‘అడిగి కొట్టిచ్చుకోరా బుడుగు దాసరీ’ అన్న సామెత చందంగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. కాశ్మీర్ అంశంపై అంతర్జాతీయంగా భారత్ ను అప్రతిష్ట పాల్జేయాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పాక్, అందుకు దాదాపు ప్రతి వేడుకను వాడుకుంటోంది. ఈ క్రమంలో మాల్దీవుల్లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు సందర్భంగా కూడా.. కాశ్మీరు అంశాన్ని ప్రస్తావనకు తెచ్చి అభాసుపాలైంది.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అధిగమించడం అనే అంశంపై మాల్దీవుల్లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు భారత ప్రతినిధులుగా లోక్ సభ స్పీకరు ఓంప్రకాశ్ బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ హాజరయ్యారు. సదస్సులో పాకిస్తాన్ వంతు రాగానే ఆ దేశ ప్రతినిధి ఖాసీం సూరీ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కాశ్మీర్ లో పౌరుల అణచివేతను తాము సహించేది లేదని ఆయన అన్నారు.
దీంతో భారత్ దీటుగా స్పందింది. కాశ్మీర్ అనేది తమ దేశపు అంతర్గత వ్యవహారం అని… దీనిని అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని పాకిస్తాన్ యోచిస్తున్నట్లు పేర్కొంది. సదస్సు ఏర్పాటుకు భిన్నంగా.. ఇలాంటి అంశాలు ప్రస్తావనకు రావద్దని అంటూనే.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేయాలని కూడా వారు కోరారు. సూరీ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు.
ఈలోగా మరో పాక్ ప్రతినిధి వాదనకు దిగడంతో.. సభకు అధ్యక్షత వహించిన మాల్దీవుల స్పీకర్ మహ్మద్ నషీద్ ఆమెను అడ్డుకున్నారు. ఆ వాదనను రికార్డులనుంచి తొలగించేందుకు నషీద్ భారత ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
పాక్ ఈ చర్చ లేపడంతో.. భారత ప్రతినిధుల బంగ్లాదేశ్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. తమ సొంత దేశీయులైన బంగ్లా ప్రజపై మారణహోమం సృష్టినంచిన పాక్ కు కాశ్మీర్ అంశంపై మాట్లాడే హక్కు లేదన్నారు. దీంతో బంగ్లాలో పాకిస్తాన్ అప్పట్లో చేసిన అరాచకాలన్నీ తవ్వి తీసినట్లయింది. బంగ్లాలో అప్పట్లో పాక్ పాల్పడిన ఊచకోతలను, దుర్మార్గాలను గుర్తు చేసుకున్న ఎవరికైనా సరే.. పాక్ పై సానుభూతి నశిస్తుంది. అనవసరంగా అంతర్జాతీయ వేదికపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి పాకిస్తాన్ చేజేతులా నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లు అయింది.