ది గ్రేట్ ఎస్కేప్

సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు, చారిత్రక గ్రంథకర్త ఎం.వి.ఆర్.శాస్త్రి కొత్త పుస్తకం ‘సుభాస్ చంద్ర బోస్’లో నేతాజీ దేశంనుంచి తప్పించుకు పోయిన ఎడ్వెంచర్ ను చిత్రించిన తొలి అధ్యాయమిది. ’గ్రేట్ ఆంద్ర‘ ఎక్స్ క్లూజివ్ గా…

సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు, చారిత్రక గ్రంథకర్త ఎం.వి.ఆర్.శాస్త్రి కొత్త పుస్తకం ‘సుభాస్ చంద్ర బోస్’లో నేతాజీ దేశంనుంచి తప్పించుకు పోయిన ఎడ్వెంచర్ ను చిత్రించిన తొలి అధ్యాయమిది. ’గ్రేట్ ఆంద్ర‘ ఎక్స్ క్లూజివ్ గా మీ కోసం . ఈ పుస్తకం ఈ నెలాఖరులో వెలువడనున్నది. అమెజాన్ ఇండియాలో దొరుకుతుంది. ఇతర వివరాలకు : [email protected]

“ముఖ్యవిషయం మాట్లాడాలి. ఒకసారి ఇంటికి వచ్చిపో’.
తల్లినుంచి ఉత్తరం అందగానే అశోక్ నాథ్ బోస్ సెలవుపెట్టి మూడోనాటికల్లా కోలకతా చేరాడు.
‘బాబాయి నీతో మాట్లాడాలట. సాయంత్రం వెళ్లికలు, అతడు చెబితేనే నీకు ఉత్తరం రాశాను’ అంది తల్లి.
బాబాయి సుభాస్ చంద్ర బోస్! పక్షం రోజులకిందే జైలునుంచి స్ట్రెచర్ మీద ఇంటికొచ్చాడు. మెల్లిగా కోలుకుంటున్నాడు. తన గది వదిలి బయటకి రావడం లేదు. తప్పనిసరి అయితే తప్ప ఎవరినీ కలవటం లేదు. 

అశోక్ తండ్రి శరత్ చంద్ర బోస్. ఆయన సుభాస్ కి రెండో అన్నయ్య. వాళ్ల నివాసం 1, ఉడ్ బర్న్ రోడ్ లో. సుభాస్ ఉండేది 38/2 ఎల్ గిన్ రోడ్డులో. రెండూ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ప్రసిద్ది చెందిన చిరునామాలే. జాతీయనాయకుల బసలకు, భేటిలకు, ఎన్నో చరిత్రాత్మక ఘటనలకు పేరొందిన తావులే. ఆ ఇంటి మలుపు తిరిగిలుగు అడుగులు వేస్తే ఈ ఇల్లే.
సుభాస్ బోస్ ని బ్రిటిషు ప్రభుత్వమే భయపడి బేషరతుగా జైలు నుంచి విడిచి పెట్టింది. బనాయించిన రెండు రాజద్రోహం కేసుల్లోనూ బెయిలోచ్చింది. అతడు గృహ నిర్బంధంలో ఏమీ లేడు. అతడి కదలికల మీద చట్టపరంగా ఆంక్షలేవీ లేవు. న్యాయంగా అయితే అతడిపై పోలిసు కాపలా పెట్టాల్సిన అవసరం లేదు. 

కాని- న్యాయంగా మెలగటం తెల్లదొరతనానికి ఏనాడూ అలవాటు లేదు.  దానికి సుభాస్ చంద్రబోస్ పేరు చెబితే హడలు. ఆ కాలాన దేశంలోని రాజకీయ నాయకులు, ఉద్యమకారులు అందరిలోకి సర్కారు ఎక్కువగా భయపడేది బోస్ కే ! కోట్లాది ప్రజల ఆరాధ్యనాయకుడు ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ చెరలో మరణిస్తే తమ కొంపలంటుకుంటాయన్న బెంబేలుతో వేరే దారి లేక వదిలిపెట్టింది – కాస్త కోలుకోగానే మళ్లీలాక్కొచ్చి బంధించే దుర్భుద్ధితోటే ! స్వేచ్ఛగా వదిలేసినట్టు లోకానికి చూపెడుతూనే అష్ట దిగ్బంధం చేసి, తెలివిగా మాటువేసి ‘పిల్లి-ఎలుక’ ఆట (లేక వేట) భలేబాగా ఆడుతున్నామని తెల్లదొరలు అనుకుంటున్నారు.

ఏకంగా ఓ రెజిమెంటుకు సరిపడేంతమంది పోలీసులు యూనిఫాంలు వేసుకొని 38/2 ఎల్గిన్ రోడ్ ఇంటికి నాలుగు వైపులా మొహరించారు. చుట్టు పట్ల తారట్లాడే మఫ్టీ పోలీసులకు, సి.ఐ.డి.లకు లెక్కలేదు. గుచ్చిగుచ్చి అడిగాకగానీ ఆ దారివెంట, ఇంటిలోకి ఎవరినీ పోనివ్వటంలేదు. అది మూడంతస్థుల భవంతి. మధ్య అంతస్థులో సుభాస్ బెడ్ రూం. అది రోడ్డు మీది నుంచే కనపడుతూంటుంది. దానికి ఏడు పెద్ద కిటికీలు. అన్ని వైపుల నుంచీ వాటి మీద అహర్నిశలూ పోలిసుల కళ్లు! ఘరానా కుటుంబం కాబట్టి కాపురం ఉండేవారి, వారిని చూడవచ్చే చుట్టాల, పక్కాల సంఖ్య ఎక్కువ. నౌకర్లు, చాకర్లు సరేసరి. ఇంట్లో తిరిగే వాళ్లలోనే పోలిసుల ఇన్ఫార్మర్లు ఉన్నారు. వారిద్వారా లోపల ఏమి జరుగుతున్నది, సుభాస్ ఏమి తింటున్నాడు, ఏమి చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, దేని గురించి – అన్నవి సర్కారు వారికి ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఫొన్ కాల్స్ మీద నిఘా, వచ్చేపోయే ఉత్తరాల మీద పోస్టల్ సెన్సారింగు ఎలాగూ ఉంటుంది. మొత్తానికి సర్కారుకు తెలియకుండా ఈగ కూడా లోనికిపోదు. – బయటికి రాదు – అని తెల్లరాకాసుల ధీమా!

కాని సుభాస్చంద్రబోస్ తెల్లవారికంటే తెలివైనవాడు. ఇంటెలిజెన్సు విద్యలో వారికంటే నాలుగాకులు ఎక్కువ చదివినవాడు. తన మీద గవర్నమెంటు రెప్పవాల్చని నిఘా పెడితే, సుభాస్ ఏకంగా ఆ నిఘా మీదే నిఘా పెట్టాడు. అతడి నెట్ వర్క్ ఎంత గట్టిదంటే- అతడి కదలికలమీద కష్టపడి గవర్నమెంటుకు అందిన సమాచారమేమిటో కొద్ది గంటల్లోనే అతడికి తెలిసిపోయేది. తన ఇంట్లో తిరిగే ఫలానా బంధువు, ఫలానా  పనివాళ్లు పోలిసులకు ఉప్పందిస్తున్నారని గ్రహించాక బోస్ తన జాగ్రత్తలోతానున్నాడు. కావలసినప్పుడు వారినే ప్రయోగించి, వారి ద్వారా తప్పు సమాచారాన్ని సర్కారుకు తెలివిగా చేరవేయించేవాడు!

అశోక్ ఆరోజు సాయంత్రమే  బాబాయి ఇంటికి వెళ్ళాడు . ఇల్లు సద్దుమణిగాక అర్థరాత్రి  సుభాస్ అతడిని పిలిపించాడు. అది 1940 డిసెంబరు మూడోవారం. చలికాలం. విశాలమైన పడకగదిలో  సుభాస్ మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుని ఉన్నాడు. మనిషి ఇంకా నీరసంగానే ఉన్నాడు. గడ్డం పెరిగింది. రామకృష్ణ పరమహంస, వివేకానంద, కాళీమాతల పటాలు గోడకు తగిలించి ఉన్నాయి. ఒక మాల పులిచర్మం పట్టా పరిచి ఉంది. దాని దగ్గర జపమాల. భగవద్గీత . కుశల ప్రశ్నలు కాగానే అశోక్ ను బాబాయి వేసిన మొదటి ప్రశ్న:
“బిహార్ లో నువ్వు ఉంటున్న చోట నీ కదలికలను పోలీసులు గమనిస్తున్నారా?”
“లేదు” అని బదులిచ్చాక రెండో ప్రశ్న
“అలుపు లేకుండా ఒకేసారి 200, 250 మైళ్లు కారు తోలగలవా?”
“ఇబ్బంది లేదు.”

“సరే! అవసరంపడొచ్చు. నీకారును కండిషనులో ఉంచు. జనవరి 15 తర్వాత ఏ రోజైనా నేను నీ దగ్గరికి రావచ్చు. సిధ్ధంగా ఉండు.నన్ను గుర్తు పట్ట గలిగిన చుట్టాలు , స్నేహితులు గాని, పనివాళ్లు గాని ఆ సమయాన అక్కడ ఉండకుండా చూడు.” అని చెప్పి అశోక్ ను  పంపేశాడు సుభాస్.
అశోక్ తమ్ముడు శిశిర్ బోస్.  ఇరవై ఏళ్లవాడు. కోలకతా మెడికల్ కాలేజి స్టూడెంటు. దీనికి కొద్ది రోజుల కిందట అతడిని కూడా సుభాస్ పిలిపించి, “నాకో పని చేస్తావా?” అని అడిగాడు. “ఏమిటి” అని అడక్కుండా “చేస్తాను బాబాయ్” అని చప్పున అన్నాడు శిశిర్.

వెయ్యికళ్ల పోలీసు నిఘాను తప్పించుకుని దేశం నుంచి చెక్కెయ్యాలన్నది సుభాస్ బోస్ ప్లాను.రైల్లో పెషావర్ చేరి అక్కడి నుంచి కాబూల్ లో కాలు పెట్టాలని అతడి ఆలోచన.కలకత్తా నుంచి ఢిల్లీకిఢిల్లీఎక్స్ ప్రెస్ , అటునుంచి పెషావర్ కి నేరుగా ఫ్రాంటియర్ మెయిల్ ఉన్నాయి..కాని కోలకత్తాలో, ఆ మాటకొస్తే బెంగాల్ లో బోస్ ను ఎరుగనివారు లేరు.అక్కడ రైలెక్కడమంటే గవర్నరుకు టెలిగ్రాం ఇచ్చి బయలు దేరినట్టే! కాబట్టి రాత్రివేళ రహస్యంగా బిహార్ వెళ్లి ధనబాద్ బొగ్గుగనుల ప్రాంతాన అసన్ సోల్ లో రైలు పట్టుకుని పెషావర్ చేరాలన్నది పథకం.

అంటే-రెండొందల మైళ్లకు పైగా కారు ప్రయాణం.డ్రయివింగు పని శిశిర్ ది.ఎన్నడు బయలుదేరటం అన్నది వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో  తదుపరి ఏర్పాట్లు కావడం మీద ఆధారపడుతుంది.వాటి సంగతి మాట్లాడటానికి పెషావర్ నుంచి నమ్మకస్తుడైన  మియా అక్బర్ షాను పిలిపించాలి.అన్ని పనులూ జనవరి 27కు ముందే జరిగిపోవాలి.ఎందుకంటే ఆ రోజు క్రిమినల్ కేసు విచారణ ఉంది.దానికి బోస్ హాజరై తీరాలి.అతడిని వెంట పెట్టుకుపోవటానికి పోలీసులు వస్తారు.అంతలోపు ఈ నెల రోజుల్లోనే బయటికి జారుకోవాలి.

“ఇదీ సంగతి.నీకూ,నాకూ, నన్ను కనిపెట్టుకుని ఉండే మన  ఐలాకూ తప్ప ఇది మూడో మనిషికి తెలియటానికి వీల్లేదు.ఈ లోపు నువ్వు చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి.ఇంతకీ మనం ఏ కారులో వెళదాం? “ అని అడిగాడు సుభాస్.

శిశిర్ ఇంట్లో రెండు కార్లు ఉన్నాయి.ఒకటి అమెరికన్ తయారీ స్టుడ్ బేకర్.రెండోది జర్మన్ కారు వాండరర్ .మొదటిది పెద్దది.సౌకర్యంగా ఉంటుంది.కాని అది శరత్ బోస్ గారి కారు అని జనాలందరికీ తెలుసు. జర్మన్ కారు శిశిర్ పేరు మీద ఉంది.అది చిన్నది.చప్పుడు ఎక్కువ చేస్తుంది.కాని దాన్ని చాలా మంది గుర్తుపట్టరు.కాబట్టి అదే నయం అనుకున్నారు.

ఇక ఆనాటినుంచి శిశిర్ చీకటి పడగానే వాండరర్ కారులో ఎల్గిన్ రోడ్డు ఇంటికి వెళ్లి అర్థరాత్రి దాకా అక్కడే ఉండేవాడు.దాని తిరుగుళ్లకు,చప్పుళ్లకు చుట్టుపట్ల పోలీసులు బాగా అలవాటు పడ్డారు.”రోజూ వెళ్లి అంత రాత్రి దాకా లోపల ఏమి చేస్తుంటావ్”అని మొదట్లో పోలీసులు అడిగారు.”మా బాబాయి రేడియో వార్తలు వింటాడు.యుద్ధం వార్తల కోసం ఇతర దేశాల ప్రసారాలూ ఆయన ఆలకిస్తాడు.తనకు ఆరోగ్యం బాగా లేదు కాబట్టి నేను దగ్గరుండి సాయం చేస్తుంటా”అని బదులిచ్చాడు శిశిర్.ఆ మాట నిజమే కూడా.

ఇలా రేడియో వంకతో రాత్రి పొద్దుపోయే దాకా సుభాస్ పక్కన ఉండి,ఆయన పురమాయించిన పనులను శిశిర్ చక్కపెట్టేవాడు. మొదటి పని పెషావర్ నుంచి అక్బర్ షాను పిలిపించటం.పార్టీ వ్యవహారాలు మాట్లాడానికి ఒకసారి వచ్చి పొమ్మని అతడికి సుభాస్ పబ్లిగ్గానే టెలిగ్రాం పంపించాడు.అది చూసి పోలీసులు ఎలర్ట్ అయ్యారు.ఫలానా రోజున వస్తున్నాడట; ఏమి జరుగుతుందో కనిపెట్టి ఉండమని వాళ్లు సుభాస్ దగ్గర మసలే తమ ఇన్ఫార్మర్లను హెచ్చరించారు.
అక్బర్ షా వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ఫార్వర్డ్ బ్లాక్ శాఖకు అధ్యక్షుడు.అది సుభాస్ బోస్ స్థాపించిన పార్టీయే.ఢిల్లీలో పెట్టదలిచిన పెద్ద బహిరంగ ప్రదర్శనకు తక్షణం జరగాల్సిన ఏర్పాట్ల గురించి 'పోలీసులకు వినపడేలా'సుభాస్ అతడితో చర్చించాడు.అదను చూసుకుని అసలు విషయం అతడి చెవిన వేశాడు.
“అదెంత పని?మిమ్మల్ని పెషావర్ నుంచి అఫ్గానిస్తాన్ చేర్చే పూచీ నాది.నేను వెళ్లి ఆ సంగతి చూస్తా.మీరు పెషావర్ ఎప్పుడు చేరేదీ తెలియజేయండి.రైలెక్కగానే నాకు కోడ్ లో టెలిగ్రాం ఇవ్వండి.”అన్నాడు అక్బర్ షా.
'ఫార్వర్డ్ బ్లాక్ మీటింగు పెట్టండి’ అని టెలిగ్రాం పంపితే బోస్ బాబు రైలు ఎక్కేసినట్టు సంకేతం!

అక్బర్ షా తో సుభాస్ మాట్లాదుతున్నప్పుడే 'కాకతాళీయంగా'శిశిర్ అటుకేసి వచ్చాడు.సుభాస్ అతడిని పరిచయం చేసి, మావాడు  నిన్ను స్టేషనులో దిగబెడతాడు-అని చెప్పాడు.రైలు స్టేషనుకు వెళ్లేదారిలో అక్బర్ షా ఎలాగూ వచ్చాను కదా అని కోలకతాలో ఒక్కడే వెళ్లి షాపింగు చేశాడు.పఠాన్లు వేసుకునే లాంగ్ కోట్లను,షేర్వాణీ పైజామాలను,ఫెజ్ టోపీనీ, కాబూలీ చెప్పులనూ,సుభాస్ కు సరిపడే సైజులో జాగ్రత్తగా సెలక్టు చేసి 'తనకోసం'కొనుక్కున్నాడు!కాని-వాటిని పట్టుకెళ్లడం మరచిపోయి,శిశిర్ కారులోనే వదిలేసి రైలెక్కాడు!!

తరువాత శిశిర్ మార్కెటుకు మారు వేషంలో వెళ్లి “మహమ్మద్ జియా ఉద్దీన్, B.A, L.L.B,ట్రావెలింగు ఇన్ స్పెక్టరు,ఎంపైర్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్,చిరునామా:సివిల్ లైన్సు, జబల్పూర్”అని రాసి ఉన్న విజిటింగు కార్డులు ప్రింట్ చేయించాడు.నమాజ్ కు వాడే పట్టానూ,పవిత్ర ఖురాన్ ప్రతినీ,సూట్ కేసు, బెడ్డింగు,పక్కబట్టలు,దుస్తులు వగైరాలనూ కొని ఇంటికి చేర్చాడు.వందల మైళ్లు తాను డ్రయివ్ చేయగలనా అన్నది తనకు తాను టెస్టు చేసుకున్నాడు.ధనబాద్ బొగ్గుగనుల్లో ఇంజనీరుగా పనిచేస్తున్న తన అన్న అశోక్ ను చూడటానికి 'ఉత్తినే'వెళ్లిన తన తల్లిని వెనక్కి తీసుకొచ్చే పని మీద కారులో వెళ్లి రానూ,పోనూ దారి మొత్తాన్నీ రెక్కీ చేసి వచ్చాడు.

ఈలోగా పొరుగూరు వెళ్లిన శరత్ చంద్ర బోస్ కోలకతా తిరిగొచ్చాడు.ఆయనకు కన్న బిడ్డల కంటే సుభాస్ మీద ఎక్కువ ప్రేమ.’నాకు వాడి తరవాతేరా మీరందరూ’ అని పిల్లలతో అంటూండేవాడు.  తమ్ముడి ప్రయత్నాలను విని  ఆయన మనస్పూర్తిగా హర్షించాడు. ఒక సూచన చేశాడు.ఆడపిల్ల ఐలా ఒక్కదాని మీదే ప్రెషరు అంతా ఎందుకు?మన కుర్రాడు ద్విజేంద్రనాథ్ ని కూడా ఇందులో కలపండి- అని. సుభాస్ సరే అన్నాడు.

సన్నాహాలన్నీ అయ్యాయి.1941 జనవరి 16 అర్థరాత్రి బయలుదేరాలిఅనుకున్నారు.వాండరర్ కారులో సామాన్లు జాగ్రత్తగా ఎక్కించి,శిశిర్ మామూలు ప్రకారం రాత్రి 8:30కల్లా ఎల్గిన్ రోడ్ ఇంటికి వెళ్ళాడుఎప్పటిలాగే వెనుక గుమ్మం లోపల పార్క్ చేశాడు.ఆ రాత్రి మామూలుగా తల్లి ప్రభావతి, ఇతరులతో కలిసి సుభాస్ బోస్ సిల్కుపంచె,చద్దరు వేసుకుని సంప్రదాయ పద్ధతిలో భోజనం చేశాడు.వెళ్లేముందు తల్లికి చెప్పి సెలవు తీసుకోవాలని మనసులాగినా తమాయించుకున్నాడు.చెబితే ఆమె తట్టుకోలేదు.తర్వాత పోలీసుల ఇంటరాగేషనుకు తాళలేదు.తను వెళ్లాక కూడా కనీసం కొద్ది రోజులపాటు తాను ఉన్నట్టే అందరికీ భ్రమ కలిగించాలి.అది తల్లి వల్ల అయ్యేపని కాదు.ఆమెకు ఏదీ తెలియనివ్వకపోవడమే ఉత్తమం.

“అమ్మా!నేను రేపటి నుంచి కఠోర యోగ దీక్షలోకి వెళుతున్నాను.అది పూర్తయ్యేదాకా నన్ను ఎవరూ డిస్టర్బ్ చెయ్యవద్దు. ఎట్టి పరిస్థితిలోనూ నన్ను చూడవద్దు.తెరచాటున నేను దీక్షలో ఉండే వైపు ఎవరినీ రానివ్వవద్దు.ఆహారం,నీరు కూడా బయట ఉంచితే చాలు.నేనే తీసుకుంటాను-” అని సుభాస్ తల్లికీ,అందరికీ గట్టిగా చెప్పాడు.జైలునుంచి వచ్చింది మొదలుకొని అతడు సదా ధ్యానంలోనే ఉంటున్నట్టు వారికి  తెలుసు. కాబట్టి ఎవరికీ అనుమానం రాలేదు.వేరువేరు తేదీలు వేసి వారికీ,వారికీ తానూ రాసిన ఉత్తరాలనూ, పత్రికా ప్రకటనలనూ రహస్య సందేశాలనూ ఐలా చేతికిచ్చాడు. ఆయా తేదీల ప్రకారం వాటిని డిస్పాచ్ చేయించమని చెప్పాడు. అదంతా తనను  కనిపెడుతున్న ఇన్ఫార్మర్లను,పోస్టల్ సెన్సార్లను మభ్య పెట్టటం కోసం.ఈ అప్పగింతలన్నీ అతిగోప్యంగా అయ్యాక సుభాస్ తన గదిలో తెరల చాటునకొత్తగా వేయించిన టెంటులోకి వెళ్లి వేషం మార్చుకున్నాడు.లాంగ్ కోటు,వదులు పైజామా,నల్లటి ఫెజ్ టోపీ ధరించాడు.కళ్లజోడును మార్చేశాడు ఎడమ చెవి కింద కొట్టవచ్చినట్టు కనపడే పెద్ద పుట్టుమచ్చను అంతకుముందే సర్జరీ ద్వారా తొలగించుకున్నాడు., ఆ సంగతి బయటపడకుండా గడ్డం పెంచాడు.

అంతా నిద్రలోకి జారి,సద్దుమణిగేసరికి ఒంటిగంటదాటింది.ద్విజేన్ మేడమీదికి వెళ్లినలువైపులా పరిసరాలను గమనించసాగాడు.ఎక్కడా పోలీసుల అలికిడి లేదు.చలి విపరీతంగా ఉంది. ఎక్కడచూసినా కాపలా పోలీసులు చార్ పాయిల మీద ముసుగుతన్ని గురక పెడుతూ కనిపించారు.వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.అంతా ఓకే అనుకున్నాక 1:30 కి ద్విజేన్ గట్టిగా గొంతుసవరించుకుని దగ్గాడు.సిగ్నల్ అందగానే సుభాస్ లేచాడు.ఇన్నాళ్ళూ తనని కడు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్న ఐలా తలనిమిరి “గాడ్ బ్లెస్ యు” అని దీవించాడు.శిశిర్ వెనకరాగా చప్పుడుకాకుండా చకచకా మెట్లు దిగి డ్రయివ్ వేలో పార్క్ చేసిన కారు వెనుక సీట్లో ఎడమ వైపు కూచున్నాడు.డోర్ వేయకుండా చేత్తో లాగి పట్టుకున్నాడు.శిశిర్ డ్రయివరు సీట్లో కూచుని డోర్ బిగ్గరగా వేశాడు.రోజులాగే ఒక్క డోర్ చప్పుడే బయటికి వినిపించింది.BCA7169 నెంబరు వాండరర్ కారు 1941 జనవరి 16 అర్థరాత్రి 1:35 తరవాత దర్జాగా 38/2 ఎల్ గిన్ రోడ్డు నుంచి బయలుదేరి చరిత్రాత్మక ప్రయాణం ప్రారంభించింది.అది వెళ్లాక గంటసేపటిదాకా సుభాస్ గదిలో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి.

రోడ్డెక్కాక తిన్నగా వెళ్లకుండా చుట్టు తిరుగుళ్లు తిరిగి లాన్స్ డౌన్ రోడ్,హారిసన్ రోడ్ ల మీదుగా హౌరాబ్రిడ్జ్ దాటి హైవే పట్టారు.మధ్యలో ఫ్రెంచి కాలనీ చందర్ నగర్ దగ్గర కాపలా పోలీసులు ఆపుతారేమోనని భయపడ్డారు.కాని అలా జరగలేదు.ఒకచోట సడెన్ గా ఆపటంతో ఆయిల్ చోక్ అయి,కాసేపు ఇంజన్ మొరాయించటం మినహా అంతా సాఫీగా సాగింది.ఎక్కడా ఆగకుండా రాత్రంతా డ్రయివ్ చేసి,బుర్ద్వాన్,దుర్గాపూర్ ఫారెస్టు,అసన్ సోల్ మీదుగా సరిహద్దు దాటి బిహార్ లోని ధన్ బాద్ బొగ్గుగనుల ప్రాంతంలో అశోక్ ఉండే బరారీ చేరేసరికి ఉదయం దాటింది.

అశోక్ బంగళాకు అరమైలు దూరంలో బాబాయిని వదిలేసి,శిశిర్ కారులో నేరుగా అన్న ఇంటికి చేరాడు.ఆ సమయాన అశోక్ బోస్ భార్యతో కలిసి టీ తాగుతున్నాడు.తమ్ముణ్ని చూడగానే విషయం అర్థమైంది.ముగ్గురూ సిట్టింగ్ రూములో మాట్లాడుకుంటుండగా కాసేపటికి నౌకరు వచ్చి ఎవరో వచ్చారంటూ విజిటింగు కార్డు అందించాడు.అదిచూసి 'ఎవరో జియాఉద్దీనట! ఇన్సూరెన్సు వాడా? సరే! ముందు వరండాలో వెయిట్ చెయ్యమను” అని అశోక్ నిర్లక్ష్యంగా చెప్పాడు.కాసేపటికి తాను ఆఫీసుకు తయారై వరండాలోకి వెళ్లాడు.జియాఉద్దీన్ లేచి సలాం చేశాడు.

ఆగంతకుడిని చూడగానే అశోక్ బోస్ షాకయ్యాడు.బాబాయికీ,ఇతడికీ ఎక్కడా పోలికలేదు.దగ్గరి బంధువులు కూడా గుర్తుపట్టలేరు.అర్ధ చంద్రాకారం కళ్లజోడు,గడ్డం, ఫెజ్ టోపీతో మొత్తం మొగమే మారిపోయింది.వచ్చినవాడు ఘరానా వంశానికి చెందిన పఠాన్ లాగా ఉన్నాడు.

నాటకం మొదలైంది.
“సాబ్! నా పేరు జియాఉద్దీన్.ఎంపైర్ ఆఫ్ ఇండియా ఇన్సురెన్సు కంపెనీ ట్రావెలింగు ఇన్స్ పెక్టర్ని.కోల్ ఫీల్డుల డైరక్టర్లను,ఎగ్జిక్యూటివ్ లను కలవటానికి టూరు చేస్తూ మీ దగ్గరికి వచ్చాను.మా దగ్గర మీ సిబ్బందికి పనికొచ్చే చక్కటి జీవిత భీమా పథకాలున్నాయి.దయచేసి కాస్త సమయం కేటాయిస్తే వాటిని మీకు మనవి చేస్తాను” అన్నాడు ఆగంతకుడు ఇంగ్లీషులో.

“ఇప్పుడు కుదరదు. నేను ఆఫీసుకు వెళ్లాలి.సాయంత్రం రండి.సావకాశంగా వింటా”అన్నాడు అశోక్ కూడా ఇంగ్లీషులోనే.

జియాఉద్దీన్ ఇబ్బందిగా మొగంపెట్టాడు.”నేను చాలా దూరం నుంచి వస్తున్నాను సాబ్.ఈ ఊళ్లో నాకెవరూ తెలియదు.బస చేయటానికి సదుపాయాలేవీ ఇక్కడ ఉన్నట్టు లేవు.మీరు అనుమతిస్తే సాయంత్రం దాకా ఇక్కడే ఉండి మీ కోసం వెయిట్ చేస్తాను.”

అశోక్ క్షణం తటపటాయించి “సరే” అన్నాడు.అతడిని లోపలి సిట్టింగురూములో కూచోబెట్టి టీ ఇప్పించాడు.అక్కడే కూచున్న శిశిర్ ను “ఇతడు మా తమ్ముడు “అంటూ పరిచయం చేశాడు.ఆ కుర్రాడితో తనకేమీ పని అన్నట్టు జియాఉద్ధీన్ అతడిని పెద్దగా పట్టించుకోలేదు.

“ఈ సాహెబ్ సాయంత్రందాకా ఇక్కడే ఉంటారు.మన గెస్టురూం చూపించండి.నాస్తా,భోజనం అక్కడే సర్వ్ చెయ్యండి”అని నౌకర్లకు పురమాయించి అశోక్ రోజూలాగే ఆఫీసుకు వెళ్లాడు.మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు భార్యా, తమ్ముడితో కలిసి లంచ్ చేస్తూ “ఆ మనిషి ఉన్నాడా?”అని అడిగాడు.

“ఆ!గెస్ట్ రూంలో నిద్రపోతున్నాడు.మన ముస్లిం పనివాళ్లకి అతడు బాగా నచ్చాడు.'ఎవరో గాని పెద్ద మౌల్వీలాగా ఉన్నాడమ్మా!నమాజ్ ఎంత చక్కగా చేస్తున్నాడో'అని తెగ మెచ్చుకుంటున్నారు.భోజనం వగైరా వాళ్లే దగ్గరుండి చూసుకుంటున్నారు” అని నవ్వుతూ చెప్పింది మీరాబోస్.నిజానికి ఆమె కూడా వచ్చినవాడు ఫలానా అని ఎరుగదు.

సాయంత్రం ఆఫీసునుంచి వచ్చాక,ముందు వరండాలో అశోక్ తీరుబడిగా కూచోని జియాఉద్దీన్ ను పిలిపించి “ఇప్పుడు చెప్పండి”అన్నాడు.నౌకర్లకు వినపడేలా జీవిత భీమా స్కీముల వివరాలు ఇంగ్లీషులో బిగ్గరగా చర్చిస్తూ మధ్యలో అసలు విషయాలనూ మాట్లాడుకున్నారు.

సుభాస్ మొదట అనుకున్నది అసన్ సోల్ స్టేషనులో కల్కా-ఢిల్లీ ఎక్స్ ప్రెస్ ఎక్కాలని.అది రైల్వే డివిజన్ హెడ్ క్వార్టరు.ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.రైల్వే పోలీసులూ,మామూలు పోలీసుల నిఘా ఎక్కువ.కాబట్టి అది మంచిది కాదు.బెంగాల్ లోని అసన్ సోల్ కంటే దానికి 30మైళ్ల దూరంలో బీహార్ కిందికి వచ్చే 'గోమో'స్టేషను మేలు.అది చిన్న స్టేషను.ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది.పోలీసు నిఘా అసలే ఉండదు-అని అశోక్ అన్నాడు.”అయితే సరే! అలాగే చేద్దాం”అన్నాడు సుభాస్.

అశొక్ లోపలికి వెళ్లి ఆ సంగతి తమ్ముడికి చెప్పాడు.”ఆ దారి నాకు బొత్తిగా తెలియదే.ఎలా?”అన్నాడు శిశిర్. అయితే మీ వెంట నేనూ వస్తాను.ఆ రూటు నాకు బాగా తెలుసు-అన్నాడు అశోక్.

బాగానే ఉంది.మరి అశోక్ భార్య మీరా సంగతేమిటి?కొత్తగా కాపురానికి వచ్చిన భార్యను విసిరేసినట్టు ఉండే బంగళాలో రాత్రి వేళ ఒంటరిగా వదిలివెళ్లటం అశోక్ కు ఇష్టం లేదు.తననూ తీసుకువెళదాం అన్నాడు.దానికి బాబాయి ఒప్పుకుంటాడా అని శిశిర్ కు డౌటు.

అశోక్ మళ్లీ వరండాలోకి వెళ్లి సుభాస్ ను ఒప్పించాడు.తరవాత నౌకరును కేకేసి “ఇదిగో ఈ సాహెబ్ రైలుకు వెళ్లాలి.త్వరగా భోజనం పెట్టి పంపించండి.”అని చెప్పాడు. ముస్లిం నౌకరు జియాఉద్దీన్ కు గెస్ట్ రూములో ఆప్యాయంగా భోజనం పెట్టి పంపించాడు.బయట టాక్సీ మాట్లాడుకుని అసన్ సోల్ స్టేషనుకు వెళతానని బిగ్గరగా చెప్పి జియాఉద్దీన్ అశోక్ నుంచి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.ఇంట్లో వాళ్లూ రోజూకంటే 
ముందుగా భోజనాలు చేసి ‘ఏదో పని మీద’ కారులో బయలుదేరారు.ఊరిబయట సుభాస్ వారిని కలుసుకున్నాడు.ఆయనే తన మామయ్యగారు అని తెలిశాక మీరా సంతోషానికి మేరలేదు.అందరూ హాయిగా మాట్లాడుకుంటుండగా పండు వెన్నెలలో వాండరర్ కారు గ్రాండ్ ట్రంక్  రోడ్ పట్టింది.

రైలు రావటానికి ఇంకా చాలా టైముంది.స్టేషనుకు దూరంగా కారు ఆపి మాట్లాడుకుంటూ కూచున్నారు.అందరి మనసుల్లోనూ మళ్లీ ఎప్పటికి కలుస్తామో అని ఉద్వేగం.తమకు దేవుడులాంటి బాబాయిని మళ్లీ చూడగలమో లేదో అని అన్నదమ్ముల గుండెలు బరువెక్కాయి.

అర్థరాత్రి దూరాన రైలుకూత వినిపించాక కారు బయలుదేరి గోమో స్టేషను ముందు సామాను తీసుకుని స్టేషనులోకి వెళ్లాడు.పోర్టరు కళ్లు నులుముకుంటూ ఎదురొచ్చి లగేజి తీసుకున్నాడు.కాసేపట్లో కల్కా-ఢిల్లీ మెయిల్ వచ్చింది.అది వెళ్లిపోయాక అరగంటవరకూ వేచి ఉండి అశొక్ కుటుంబం ఇంటిదారి పట్టింది.

మరికాసేపట్లో ఎక్కడి నుంచో పెషావర్ కు కోడ్ భాషలో టెలిగ్రాం వెళుతుంది.సుభాస్ ఢిల్లీ వరకూ వెళ్లకుండా ఎక్కడో రైలుదిగి,అటునుంచి ఫ్రాంటియర్ మెయిల్ ఎక్కి 1941 జనవరి 19న వాయవ్య సరిహద్దు రాష్ట్రాన్ని చేరతాడు.పెషావర్ లో అక్బర్ షా అతడిని రిసీవ్ చేసుకుని,తరువాతి ఏర్పాట్లు చేస్తాడు.

మహాఘనత వహించిన  బ్రిటిషు ప్రభుత్వం, దాని రెప్పవాల్చని వెయ్యికళ్ల నిఘా యంత్రాంగం గుడ్లప్పగించి చూస్తుండగానే, ఇండియాలో ఆ మహా సామ్రాజ్యాన్ని నేలకరిపించటానికి కంకణం కట్టుకున్న మహావీరుడు సుభాస్ చంద్ర బోస్ భారతమాత విముక్తి కోసం దేశం దాటి ప్రపంచం కనీవినీ ఎరుగని మహాపోరాటం మొదలు పెడతాడు.

అది భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మహోజ్వల ఘట్టానికి నాంది.
ఇది ప్రపంచంలోని ఆల్ టైం గ్రేట్ ఎస్కేప్ స్టోరీల్లో ఒకటి.విఖ్యాత చరిత్రకారుడు రమేశ్ చంద్ర ముజుందార్ అన్నట్టు దేశచరిత్రలో దీనితో పోల్చగలిగింది ఔరంగజేబు చెరనుంచి శివాజీ మహారాజ్ తప్పించుకున్న సాహసకృత్యం ఒక్కటే!

-ఎంవీఆర్ శాస్త్రి