అనంతపురం టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఆ జిల్లాలో ఏ నియోజకవర్గం చూసినా టీడీపీ వర్గాలుగా విడిపోయింది. ఒక నాయకుడంటే, మరొక నాయకుడికి గిట్టని పరిస్థితి. దీంతో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కంటే, సొంత పార్టీ కుమ్ములాటలే టీడీపీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురంలో నిన్న నిర్వహించిన రాయలసీమ టీడీపీ నేతల సమావేశం పార్టీ అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది.
కార్యకర్తలను నాయకులు పట్టించుకోలేదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే కాలవ శ్రీనివాసులుతో పాటు మరో నాయకుడి కనుసన్నల్లో అంతా జరిగిపోతోందని విమర్శలు గుప్పించారు. వారితోనే పార్టీకి నష్టం వాటిల్లుతోందని విమర్శించారు. మరో సమావేశంలో వివరాలు బయటపెడతానని ఆయన తీవ్ర హెచ్చరికలు చేయడం…తీవ్ర దుమారం సృష్టించింది.
ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డికి సొంత పార్టీ నుంచి దీటైన కౌంటర్ వచ్చింది. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఆదివారం జేసీ ఫ్యామిలీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో మీరు చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జిల్లాలో పోరాటాలు చేశామని ప్రభాకర్ చౌదరి తెలిపారు.
వ్యక్తిగతంగా కార్యకర్తలు లేరని చెప్పడం మీ అహంకారానికి నిదర్శనమని జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా అన్నారు. మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు వివాద రహితుడని వెనకేసుకొచ్చారు. జేసీ కుటుంబమే టీడీపీకి అతిపెద్ద సమస్యగా ప్రభాకర్ చౌదరి తేల్చి చెప్పారు.
అనంతపురం జిల్లాలో రెడ్డి వర్సెస్ చౌదరి అనే రీతిలో టీడీపీ చీలిపోయింది. ఇద్దరి పేర్లు ప్రభాకరే కావడం గమనార్హం. తేడా ఒక్కటే. ఒకరేమో రెడ్డి, మరొకరు చౌదరి. పార్టీ, సిద్ధాంతాల కంటే కులాలే మిన్న అనేందుకు అనంతపురం టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలే ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రెడ్డి, చౌదరి మధ్య విభేదాలను అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.