కత్తి డ్రామా! రాయి హత్యాయత్నం!

అది కోడి కాలికి కట్టేదే కావొచ్చు.. కానీ దాని పేరు కత్తి!, దూరంగా ఉన్న భవంతినుంచి విసరగలిగారంటే.. అదేమీ బండ కాదు, దానిపేరు రాయి! Advertisement ఈ చిన్న లాజిక్ ను ఇప్పుడు అందరూ…

అది కోడి కాలికి కట్టేదే కావొచ్చు.. కానీ దాని పేరు కత్తి!, దూరంగా ఉన్న భవంతినుంచి విసరగలిగారంటే.. అదేమీ బండ కాదు, దానిపేరు రాయి!

ఈ చిన్న లాజిక్ ను ఇప్పుడు అందరూ మిస్సవుతున్నారు. తెలుగుదేశం తైనాతీ పత్రికలకు ఇంకా పూనకం వచ్చేస్తోంది. ‘పదునైన’ రాయి విసిరారు, భద్రతాధికారి ‘రెప్పపాటులో’ అడ్డు నిలిచారు… ఇలా విశేషణాలు జోడించి మరీ తమ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబునాయుడు మీటింగు పెడితే.. ఎవడో ఆకతాయి రాయి విసిరాడు. కాన్వాయ్ మీదికి దూసుకు వచ్చింది.. చంద్రబాబు భద్రతాధికారి మధు అనే వ్యక్తికి తగిలింది. గాయమైంది. చికిత్స కూడా చేశారు. 

ఆకతాయి పనే అయినప్పటికీ.. చంద్రబాబు మీద అనే కాదు.. ఏ నాయకుడి మీద అయినా ఎవరైనా ఇలాంటి పనికి పాల్పడడం తప్పు. సమర్థనీయం కాదు. కానీ.. ఈ వ్యవహారాన్ని క్యాష్ చేసుకోవడానికి, పొలిటికల్ మైలేజీకోసం అనుకూలంగా మార్చుకోవడానికి తెలుగుదేశం మరియు వారి తైనాతీలు పడుతున్న తాపత్రయం గమనిస్తే ఏవగింపు కలుగుతోంది.

చంద్రబాబు మీద విసిరింది రాయి మాత్రమే.. పేల్చిన తూటా కాదు. దానికే తన మీద హత్యా ప్రయత్నం జరిగినంత ఘోరంగా రాద్ధాంతం చేస్తున్నారు. నానా యాగీ చేస్తున్నారు. రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారని, భద్రతలో ఫెయిలయ్యారని ఆడిపోసుకుంటున్నారు. చంద్రబాబునాయుడు అసలు ఎన్ఎస్‌జీ భద్రత ఎందుకు తీసుకున్నారు. ఆయనకు తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర పోలీసులు మీద నమ్మకం లేక తీసుకున్నారా? లేదా, తనలో అపరిమితమైన ప్రాణభయం ఉన్నందువల్ల తీసుకున్నారా? 

ఇప్పుడు ఈ రాయిని హత్యాయత్నం లాగా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం దళాలు.. వాళ్ల ప్రభుత్వ హయాంలో జగన్ మీద జరిగిన దాడిని మాత్రం నాటకంగా అభివర్ణించే ప్రయత్నం చేస్తారు. అందులో వారికి ఏమాత్రం అవమానంగాను, సిగ్గుగాను అనిపించదు. 

తన భార్యను అవమానకరంగా మాట్లాడితే.. విలపించిన చంద్రబాబు.. ఆ విషయం ఊరూరా తిరిగి ప్రతిచోటా చెప్పుకుంటూ.. రాజకీయ మైలేజీ పొందడానికి చాలా చీప్ ట్రిక్స్ ప్రయోగించిన చంద్రబాబు.. ఈ ‘గులకరాయి హత్యాయత్నాన్ని’ కూడా.. భారీ స్థాయి ప్రచారానికి వాడుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఈ నాటకాలను ప్రజలు తెలుసుకోలేరు అనుకుంటేనే పొరబాటు.