినట్టు నాని చెప్పుకొచ్చారు. కేఏ పాల్ కంటే వెనుకబడిపోయానని పవన్ ఇప్పటం వెళ్లాడని చమత్కరించారు. షో అయిపోగానే రెండు గంటలకల్లా వెళ్లిపోయారని ఆయన అన్నారు.
ఏపీలో సంక్షేమ పాలన సాగుతుందే చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో లేని సమస్యలను పవన్, చంద్రబాబు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. పవన్, చంద్రబాబు సొంత సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. వాళ్లిద్దరికీ తమ రాజకీయ జీవితం ఏమవుతుందనే అభద్రతా భావం, భయం ,ఆందోళన ఉన్నాయన్నారు. జగన్ 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా వుంటానంటున్నారని, అదే జరిగితే తమ పరిస్థితి ఇక అంతేనని భయమన్నారు.
రాజకీయంగా తమను తాము కాపాడుకునేందుకు జగన్‌తో పాటు వైసీపీ ప్రభుత్వం మీద నిందలే వేస్తున్నారని మండిపడ్డారు. పవన్ ఇంటి వద్ద తాగుబోతులు హడావుడి చేస్తే రెక్కీ అన్నారని కొడాలి నాని చెప్పుకొచ్చారు. అలాగే చంద్రబాబు తనపై గులకరాయి విసిరారని డ్రామా చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబే తన కార్యకర్తలతో రాయి వేయించుకున్నట్టు కొడాలి విమర్శించారు. గులకరాయితో కొడితే పోవడానికి చంద్రబాబు ఏమైనా పావురమా? పిట్టా? అని ప్రశ్నించారు. నువ్వు పోతే దరిద్రం వదులుతుందని సొంత పార్టీ వాళ్లే రాయి విసిరి వుంటారని ఆయన అన్నారు.
పవన్‌కల్యాణ్ రెక్కీ దెబ్బకి చంద్రబాబు కనపడకుండా పోయారన్నారు. దీంతో చంద్రబాబు తనపై గులకరాయి రెక్కీ చేశారని గగ్గోలు పెడుతున్నాడని మండిపడ్డారు. పవన్‌పై పబ్ రెక్కీ అని అన్నారు. రూ.250 కోట్లతో రెక్కీ అంటూ పవన్ గాలి మాటలు మాట్లాడుతున్నారని తప్పు పట్టారు. తమను తిరగనివ్వడం లేదని, ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని విమర్శించే చంద్రబాబు, పవన్‌కల్యాణ్… ఇద్దరూ కలిసి ఓ ప్రజాసమస్యపై పోరాటం చేసి వుంటే చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.
చంద్రబాబు బాదుడే బాదుడని ఓ పనికి మాలిన కార్యక్రమం పెట్టారన్నారు. తననే బాదమన్నారనే ఉద్దేశంతో ఎవరో రాయితో కొట్టారని దుమ్ము రేపే సెటైర్‌ను విసిరారు. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై ప్రధాని మోదీని అడిగే దమ్ము పవన్, చంద్రబాబుకు లేదని ధ్వజమెత్తారు. ఇడుపులపాయలో హైవే వేయాలంటే పవన్ ప్రధాని అవ్వాలని పవన్‌కు కొడాలి సూచించారు. ప్రధాని అయ్యేందుకు పవన్.. కేఏ పాల్‌తో పోటీ పడుతున్నాడా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.