ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉంటుందా ఉండదా? అనే విషయంలో రకరకాల పుకార్లు ఇప్పటికే చెలరేగుతున్నాయి. ఎవరికి వారు తమకు తోచిన రీతిలో ఈ పుకార్లను పెంచి పోషించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక కామెడీని గమనించాలి. విపక్షాలకు చెందిన ఏ నాయకుడు మాట్లాడుతున్నా గానీ.. అమరావతి గురించి నాలుగు ఆరోపణలు చేసేయడం.. అంతిమంగా.. ఈవిషయంలో సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టత ఇవ్వాలి అని ముగించడం అలవాటుగా జరుగుతోంది. ఇంతకూ సీఎం జగన్ ఎందుకు స్పష్టత ఇవ్వాలి?
‘ఎవడో జ్వాలను రగిలించాడు.. వేరెవడో దానికి బలియైనాడు’ అంటుంది ఒక సినీగీతం. ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లు కూడా అచ్చంగా అదే మాదిరిగా కనిపిస్తున్నాయి. ఎవడో పుట్టించిన పుకార్లకు జగన్మోహన రెడ్డిని స్పష్టత ఇవ్వమని అనడం చాలా చిత్రంగా ఉంది. పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో కొంత జగన్ కు అనుకూలంగానే ఓ మాట అన్నారు.
‘జగన్మోహనరెడ్డిగానీ, ఆయన కుటుంబసభ్యులుగానీ, సన్నిహితులు గానీ.. ఎవరూ రాజధాని తరలిపోతుందనే మాట అనలేదు’ అని పవన్ అన్నారు. కానీ ఆయనకూడా జగన్ నుంచి స్పష్టత కోరుతున్నారు. ఇక్కడ ఇంకో సంగతి గమనించాలి. జగన్ తాను సీఎం గనుక.. తన కుటుంబానికి చెందిన ఎవ్వరూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోడానికి అనుమతించే రకం కాదు… ఆ విషయం పవన్ మాటల్లో కూడా తెలుస్తోంది.
ఎవడో పుట్టించిన పుకార్లకు సీఎం జవాబు ఇవ్వడం ఆ పదవికి బాధ్యత అయితే గనుక.. పొద్దస్తమానమూ సంజాయిషీలు ఇవ్వడంలోనూ, స్పష్టత ఇవ్వడంలోనూ గడచిపోతుంటుంది. రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో రోజుకోమూల ఎవడో ఒకడు ఏదో ఒక పుకారు పుట్టిస్తూనే ఉంటాడు. వాటన్నిటినీ సీఎం పట్టించుకోవడం అనేది అసాధ్యం.
డిమాండ్లు చేసే వారు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. సర్కారు మీద రాళ్లు రువ్వడం కాదు, తమ డిమాండ్‌లో కూడా వాస్తవికత ఉండాలని జాగ్రత్త తీసుకోవాలి.