తెలుగుదేశం పార్టీ తరఫున ‘భావి ముఖ్యమంత్రి’ అనే ట్యాగ్ లైన్ ను తగిలించుకుని తిరుగుతున్న నారా లోకేష్ గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేశాడు. మంత్రిగా, ముఖ్యమంత్రి కొడుకుగా బరిలోకి దిగినా దారుణమైన పరాభవం దక్కింది. వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యే ఆళ్ల తాజాగా ఒక వ్యాఖ్య చేశారు. మంగళగిరిలో లోకేష్ ను గెలిపించడానికి జనసేనాని పవన్ కల్యాణ్ చాలా తపన పడ్డారని బయటపెట్టారు.
ఈ కామెంట్స్ చాలా వరకు నిజం ఉందని అనిపిస్తోంది. రాజధాని ప్రాంతంలో పవన్ కల్యాణ్ పర్యటించడం, మంగళగిరిలోనే రైతులతో సమావేశం నిర్వహించడం జరిగిన తర్వాత.. ఆళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వెంట రాజధాని ప్రాంతంలో పర్యటించిన వారంతా తెలుగుదేశం కార్యకర్తలే అని ఆయన చెప్పుకొచ్చారు. జనసేన- తెలుగుదేశం గత ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందంతో వైకాపాను ఓడించడానికి ప్రయత్నించాయనేది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. పవన్ కూడా.. అధికార తెదేపాకంటె, జగన్ మీదనే ఎక్కువ విమర్శలు చేయడం వలన అలాంటి అభిప్రాయం వచ్చింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఆళ్ల తాజా ఆరోపణల నేపథ్యంలో అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటే నిజంగానే కనిపిస్తున్నాయి. మంగళగిరిలో సాంప్రదాయంగా వామపక్ష పార్టీలకు అంతో ఇంతో బలం ఉంది. జనసేన 2019 ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని బరిలోకి దిగింది. పొత్తుల్లో భాగంగా ఆ స్థానాన్ని సీపీఐకు కేటాయించారు. కానీ.. సీపీఐకు అక్కడ ఓటు బ్యాంకు ఉన్నది గనుక.. వారు గణనీయమైన ఓట్లను సాధిస్తే.. అది అధికారపార్టీకి నష్టం చేస్తుంది.
ఆ అంచనాతో.. చివరి నిమిషంలో పొత్తు ఒప్పందాలను తుంగలో తొక్కి.. అదే మంగళగిరి స్థానానికి తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. ఎందుకలా చేశారనేది ఎక్కడా వివరణ ఇవ్వలేదు. దీంతో సీపీఐ గతిలేక మిన్నకుండిపోయింది. చివరి నిమిషంలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించిన పవన్, ఆ నియోజకవర్గం గురించి అసలు పట్టించుకోలేదు. ఒక్కసారి కూడా ప్రచారానికి రాలేదు. ఆ రకంగా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. లోకేష్ గెలవడానికి ఆయన స్కెచ్ వేశారు. కానీ ప్రజల ఎదుట ఆ పాచిక పారలేదు. లోకేష్ కు ఓటమి తప్పలేదు. ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆరోపిస్తోంటే.. అప్పటి ఎపిసోడ్ అంతా నిజమే అనిపిస్తోంది. లోకేష్ ను గెలిపించడానికి పవన్ తహతహలాడిపోయినట్లు కనిపిస్తోంది.