నాలుగో సీసా ఉందా.. తస్మాత్ జాగ్రత్త!

రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం లక్ష్యంగా… అడుగులు కదుపుతున్న జగన్మోహన రెడ్డి సర్కారు, తొలిదశలో రాష్ట్రంలో ఉన్న లిక్కర్ దుకాణాల్లో అయిదోవంతు…

రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం లక్ష్యంగా… అడుగులు కదుపుతున్న జగన్మోహన రెడ్డి సర్కారు, తొలిదశలో రాష్ట్రంలో ఉన్న లిక్కర్ దుకాణాల్లో అయిదోవంతు మూత వేసేసింది. అలాగే అధికారంలోకి వచ్చిన తొలిరోజులనాటినుంచే.. బెల్టుషాపుల రూపేణా పల్లెపట్టుల్లో జరుగుతున్న అక్రమ దందాదకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టింది. ఇవాళ్టినుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడుస్తున్నాయి.

ఈ మేరకు కొత్త విధానంలో భాగంగా ఎక్సయిజు శాఖ కొత్త నిబంధనలను విధించింది. వీటి ప్రకారం.. ఎవ్వరి వద్ద అయినా మద్యం మూడు సీసాలు మాత్రమే  ఉండాలి. మీ వద్ద నాలుగోసీసా ఉన్నదా.. అయితే కటకటాలు లెక్కించాల్సిందే. ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరు అయినప్పటికీ.. ప్రజా సంక్షేమం మాత్రమే ముఖ్యమనే భావనతోనే జగన్ సర్కారు దశలవారీ మద్య నిషేధానికి సిద్ధపడిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే.. వ్యక్తులు ఏకకాలంలో మూడు కంటె ఎక్కువ బాటిళ్లు కలిగి ఉండరాదనే నిబంధన కూడా తెచ్చారు.

దీనితో పాటు దుకాణాలవద్దనే మద్యం సేవించే వెసులుబాటు కల్పించే పర్మిట్ రూంలను కూడా రద్దు చేశారు. దీనివల్ల వినియోగం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రోడ్డుమీద, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడితే గనుక.. శిక్ష విధించేలా నిబంధనలను రూపొందించారు. ఎటూ దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంటాయి గనుక.. ఎమ్మార్పీ ధరలకే విక్రయిస్తారు. అయితే రాత్రి 9 గంటలకే దుకాణాల మూసేసేలా నిబంధన పెట్టారు. దీనివల్లకూడా మద్యం వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ.. క్రమక్రమంగా ప్రజల్లో మద్యప్రియత్వాన్నే తగ్గించాలనేది ప్రభుత్వం యోచన. అలాగే క్రమంగా మద్యనిషేధాన్ని సాధించాలని అనుకుంటున్నారు.

మరో సంగతి ఏంటంటే.. మద్య ప్రియులకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలుస్తున్నాయి. అలాగే విక్రయించే దుకాణాలకు కూడా నిబంధనల అవసరం ఉంది. వ్యక్తులకు ఒక్కొక్కరికి మూడు బాటిళ్లు మించి విక్రయించకుండా, కట్టడి చేసేలా ఉండాలి. రెండువైపులా నిబంధనలు గట్టి పరిస్తే.. మద్యం వినియోగం ఖచ్చితంగా తగ్గుతుంది.