పవన్ బర్త్‌డే : ఓటుకు అయిదొందలు!

పవన్ కల్యాణ్ పుట్టినరోజు వచ్చింది. ఈ సందర్భంగా తమ  ప్రియమైన జనసేనానికి కానుకగా వంద కోట్ల రూపాయల పార్టీ ఫండ్ సేకరించి ఇవ్వాలని జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు డిసైడ్ అయ్యారుట. ఈ సంగతిని…

పవన్ కల్యాణ్ పుట్టినరోజు వచ్చింది. ఈ సందర్భంగా తమ  ప్రియమైన జనసేనానికి కానుకగా వంద కోట్ల రూపాయల పార్టీ ఫండ్ సేకరించి ఇవ్వాలని జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు డిసైడ్ అయ్యారుట. ఈ సంగతిని పవన్ కల్యాణ్ సోదరుడు, పార్టీ నాయకుడు అయిన నాగబాబు.. తన వీడియో సందేశంలో తెలియజేశారు. నిధి సేకరణలో పవన్ అభిమానుల అంకితభావానికి, ఇప్పటికే కొంత మొత్తం జమచేసిన వారి శ్రద్ధకు ఆయన అభినందనలు తెలిపారు.

ఒక ప్రాంతీయ పార్టీ అచ్చంగా అభిమానుల నుంచి వందకోట్ల రూపాయల పార్టీ ఫండ్ ను సేకరించడం అనేది చిన్న విషయంకాదు. జనసేన ఇప్పటిదాకా కేవలం సినీ హీరోగా పవన్‌కు ఉన్న కరిష్మా మీద ఆధారపడిన పార్టీ మాత్రమే. ఇప్పటిదాకా అధికారంలోకి రాని, కేవలం ఒకే  ఒక్క ఎమ్మెల్యేను కలిగి ఉన్న పార్టీ.. ఏకంగా.. వందకోట్ల పార్టీ నిధిని టార్గెట్ చేయడం ఆశ్చర్యమే. ఈ టార్గెట్ ను వాళ్లు ఎలా రీచ్ అవుతారనేది ఆసక్తికరంగానే ఉంది.

పవన్ సినిమా రిలీజ్ అయితే ఓపెనింగ్ మార్నింగ్ షోకు ఎన్ని టికెట్లు తెగుతాయి… అనేదానిని బట్టి.. జనసేన అభిమానులను లెక్కవేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్లు వేరు.. వీళ్లు వేరు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది మాత్రమే అంతో ఇంతో పరిగణనలోకి తీసుకోదగిన అంశంగా కనిపిస్తోంది.

ఈ ఎన్నికల్లో పవన్ పార్టీకి వచ్చినది కేవలం 6.8 శాతం ఓట్లు. ఓట్ల పరంగా చూస్తే.. పార్టీ రాష్ట్రమంతా కలిపి 20 లక్షల ఓట్లు సాధించింది. ఆ 20లక్షల్లో.. పవన్ ద్వారా.. అవినీతి లేని రాజకీయాలు చూడవచ్చుననే ఆశతో ఓటువేసిన తటస్థులు కూడా కొందరు ఉంటారు. వారిని మినహాయించకపోయినా.. మొత్తంగా చూసినప్పుడు.. మొత్తం ఓట్లు వేసిన 20లక్షల మంది తలా 500 రూపాయలు చందాగా వేసుకుంటే… జనసేన ఆశిస్తున్న వంద కోట్ల రూపాయల టార్గెట్ పార్టీ ఫండ్ ను సేకరించడం కుదురుతుంది.

సాధారణంగా రాజకీయ పార్టీలు తమకు ఓటు వేసినందుకు ప్రజలకు డబ్బులిస్తుంటాయి. కానీ.. పవన్ కల్యాణ్ నీతిమయమైన రాజకీయాలు నడపదలచుకుంటున్నాడు కాబట్టి.. ఓటు వేసినందుకు ప్రజలనుంచే డబ్బు ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ లెక్కన గాజుగ్లాసు గుర్తుకు ఓటు వేసిన వాళ్లు.. ఓటుకు 500 వంతున జమచేస్తే.. జనసేన నిధుల విషయంలో తమ  లక్ష్యం చేరుకుంటుంది.