గులాబీలో చిచ్చు.. ఎగదోస్తున్న కమలం

గులాబీ పార్టీలో చిచ్చు పుట్టింది. దానిని మరింతగా ఎగదోసే ప్రయత్నంలో ఉన్నది కమలం!! మంట రాజుకునేలా చేసి.. ఆ అగ్నికీలల్లో గులాబీ దగ్ధమైపోతే గనుక… ఆ వేడుక చూడాలని కమలనాయకుల ముచ్చట! అందుకోసం వారు…

గులాబీ పార్టీలో చిచ్చు పుట్టింది. దానిని మరింతగా ఎగదోసే ప్రయత్నంలో ఉన్నది కమలం!! మంట రాజుకునేలా చేసి.. ఆ అగ్నికీలల్లో గులాబీ దగ్ధమైపోతే గనుక… ఆ వేడుక చూడాలని కమలనాయకుల ముచ్చట! అందుకోసం వారు వ్యూహాత్మకమైన ప్రకటనలు చేస్తున్నారు. మరి వారి ప్రయత్నంలో సఫలం అవుతారా లేదా?

ఈటల రాజేందర్ చుట్టూతా.. తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్గత రాజకీయాల్లో ఒక వివాదం ముసురుకుని ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈటల అవినీతి గురించి కొన్ని పత్రికల్లో వార్తలు రావడం.. సోషల్ మీడియాలో బీభత్స ప్రచారం జరగడం.. వాటిపట్ల ఈటల మనస్తాపం చెందడం జరిగింది. ఆ ఆవేదన వెళ్లగక్కడంలో.. రాష్ట్రం కోసం పోరాడిన మేమే గులాబీ జెండాకు నాయకులం.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని మరింత పెంచాయి. అదేదో తిరగుబాటు లాగా కొందరు రంగు పులిమారు.

ఈటల వివాదం సద్దుమణుగుతున్నట్లుగా కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో.. భాజపా నాయకులు ఆ మంటను మళ్లీ ఎగదోస్తున్నారు. ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. తెరాస పార్టీలో అసలైన తెలంగాణ ఉద్యమ కారులకు గుర్తింపు లేదని విమర్శించారు. తెరాసలో ఉద్యమకారులు, కార్యకర్తలతో కలసి పనిచేసేది హరీశ్ రావు, ఈటల రాజేందర్ మాత్రమేనని ధర్మపురి అరవింద్ అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

అసలే ఈ వ్యవహారంతో అనేక పుకార్లు ముడిపడి ఉన్నాయి. ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి తొలగిస్తారనే ప్రచారం ఉంది. అలాగే హరీశ్ రావు భాజపాలో చేరుతారనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి పుకార్లన్నీ పరోక్షంగా భాజపాకు లాభం చేకూర్చేవే. అందుకే ఈ పుకార్లను నిజం చేయడానికి కమలనాయకులు కంకణం కట్టుకున్నట్టుంది.

హరీశ్ రావు, ఈటల రాజేందర్ ఇద్దరికీ పార్టీలో అన్యాయం జరుగుతున్నట్లుగా, వారిలో అసంతృప్తి రగులుతున్నట్లుగా వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అది పార్టీలో లుకలకలకు, చీలికకు దారి తీయాలని భాజపా ఆశ పడుతున్నట్లుగా ధర్మపురి అరవింద్ మాటలు నిరూపిస్తున్నాయి.