సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో, విశ్వక్ సేన్ హీరోగా సినిమా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విశ్వక్ సరసన అర్జున్ కూతురు హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్-విశ్వక్ కాంబినేషన్ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడా సినిమా ఆగిపోయింది.
విశ్వక్ సేన్ తో తను సినిమా చేయనని స్వయంగా నటుడు-దర్శకుడు అర్జున్ సర్జా ప్రకటించాడు. నిబద్ధత, క్రమశిక్షణ లేని విశ్వక్ లాంటి నటుడితో తను పనిచేయలేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
“3వ తేదీ నుంచి విశ్వక్ తో నెల రోజుల షెడ్యూల్ పెట్టుకున్నాను. తనకి ముందే చెప్పాను, రెడీ అన్నాడు. తీరా షూటింగ్ కు ముందు రోజు రాలేనని మెసేజ్ చేశాడు. 2-3 రోజులు రాడేమో అనుకున్నాను. టోటల్ షెడ్యూల్ కాన్సిల్ చేశాడు. ఎప్పటికప్పుడు విశ్వక్ కు ఫోన్ చేస్తున్నాను, మెసేజులు పెడుతున్నాను. ఆ రికార్డింగ్స్ అన్నీ నా ఫోన్ లో ఉన్నాయి. మీకు (జర్నలిస్టులకు) చూపిస్తాను. ఇంత కమిట్ మెంట్ లేని నటుడ్ని నేను చూడలేదు.”
ఇలా ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ సేన్ ను కడిగిపారేశాడు అర్జున్. తను అల్లు అర్జున్ లాంటి నటులతో పనిచేశానని, ఏ హీరో దగ్గర తను ఇలాంటి బిహేవియర్ చూడలేదన్నాడు అర్జున్. మొదటి రోజు ఎలా నెరేషన్ ఇచ్చానో, అంతకంటే మెరుగ్గా తాజాగా విశ్వక్ కు ఇంకోసారి కథ చెప్పానని, అప్పుడు ఓకే చెప్పి ఇప్పుడిలా షూటింగ్ ఎగ్గొట్టడం అన్యాయం అన్నాడు అర్జున్.
ఇదేదో విశ్వక్ ను బెదిరించడం కోసమో, తిరిగి ఆయన్ను రప్పించేందుకో ఈ ప్రెస్ మీట్ పెట్టలేదని, ఇకపై విశ్వక్ తో వర్క్ చేయనని చెప్పడం కోసమే ప్రెస్ మీట్ పెట్టానని అన్నాడు అర్జున్. ఈ ప్రాజెక్టులో తనకు వంద కోట్లు వచ్చినా, పోయినా విశ్వక్ తో సినిమా చేసేది లేదని తెగేసి చెప్పారు.
తన 42 ఏళ్ల కెరీర్ లో విశ్వక్ అంత నిబద్ధతలేని, క్రమశిక్షణ లేని హీరోను చూడలేదన్నాడు అర్జున్. తనకు జరిగినట్టు భవిష్యత్తులో మరో నిర్మాతకు జరగకూడదనే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టినట్టు తెలిపాడు.