జంధ్యాల సినిమా అది. ఓ కవిగారు.. తన కవితా విన్యాసాలతో ఊరందరికీ జీవితం మీద విరక్తి పుట్టిస్తుంటారు. సదరు కవిగారి పీడ వదిలించుకోవడం ఎలాగా అని అందరూ తర్జనభర్జన పడుతుంటారు. చివరికి ఓ అయిడియా వెలుగుతుంది. అందరూ కలిసి భారీగా చందాలు వేసుకుని… కవిగారికి ఘనసన్మానం ఏర్పాటుచేస్తారు. సదరు సన్మానంలో.. కవిగారికి ఓ మాంచి ఏనుగును బహుమతిగా అందజేస్తారు. ఆ ఏనుగుకు తిండిపెట్టడానికి, దానిని పోషించడానికి కవిగారికి చుక్కలు కనిపిస్తాయి. ఆయన జీవితం మొత్తం ఏనుగుగారి ఉదరపోషణకే అంకితం అయిపోతుంది. ఇక కవిత్వం రాయడానికి తీరికుండదు… దానికి అవసరమైన ప్రశాంతత కరవౌతుంది!
అవ్విధముగా- ఏనుగును బహూకరించినట్లుగానే ఉంది. అయిదేళ్ల పాలన తర్వాత… చంద్రబాబునాయుడు రాష్ట్రానికి రాజధానిగా అందించిన 'అమరావతి'! దేవేంద్రుడి నగరాన్ని గుర్తుకుతెచ్చే యోచనతో ఏ ముహూర్తాన 'అమరావతి' అని పేరు పెట్టారో గానీ… అచ్చం దేవేంద్రుడి వాహనమైన 'ఐరావతం'లాగా తయారైంది. రాష్ట్రప్రభుత్వ ఖజానా మీద ఇది ఇప్పుడు తెల్లఏనుగు లాగా మారింది. దీనిని పూర్తిచేయడం సంగతి తర్వాత… చేసుకున్న అన్ని ఒప్పందాలను కొనసాగించడం కూడా ప్రభుత్వానికి తలకుమించిన భారం అవుతోంది.
అయితే ఈ తెల్లఏనుగు.. ప్రభుత్వానికి ప్రమాదకరంగా మారిందన్నది నిజమే. కానీ.. ఈ తెల్లఏనుగు ఐరావతాన్ని.. సజావుగా పెంచి, అంకుశంతో అదుపులోకి తెచ్చుకుని, అధిరోహించి… ఆ అంబారీ మీద సవారీ చేయడం అసాధ్యమైన విషయం కాకపోవచ్చు.
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంత అభివద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజధానిని తరలించేస్తారు అనేపుకార్లు కొన్నిరోజులుగా విపరీతంగా వ్యాప్తిలోకి రావడంతో.. అన్నాళ్లు మౌనం పాటించిన ముఖ్యమంత్రి ఈ సమీక్ష సమావేశానికి పూనుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమీక్ష తర్వాత.. మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో 35 వేలకోట్ల రూపాయల విలువైన పనులను నిలుపుదల చేసినట్లు చెప్పారు.
ప్రభుత్వం వద్ద నిధుల లభ్యతను చూసుకుని వీటి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రాజధాని ప్రాంత రైతులకు కౌలు చెల్లింపులు యథావిధిగా సాగుతాయని.. వారి ఆందోళనను దూరంచేసేలా ప్రకటించారు. రాష్ట్రానికి నాలుగైదు రాజధానుల ఆలోచన చేస్తున్నట్లుగా ఎవరైతే మాట్లాడారో.. నిజానిజాలు వారినే అడగాలని తిప్పికొట్టారు. మరొకవైపు.. రాజధాని తరలిపోతుందనే ఆలోచన మీకెందుకు.. అలా అని ఎవరన్నారు? రాజధాని ఇక్కడే ఉంటుంది గనుకనే.. మా నాయకుడు కూడా తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నాడు అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో.. రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఉండవచ్చునని అర్థమవుతోంది. కాకుంటే, రాజధాని నిర్మాణాలకు చంద్రబాబునాయుడు ప్లాన్ చేసిన బడ్జెట్టే గుండె గుభేలుమనేలా చేస్తోంది. బొత్సమాటలను బట్టి చూస్తోంటే.. కనీసం బ్యాంకు గ్యారంటీలు కూడా లేకుండానే పనులు అప్పగించేసినట్లుగా కనిపిస్తోంది. అలాంటివన్నీ రద్దుచేసి జగన్ ప్రభుత్వం ప్రస్తుతానికి సేఫ్ గేమ్ ఆడుతోంది. హేపీ నెస్ట్ నిర్మాణాల్లో ఎటూ లబ్ధిదారులు చెల్లించిన డబ్బే ఉన్నది గనుక.. వాటిని కొనసాగిస్తున్నారు. ఇక్కడ కూడా రివర్స్ టెండర్లకు వెళ్లి.. ఖర్చు తగ్గించడానికి ఆ మేరకు లబ్ధిదారులకు మేలు చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది.
అయితే రాజధాని పనులు ఎప్పటికి మొదలవుతాయి? నిధుల సమీకరణ ఎలా సాధ్యం? ఈ విషయాలకు ప్రభుత్వం వద్ద కూడా జవాబులు లేవు. విలేకర్లు పదేపదే అడిగినా బొత్స చెప్పలేదు. ఆర్థిక పరిస్థితి చూసుకుని చేపడతాం అని సెలవిచ్పారు. ఆ రకంగా.. భరించడానికి ఏమాత్రం వీల్లేని భారంగా.. రాష్ట్ర ఖజానా పాలిట పెద్ద తెల్లఏనుగులాగా అమరావతి నిర్మాణం తయారైంది.
అత్యుత్సాహం, దుబారా
అమరావతి విషయంలో ముందుకు దూసుకెళ్లాలంటే ప్రభుత్వం జడుసుకుంటుండడానికి, వంద ఆలోచనలు చేస్తుండడానికి ప్రధాన కారణం చంద్రబాబునాయుడు అసంబద్ధ నిర్ణయాలు. అత్యుత్సాహం, దుబారా అని చెప్పాలి. కోర్ కేపిటల్ నిర్మాణానికి కేంద్రం ఇచ్చేది కేవలం 2500 కోట్లు మాత్రమే.. అంతకు మించి పైసా కూడా విదిలించరు అని తనకు స్పష్టంగా తెలిసినప్పటికీ.. 60 శాతం నిధులు వస్తే.. వాటిని పూర్తిగా 'తాత్కాలిక' సచివాలయ నిర్మాణానికి తగలేసిన ఘనత చంద్రబాబుకు మాత్రమే దక్కుతుంది. తాత్కాలిక భవనాలు గనుక.. వాటిని చవగ్గా నిర్మించారనుకుంటే పొరబాటు.
చదరపు అడుగుకు 3350 రూపాయలు (ఒప్పందం కుదిరిన నాటికి) చెల్లించి పనులు చేయించారు. ఆ రకంగా.. వాస్తవమైన కోర్‌కేపిటల్ భవనాల ప్రస్తావన వచ్చేసరికి కేంద్రం నుంచి రావాల్సింది ఇక 1000 కోట్లు మాత్రమే అని లెక్కతేలింది. నిధులకోసమ రకరకాల మాయోపాయాలు అవసరం అయ్యాయి. ఇప్పుడు సగంలో ఉన్న నిర్మాణాలను అంతకంటె చాలా ఎక్కువ మొత్తానికి ఒప్పందాలు కుదుర్చుకుని.. ఖజానా మీద మోపలేని భారం ఉంచారు. బొత్స మాటలను బట్టే.. 35వేల కోట్ల నిర్మాణాలు ఆపినట్లు తెలుస్తోంది. అంత మొత్తం సమీకరించడం ఎప్పటికి? పూర్తిచేయడం ఎప్పటికి? చంద్రబాబులాగా.. పునాదులు వేసి వదిలేద్దాం అనుకుంటే సరిపోదు కదా!
రైతులు భూములిచ్చారు సరే…
రాజధాని నిర్మిస్తున్నారనే చంద్రబాబు మాటలు నమ్మి.. కొందరు రైతులు స్వఛందంగానే భూములు ఇచ్చారు. కొందరు బలవంతంగా ఇవ్వవలసి వచ్చింది. కొందరు ససేమిరా అన్నప్పటికీ.. దాదాపుగా లాక్కున్నంత పనిచేసి, భూములు ఇప్పించుకున్నారు. లాండ్ పూలింగ్ ఒప్పందాల ప్రకారం వీరికి డెవలప్‌మెంట్ పూర్తయిన తర్వాత.. తాము ఇచ్చిన దానిలో నిర్దిష్ట వాటాగా, భూమి కూడా దక్కుతుంది. అదీ ఒప్పందం! ఆ ప్రకారం కూడా.. వారు తమ వ్యవసాయ భూములకు దక్కే ధరలకంటే.. డెవలప్‌మెంట్ పూర్తయిన తర్వాత వచ్చే వాటా విక్రయాల ద్వారానే.. అత్యధిక మొత్తాలు పొందగలరు అనేది నిజం. అయితే మళ్లీ పెద్దమొత్తాల్లో వార్షిక కౌలు చెల్లించేలా ఒప్పందాలు చేసుకోవడం ఊహించలేనంత పెద్దభారం.
రాజధాని నగరాన్ని ఏ అయిదుపదేళ్లలోగా పూర్తిగా నిర్మించేసి.. వాడుకలోకి తెచ్చేసే ఉద్దేశం ఉంటే.. అలాంటి అధికభారానికి తల ఒగ్గవచ్చు. కానీ.. అయిదేళ్లలో పునాదులు కూడా సక్రమంగా వేసే ఉద్దేశం లేకుండానే.. ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియకుండానే.. వార్షిక కౌలు చెల్లించే ఒప్పందం… కేవలం కుట్రపూరితంగా స్వజన పక్షపాతంతో ఇలాంటి నిర్ణయం చేశారు.
సుమారుగా ఈ లెక్కలను పరిశీలిస్తే గుండెఠారెత్తిపోతుంది..
రాజధానికోసం 22వేల మంది రైతులనుంచి 33 వేల ఎకరాలు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం.. వీటికి ఎకరాకు, ఏడాదికి 50వేల రూపాయలు చెల్లించాలనేది ప్రాథమిక ఒప్పందం. ప్రతిఏటా దీనిని 10శాతం పెంచుతూ పోతారు. ఆ ప్రకారం గణించి చూస్తే.. తొలి ఏడాది 165 కోట్లు, రెండో ఏడాది 181.5 కోట్లు చెల్లించారు. ఈ ఏడాది సుమారు 200 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. పూర్తి అభివృద్ధికి ఇంకో అయిదేళ్లు పడుతుందనుకుంటే.. మరొక 1100 కోట్లు కేవలం కౌలులకే చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా భూయజమానులైన రైతులకు ఇచ్చే వార్షిక కౌలు మాత్రమే.
పొలాలు కౌలుకు చేస్తున్నందువల్ల, వ్యవసాయ కూలీలుగా ఉన్నందువల్ల ఉపాధిపోయిన వారు మరో కేటగిరీ. వీరికి కుటుంబానికి నెలకు 2500 రూపాయల వంతున ఇస్తారు. ఇలా పొందేవి సుమారుగా 23000 కుటుంబాలున్నాయి. వీరికి చెల్లింపులు చేయాల్సివస్తే.. ఏడాదికి 69కోట్లు అవుతుంది. మరో అయిదేళ్ల వరకు నగరం పూర్తి కాదనకుంటే.. వీరికి తొలినుంచి చెల్లించే సొమ్ము 500కోట్లు దాటుతుంది. అన్నిరకాలుగానూ తొలినుంచి మరో అయిదేళ్ల వరకు కాగల చెల్లింపుల వ్యయమే 2000 కోట్లు. బాప్ రే!
అసలు రాజధానిగా పరిగణించే కోర్ కేపిటల్ సమస్త నిర్మాణానికి కాగల ఖర్చు కేంద్రం చెల్లించాలి. అందుకు వారి అంచనా మొత్తం కేవలం 2500కోట్లు. చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ స్థలాల్లో కోర్ కేపిటల్ ప్లాన్ చేసి.. దాని చుట్టూతా నగర నిర్మాణాన్ని మరోరకంగా ప్లాన్ చేయకుండా.. ఇలాంటి లాండ్ పూలింగ్ అనే వికట ప్రయోగానికి పూనుకోవడం వలన అదనపు భారం.. అక్షరాలా రెండువేల కోట్లు. ఇంకా ఒకటిరెండు ఏళ్లు జాప్యం జరిగితే.. అసలు కోర్ కేపిటల్ బడ్జెట్ ను మించిపోవచ్చు కూడా. ఇంత దారుణమైన భారం అవసరమా? కేవలం పూలింగ్ పుణ్యానికి!!
బాబుగారి బడాయి సలహా!
అమరావతి రాజధాని నిర్మాణానికి నిధుల్లేవనే చర్చ మొదలైన తర్వాత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బడాయి సలహా చెప్పారు. రైతుల నుంచి సేకరించిన మొత్తం స్థలాల్లో.. రాజధాని నిర్మాణానికి పోగా.. ఇంకా 8వేల ఎకరాలు మిగులాయని, వాటిని విక్రయించి వచ్చే సొమ్ము ద్వారా రాజధాని కట్టేయవచ్చునని ఆయన సెలవిచ్చారు. మాటల్లో వినడానికి చాలా ఈజీ సొల్యుషన్ లాగా కనిపిస్తుంది. మరైతే రెండున్నరేళ్లపాటూ భూముల్ని తన స్వాధీనంలోనే ఉంచుకుని.. అలాంటి ప్రయత్నం కూడా చంద్రబాబు ఎందుకు చేయలేకపోయినట్లు? రాజధాని నిర్మాణాలను సగం వరకైనా పూర్తి చేయగలిగి ఉంటే… ప్రజలు ఆయనను మళ్లీ నమ్మి మొన్నటి ఎన్నికల్లో గెలిపించేవారు కదా? అనేది ప్రశ్న. అలా ఆయన చెప్పినంత తేలిగ్గా అమ్మేయడం వీలుకాదు.
ఆ విషయం సీఆర్డీయే సమీక్ష తర్వాత.. బొత్స స్పష్టంగా చెప్పారు. 'రాజధాని నిర్మాణం పనులు మొత్తం పూర్తయిన తర్వాత గానీ.. భూములన్నింటికీ విలువ పెరగడం జరగదు. అయితే ఇప్పుడు నిర్మాణాలు చేపట్టడానికి నిధులు ఎక్కడినుంచి వస్తాయి?' అని! ఆ సందేహం నిజమే. రాజధాని గురించి బడాయిలు చెబుతున్న తొలిరోజుల్లో చంద్రబాబునాయుడు.. ఈ నగరాన్ని 70 లక్షల మంది మంది నివాసానికి యోగ్యంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర జనాభానే 5కోట్లు అయినప్పుడు.. అందులో ఏడోవంతు.. ఒక్క రాజధాని నగరంలోనే జీవించడం ఎలాసాధ్యం? సాధ్యమవుతుందనే అనుకుందాం!
ఎలాంటి పరిస్థితుల్లో కుదురుతుంది? ఆ దామాషాలో ఇక్కడ ఉపాధి అవకాశాలు మిక్కుటంగా ఉన్నప్పుడు కుదురుతుంది. ''ముందు కట్టేద్దాం.. జనం వచ్చేస్తే తర్వాత ఉపాధి అవకాశాలు వస్తాయి'' అంటారు చంద్రబాబు. ''ముందు ఉపాధి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తే తప్ప… జనంరారు'' అంటారు నిపుణులు. ఈ చర్చ ఎప్పటికి తెగుతుంది. 'పెళ్లి జరిగితే పిచ్చి కుదురుతంది అని వైద్యుడు చెప్పాడు నిజమే. కానీ పిచ్చి కుదిరితే తప్ప పెళ్లి జరగదు కదా..'.. అలాగే రాజధాని అభివృద్ధి కూడా పీటముడిలా బిగుసుకుపోయింది.
తమాషా ఏంటంటే.. అంతర్గత సమాచారం మేరకు.. ఇప్పటి ప్రభుత్వం కూడా అదే తరహాలో ఆలోచిస్తోంది. కానీ ఆచరణాత్మక దృష్టితో చూసినప్పుడు ముందు రాజధాని- అనుబంధ ఉపాధి అవకాశాలు కనిపిస్తే తప్ప.. జనజీవితాలు ఇక్కడ స్థిరపడడం జరగదు.
ముంపు బెడద లేదంటే నేరం!
రాజధాని ప్రాంతం ఎక్కడ మునిగింది? ఒక్క ఎకరమైనా మునిగిందేమో చూపించండి.. అంటూ చాలామంది నాయకులు డైలాగులు వల్లించారు. అమరేశ్వరుడు కొలువైన అమరావతి పట్టణం మొన్నటి వరదలకే మునిగిపోయింది. గుడి వరకు నీళ్లు వచ్చేశాయి. ముంపు విషయంలో శివారమకృష్ణ కమిటీ చెప్పిన మాటల్ని జాగ్రత్తగా గమనించాలి. 'ప్రతి పదేళ్లలో ఏదో ఒకసారి అతి పెద్ద ముంపుబెడద పొంచిఉంటుంది' అని వారు చెప్పారు. 2009లో అంతపెద్ద ముంపు వచ్చింది.. ఈసారి 2019లో ఇప్పుడు కూడా వచ్చింది. రాబోయే పదేళ్లలో ఏదో ఒకసారి రావొచ్చు. అంతేతప్ప.. గత ఏడాది రాలేదు కదా.. ఈసారి కావాలని నీటిని విడుదల చేయడంలో కుట్రచేశారు అనివాదిస్తే చేటు తప్పదు.
ఈ విషయంలో మరో అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మనరాష్ట్రంలో చుక్క వర్షం లేకుండా.. కేవలం ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు, వచ్చిన ప్రవాహానికే.. ఈ ఏడాది ఇంతపెద్ద ముంపుబెడద వచ్చిపడింది. అదేసమయంలో.. మన రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసి.. కృష్ణా ప్రవాహానికి అదనంగా, స్థానికంగా ఉండే వాగులు వంకలు కూడా పొంగిఉంటే ఏంటి పరిస్థితి? దీని ప్రభుత్వం యోచించాలి.
అమరావతి రాజధాని ప్రభుత్వ ఖజానా మీద తెల్లఏనుగు ఐరావతం లాగా మారిందన్న మాట అంగీకరించాల్సిన సత్యం. ఆ భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం రివర్స్ టెండర్లు తదితర రూపాల్లో నానాపాట్లు పడుతోంది. అమరావతిని మరోచోటకు మార్చడమా? లేదా? అనే విషయంలో ఇంకా మీమాంసలోనే ఉన్నట్లున్నది. ప్రత్యామ్నాయ ఆలోచనలు ఉంటే అది వేరే సంగతి. ఇక్కడే ఉంచే, కొనసాగించేట్లయితే.. మరింత జాగ్రత్తగా నిధుల సమీకరించుకునే ఆలోచనలు చేయాలి. నిధులకొరత ముసుగులో అయిదేళ్లూ కాలయాపన చేసేస్తే.. ప్రజల మన్నన పలుచన అయిపోతుందని కూడా గ్రహించాలి.
-కపిలముని
[email protected]