న్యాయ వ్యవస్థపై ఎంతో గౌరవం ఉన్నట్టు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నటిస్తుంటారనే విమర్శలున్నాయి. కానీ ఆయన మనసు మాత్రం న్యాయ వ్యవస్థను కించపరిచేలా వుంటుందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఈ అభిప్రాయాలకు బలం కలిగించేలా ఆయన కామెంట్స్ వున్నాయి. చివరికి సుప్రీంకోర్టును కూడా అనుమానించే వరకూ ఆయన వెళ్లారు.
ఏపీ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లకు సంబంధించి విచారణకు ముందే రావడం వెనుక సుప్రీంకోర్టుకు దురుద్దేశాల్ని ఆయన అంటగట్టారనే విమర్శలొచ్చాయి. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నెల 21న ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై వాదనలు కొనసాగనున్నట్టు మొదట కేసు లిస్ట్ అయ్యిందని ఆయన అన్నారు. ఆకస్మికంగా గత గురువారం రాత్రి కేసు శుక్రవారానికి లిస్ట్ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని ఆయన అన్నారు.
ఒక్కొక్క కేసు వారాలు, నెలల తరబడి వాయిదా పడుతుండగా, ఈ కేసు మాత్రం ముందే లిస్ట్ కావడం వెనుక ఆంతర్యం ఏమిటనేది అంతు చిక్కడం లేదని రఘురామకృష్ణంరాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మిగతా కేసులు సంవత్సరాల తరబడి వాయిదా పడుతుంటే, ముఖ్యమంత్రి దాఖలు చేసిన కేసులు మాత్రం ముందుగానే విచారణకు వస్తున్నాయని రఘురామ చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చకు తెరలేచింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను ఆయన తప్పుపట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? అలాగే ఏపీ హైకోర్టులో కూడా జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన కేసులేవీ లిస్ట్ కావడం లేదని ఆయన ఆరోపించడం వెనుక… న్యాయ వ్యవస్థని బ్లాక్ మెయిల్ చేయడమే అని న్యాయ నిపుణులు అంటున్నారు.
సుప్రీంకోర్టులో మూడు రాజధానులపై విచారణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, న్యాయ వ్యవస్థపై రఘురామకృష్ణంరాజు దాడి చేయడం ఆసక్తికర పరిణామం. న్యాయ వ్యవస్థపై ఒత్తిడి లేదా బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం దుస్సాహసమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానులపై తమకు వ్యతిరేక తీర్పు వస్తుందనే భయమే… రఘురామకృష్ణంరాజుతో న్యాయ వ్యవస్థపై దాడి చేసేందుకు పచ్చ గ్యాంగ్ కుట్ర చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.