టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసులు తప్ప, ఆయన్ను ఏం చేశారు. మహా అయితే రెండు రోజుల క్రితం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. రాత్రికి ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ చర్య ద్వారా అయ్యన్నపాత్రుడికి మైలేజ్ పెంచడం తప్ప, ఈ ప్రభుత్వం ఏం చేసింది? …ఈ ప్రశ్నకు అధికార పార్టీ సమాధానం చెబుతుందా?
అయ్యన్నపాత్రుడు మరింత రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. పౌర సమాజం ఆలోచనల్ని ప్రతిబింబించేలా ఆయన నిలదీస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన మీద 14 కేసులు పెట్టారని ఆయన గుర్తు చేస్తున్నారు. అయితే తననేం పీకారని ఆయన నిలదీస్తున్నారు. దమ్ముంటే తనపై మగతనం చూపాలని ఆయన సవాల్ విసురుతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు మంత్రులు, అధికార పార్టీ నేతలపై అయ్యన్నపాత్రుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బూతులు తిట్టుకోవడంలో వైసీపీ, టీడీపీ నేతలు దొందూ దొందే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అయ్యన్నపాత్రుడు తన వయసు, పెద్దరికాన్ని మరిచి నోరు పారేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అయ్యన్నను అధికార పార్టీ నేతలు అడ్డుకోలేక పోతున్నారనేది నిజం.
అయ్యన్న పాత్రుడు చెబుతున్నట్టు 14 కేసులు పెట్టినప్పటికీ, చివరికి సాధించింది ఏంటి? అనే ప్రశ్నకు శూన్యం అనే సమాధానం వస్తోంది. అధికారంలో వుంటూ, శక్తిమంతమైన కార్యకర్తల బలం ఉండి కూడా అయ్యన్న నోరు మూయించ లేకపోవడం వైసీపీ బలహీనతే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యన్న నోటి దురుసుపై అధికార పార్టీ వ్యూహాత్మకంగా నడుచుకోలేదనేందుకు ఆయన సవాలే నిదర్శనం.
పైపెచ్చు అయ్యన్నను హీరో చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఒక్క అయ్యన్న విషయంలోనూ కాదు, న్యాయ పరంగా ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదనేందుకు ఎన్నైనా ఉదాహరణలు చెప్పొచ్చు. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలెవరినీ ఏమీ పీకలేదు. పైగా ప్రతిపక్షాలకు కావాల్సినంత సానుభూతి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తుంది.