ఇందులో సలహా కంటే సెటైర్ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సెటైర్ వేసింది ఎవరో కాదు, ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ దర్శకుడు జెరోమ్ సాల్. సెటైర్ వేసింది దేనిపైనో తెలుసా. అక్షరాలా సాహో సినిమా మీద. అవును.. గతంలో అజ్ఞాతవాసి సినిమాపై స్పందించిన ఈ ఫ్రెంచ్ దర్శకుడు, ఈసారి సాహోను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు.
గతంలో వచ్చిన అజ్ఞాతవాసి, తాజాగా వచ్చిన సాహో సినిమాలు రెండూ లార్గో వించ్ నుంచి స్పూర్తి పొందినవే. కాకపోతే స్క్రీన్ ప్లేలో చిన్న చిన్న మార్పులు చేశారంతే. వారసుడు ఎవరనే విషయం అజ్ఞాతవాసిలో ముందే తెలిసిపోతుంది. అదే వారసుడు ఎవరనే విషయం సాహోలో క్లైమాక్స్ లో తెలుస్తుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. సరిగ్గా దీనిపైనే జెరోమ్ రియాక్ట్ అయ్యాడు.
సాహో సినిమా లార్గో వించ్ కు రెండో ఫ్రీమేక్ గా కనిపిస్తోందని, కాకపోతే మొదటి దాని (అజ్ఞాతవాసి) కంటే మరింత బ్యాడ్ గా తీశారని ట్వీట్ చేశాడు జెరోమ్. తన సినిమాని కాపీ కొడితే కొట్టారు కానీ, ఆ పనేదో సక్రమంగా చేయమని తెలుగు దర్శకులకు ఓ సలహా కూడా ఇచ్చాడు.
సాహో సినిమా విడుదలైన మొదటి రోజే అది లార్గో వించ్ కు దగ్గరగా ఉందనే విమర్శలు వచ్చాయి. అజ్ఞాతవాసి విడుదల టైమ్ లో ఆ సినిమా దర్శకుడు రియాక్ట్ అయ్యాడు కాబట్టి, కచ్చితంగా సాహో విషయంలో కూడా జెరోమ్ స్పందిస్తాడని అంతా ఎదురుచూశారు. చాలామంది టాలీవుడ్ క్రిటిక్స్ అతడ్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. దీంతో జెరోమ్, సాహోపై స్పందించాడు.