రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిని వెలగబెట్టిన తర్వాత.. తిరిగి రాజకీయాల్లోకి రావడం, ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడం.. తిరిగి గవర్నర్ గా వెళ్లడం, తిరిగి రాజకీయాల్లోకి రావడం.. ఇట్లాంటి పరిణామాలు మనకు కొత్త కాదు. గతంలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఇలాంటివి చాలా జరిగాయి. ఇప్పుడు భాజపా రాజకీయాల్లో కూడా అలాంటి అవకాశం క నిపిస్తోంది. మహారాష్ట్ర గవర్నరుగా మొన్నటివరకూ పనిచేసిన సీహెచ్. విద్యాసాగరరావు.. తెలంగాణ రాష్ట్ర క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి.
భాజపాకు సుదీర్ఘకాలంగా విద్యాసాగరరావు.. కీలకమైన నాయకుడు. వాజపేయి ప్రభుత్వ హయాంలోనే ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాతి కాలంలో తెలంగాణలో భాజపా ప్రాభవమే తగ్గింది. అలాంటి సీహెచ్‌ను మోడీ సర్కారు వచ్చిన తర్వాత.. మహారాష్ట్ర గవర్నరుగా నియమించింది. తాజాగా ఆ రాష్ట్రానికి కొత్త గవర్నరుగా భగత్‌సింగ్ కోశ్యారి ని నియమించారు.
ఆ స్థానాల్లో ఉన్న వారిలో ఒక్క కల్రాజ్ మిశ్రాకు తప్ప మరెవ్వరికీ బదిలీలు కూడా ఇవ్వలేదు. దీంతో విద్యాసాగరరావు మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. తెలంగాణలో భాజపా.. తమ పార్టీని బలోపేతం చేయడంపై బాగా దృష్టిపెట్టింది. ఎంపీ ఎన్నికల్లో ఏకంగా నాలుగు సీట్లు గెలవడంతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
మరింత శ్రద్ధగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గణనీయంగా ప్రజాదరణ దక్కించుకునే స్థాయికి వెళ్లవచ్చునని వారు ఆశపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో పలువురు ఇతర పార్టీల నేతలు వలస వచ్చి భాజపాలో చేరుతున్నారు. ఇలాంటి సమయంలో.. తెలంగాణ రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు, కులాల సమతూకం పరంగా కూడా.. పార్టీకి దన్నుగా నిలవగలిగిన వాడు అయిన విద్యాసాగర్ రావును తిరిగి తెరమీదకు తెస్తే పార్టీకి అన్ని రకాలుగా లాభం ఉంటుందని వారు భావిస్తున్నట్లు సమాచారం.