జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ స్వయంగా పెంచి పోషిస్తున్నది అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అలాంటి నేపథ్యంలో.. కాశ్మీర్ ప్రాంతంలో ప్రస్తుతం మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవలపై ఉన్న ఆంక్షల గురించి పాకిస్తాన్ ఆక్రోశిస్తున్నారు సబబే. కాశ్మీర్ లో తాము పోషిస్తున్న ఉగ్రవాదులతో, కాంటాక్ట్ లోకి రావడానికి, అక్కడ అ అల్లర్లను ప్రేరేపించడం ద్వారా అస్థిరత సృష్టించటానికి ఈ ఆంక్షలు అడ్డుగా ఉన్నాయని వారు బాధపడుతున్నారు. కాశ్మీర్ లో ఉన్న ఆంక్షలపై. ఆవేదన చెందుతున్న పాకిస్తాన్ కుట్ర ఏమిటో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అంతర్జాతీయ సమాజం ముందు ఆవిష్కరించారు.
విదేశాలలో పర్యటిస్తూ.. ప్రస్తుతం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో ఉన్న జైశంకర్ అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆంక్షల గురించి వివరణ ఇచ్చారు. కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులకు, పాకిస్తాన్లో ఉన్న వారి నాయకులకు మధ్య సంబంధాలను కట్టడి చేయాలంటే ఇలాంటి ఆంక్షలు తప్పవని ఆయన అన్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చరిల్లకుండా ఉండడానికి, మరి కొన్నాళ్లపాటు ప్రజలు ఈ అంశాలను భరిస్తూ సహకరించాల్సి ఉంటుందని జైశంకర్ అంటున్నారు.
ఆర్టికల్ 370 ను రద్దు చేసిన నాటి నుంచి కాశ్మీరులోయలో రకరకాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. జమ్మూ ప్రాంతంలో ఆంక్షలు కొంతమేరకు సడలించారు. కాశ్మీర్ లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి సాధారణ జీవనాన్ని భాజపా సర్కారు అణిచి వేస్తుందని దేశంలోని ఉదారవాదులు కూడా గోల చేస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న విపక్ష నాయకుల వ్యాఖ్యలను కోట్ చేస్తూ, పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఆ నేపథ్యంలో మన విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మొబైల్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా అందుబాటులోకి తెస్తే.. కాశ్మీరులోయలో ఇప్పుడున్న ప్రశాంతతకు అది గొడ్డలిపెట్టు అవుతుంది. ఉగ్రవాద చర్యలు హఠాత్తుగా పెరుగుతాయి. అందుకే ఆంక్షల విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తుంది.