టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసినా విమర్శలు, ప్రతివిమర్శలకు మాత్రం ఏ మాత్రం తక్కవ కాలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పాలనే నయమని వ్యాఖ్యానించడం గమనార్హం. అప్పుడే తమకు విలువ ఉందని చెప్పారు.
ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ తనదైన స్టైల్‌లో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన నాయకుడిగా అభివర్ణించారు. కేసీఆర్ మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతనే వుండదని విమర్శించారు. తానొక చక్రవర్తిగా భావించి తెలంగాణను ఏలుతున్నారని తప్పు పట్టారు. మోదీ నేతృత్వంలో దేశం అధోగతి పాలవుతోందని కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం వెల్లడించిన బాధంతా తెలంగాణలో తాము అనుభవిస్తున్నామని ఆయన అన్నారు.
2014 నుంచి టీఆర్ఎస్ సర్కార్ పరిపాలనపై కేసీఆర్ తనతో చర్చకు రావాలని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ఇటీవల ఎమ్మెల్యే కొనగోలు వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఏ విధంగా శుద్ధపూసలో, నిప్పు కణికలు అవుతారో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. 2018లో టీఆర్ఎస్‌కు 90 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మానవత్వం లేకుండా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ఈటల విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ గుర్తు మీద గెలిచినా వాళ్లకు మంత్రి పదవి ఎలా కట్టబెట్టారని ఆయన నిలదీశారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని కేసీఆర్‌ను ఓ రేంజ్‌లో నిగ్గదీసి అడిగారు.
కాంగ్రెస్ హయాంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న గౌరవం, మర్యాద తమకూ ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో తాము అడిగిన పనులు చేసేవారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీడియా మీద ఆంక్షలు విధించింది మీరు కాదా? అని కేసీఆర్‌ను ఈటల ప్రశ్నించారు పెద్ద పెద్ద టీవీ చానెల్స్‌ను బెదిరించి లొంగదీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అహంకారం, దుర్మార్గాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.