నిన్నటి వరకూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చంద్రబాబు విష ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో తనపై వ్యతిరేకత వస్తోందని పసిగట్టారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని చంద్రబాబే జగన్ సంక్షేమ పాలనపై విషం కక్కుతున్నారనే సంగతి జనానికి తెలిసిపోయింది. జగన్ సంక్షేమ పాలనతో రాష్ట్రం మరో శ్రీలంకలా మారుతుందంటూ ఎల్వీ సుబ్రమణ్యం, ఆర్బీఐ ఉన్నతాధికారుల అభిప్రాయాల్ని ఎల్లో మీడియా బ్యానర్ కథనాలుగా అచ్చోసిన సంగతి తెలిసిందే.
తన దృష్టిలో భగవద్గీతగా భావించే ఈనాడు పత్రిక జగన్ సంక్షేమ పాలనపై కక్ష కట్టినట్టు కథనాలు రాస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అసలుకే ఎసరు వస్తుందని చంద్రబాబులో ఆందోళన మొదలైంది. అందుకే ఆయన సంక్షేమ పథకాలపై సానుకూల ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.
నందిగామ, జగ్గయ్యపేటల్లో జరిగిన బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను నిలిపేస్తుందన్న ప్రచారం జరుగుతోందన్నారు. ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ ఆపేది లేదని ఆయన కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. అంతేకాదు, వాటిని కొనసాగిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన వేడుకోవడం గమనార్హం.
అధికారంలోకి వచ్చిన రోజు మొదలుకుని సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేసే జగన్‌ను కాదని, మళ్లీ చంద్రబాబును ఎన్నుకోవాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న ఉదయించింది. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ తానూ అమలు చేస్తాననడం… బాబులో వచ్చిన భయంతో కూడిన మార్పుగా చెప్పొచ్చు.
సంక్షేమ పథకాలకే అప్పులు చేయాల్సిన పరిస్థితి. వాటిని అమలు చేస్తూ అభివృద్ధి ఎలా చేస్తారనే చర్చకు తెరలేచింది. జగన్ సంక్షేమ పాలనను విమర్శిస్తూ, మళ్లీ ఆయన్నే అనుసరిస్తానని బాబు చెప్పడం విడ్డూరంగా వుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో బాబు పాలనంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన వైనాన్ని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
చివరికి అన్నా క్యాంటీన్లను కూడా ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు మాత్రమే ప్రారంభించారని వైసీపీ చెబుతోంది. నిరుద్యోగులకు భృతి కూడా ఇదే రీతిలో అమలు చేశారని, డ్వాక్రా అక్కచెల్లెళ్లకు ఎన్నికలకు ముందు పసుపు, కుంకుమ కింద ఎర వేసినా, వాళ్లు మోసాన్ని పసిగట్టి వాత పెట్టారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.