హైకోర్టును తెలంగాణ మంత్రి ప్రాథేయపడుతున్న వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గణేశుడి విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ హైకోర్టు రెండు రోజుల క్రితం కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వినాయక చవితి ఉత్సవానికి కేవలం ఒకరోజు ముందు హైకోర్టు ఇచ్చిన తీర్పు, నిమజ్జనానికి పెద్ద అడ్డంకిగా మారిందని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో హైకోర్టు పెద్ద మనసు చేసుకుని దయ చూపాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రాథేయపడడం గమనార్హం. హుస్సేన్‌సాగర్‌లో వినాయకుడి నిమజ్జనాలు చేయోద్దంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, తమ ఆంక్షలను వెంటనే అమలుచేయాలంటూ ఆదేశించింది.
హుస్సేన్‌సాగర్‌లో నీరు కలుషితం కాకుండా ఉండాలంటే.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని చెప్పింది. ఈ రకమైన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ప్రత్యేక కుంటలు ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఈ పరంపరలో ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది.
గణేశుడి విగ్రహాల నిమజ్జనం విషయంలో తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ప్రస్తుతం సమయం లేనందున హైకోర్టు పెద్ద మనసు చేసుకొని ఈ ఏడాదికి యథావిధిగా నిమజ్జనం చేసేలా అవకాశం కల్పించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని మంత్రి చెప్పు కొచ్చారు. 48 గంటల్లో వ్యర్థాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు.
వినాయక చవితి పండుగకి కేవలం ఒక రోజు ముందు నిమజ్జనాలపై హైకోర్టు తీర్పు ఇచ్చిందని మంత్రి అన్నారు. అప్పటికే విగ్రహాలు మండపాలకు చేరిపోయాయని చెప్పారు. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అసాధ్యమని వివరించారు. హైదరాబాద్‌లో కుంటల ఏర్పాటు ఇబ్బందని ఆయన అన్నారు.
క్షేత్రస్థాయి పరిస్థితిని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో ముందస్తు ఆదేశాలు ఇస్తే ఏర్పాట్లు చేసుకుంటామని తలసాని అన్నారు. రివ్యూ పిటిషన్‌పై హైకోర్టు స్పందన ఏంటనేది ఉత్కంఠకు తెరలేవనుంది.