ప్రభుత్వం సినిమా టిక్కెట్లమ్మితే ఎవరికి నష్టం?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లు కొనడానికి ప్రత్యేకమైన వెబ్సైట్ పెడుతోందనగానే సినిమా రంగం నుంచి ఉద్యమం వెల్లువెత్తుతుందని చాలామంది భావించారు. కానీ అంతా నిశ్శబ్దంగా ఉంది.  Advertisement రేపో మాపో చిరంజీవి నాయకత్వంలో…

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లు కొనడానికి ప్రత్యేకమైన వెబ్సైట్ పెడుతోందనగానే సినిమా రంగం నుంచి ఉద్యమం వెల్లువెత్తుతుందని చాలామంది భావించారు. కానీ అంతా నిశ్శబ్దంగా ఉంది. 

రేపో మాపో చిరంజీవి నాయకత్వంలో థియేటర్ యజమానులు, నిర్మాతల పక్షాన ఆ.ప్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసి టికెట్ ధరల పెంపుదల విషయంపై చర్చించాలనుకుంటున్నారన్న వార్తలు చెలామణీ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సొంత వెబ్సైట్లో టికెట్ల అమ్మకమనే జీవో ని విడుదల చేయడాన్ని సినీ పెద్దలు ఎలా తీసుకునుంటారు?

అసలీ కొత్త వ్యవస్థ వల్ల ఎవరికీ నష్టం లేదా? అందుకే ఇంత సైలెంటుగా ఉన్నారా? లేక నిజంగా నష్టం ఉన్నా ఆ నష్టానికి గల కారణాలు బయటికి చెప్పలేక బెల్లం కొట్టిన రాయిలా కిమ్మనకుండా ఉన్నారా? 

నిజంగా ఇది నోటి దగ్గర ముద్ద లాక్కునే వ్యవహారమయితే ఈ పాటికి ఉద్యమం లేవనెత్తాలి కదా? కనీసం ఇదేం అన్యాయమని నోరెత్తాలి కదా? 

ప్రభుత్వంతో గొడవెందుకులే అని సినీ పెద్దలు సైలెంటుగా ఉంటున్నారని కొందరంటున్నారు. సినిమా హీరోలకి, ఆ.ప్ర లో భూములున్న కొందరు నిర్మాతలకి ఆ భయాలో, అనుమానాలో ఉంటే ఉండొచ్చు కానీ రాజకీయాలు వెలగబెడుతున్న పవన్ కళ్యాణ్ గారి నోరేమయ్యిందని? రెండ్రోజుల క్రితం రోడ్ల విషయంలో సామెతలతో సెటైర్లు వేసి, వినాయకచవితి నియమాల విషయంలో మతకలహాలని రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో నోరెత్తిన పవర్ స్టార్ కూడా సినిమా టికెట్ల విషయంలో పవర్ కట్టైనట్టు కూచున్నారేం? 

దొంగతనానికి వచ్చిన వాడు కాల్లో మేకు దిగినా గట్టిగా అరవడు…దొరికిపోతాననే భయంతో. నొప్పిని పంటిబిగువున భరిస్తాడు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా అంతా సైలెంటుగా ఉందంటే అలాంటిదేదో ఉందని అర్థం చేసుకోవాలా? అయితే ఇలా ఆలోచించి కంక్లూజన్ చేసేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. 

ఎందుకంటే ఈ మధ్యనే గ్రేటాంధ్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. అంతా కంప్యూటరైజ్ అయిపోయిందని, అందరూ ట్యాక్సులు సక్రమంగా కడుతున్నారని, ఎగ్జిబిటర్స్ కి గానీ నిర్మాతలకి గానీ దొంగ లెక్కలు చూపించే అవకాశమే లేదని ఆయన తెలిపారు. 

అలాంటప్పుడు వ్యవస్థని ఎవరు నడిపితే ఏముంది అందరూ అన్ని ట్యాక్సులు సక్రమంగా కడుతుంటే! ఇప్పటికే అంతా పారదర్శకంగా ఉంది…ప్రభుత్వం ఆ పారదర్శకత్వాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటోంది. అంతే కదా! కనుక కొత్త జీవోలో ఇబ్బందేముంది? ఇలా అనుకునే అందరూ సైలెంటుగా ఉన్నారేమో అనుకోవచ్చా!? ఒకవేళ ఇదే నిజమైతే సైలెన్స్ ఉండదు. “వెల్కం” అంటూ ప్రభుత్వానికి స్వాగతం చెప్పాలి. అది జరగలేదు. 

తెలుగు సినీ ప్రముఖులు నిశ్శబ్దంగా ఉంటే తమిళ హీరో విశాల్ మాత్రం ఆ.ప్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ పెద్ద ట్వీట్ పెట్టాడు. సినిమా టికెట్ల విషయంలో ఇలాంటి వ్యవస్థ రావాలని ఎప్పటినుంచో తాము కూడా కోరుకుంటున్నట్టు తెలిపాడు. అంతలా కోరుకుంటున్నారంటే ఇన్నాళ్లు ఉన్న వ్యవస్థలో ఎక్కడో పారదర్శకత లోపించిందనేగా? 

తెలుగు సినీ ప్రముఖలకి మాత్రం అసలీ విషయంలో సైలెన్స్ ఎందుకు? ఏమీ చెయ్యలేకనా? ఏం చేసినా ఉపయోగం లేదనా? ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదనా? లేదా తుఫాను ముందు నిశ్శబ్దమా? కాలమే సమాధానం చెప్పాలి. 

సినిమా అనేది ప్రైవేటు వ్యాపారం. ప్రైవేటు వ్యాపారాల్లో ప్రభుత్వజోక్యమేంటని కొందరు వాపోతున్నారు. 

అయితే ఇదే సినిమా వారికి స్టూడియోలు కట్టుకోవడానికని, ఇళ్లు కట్టుకోవడానికని ప్రభుత్వం చాలానే చేసింది. అలా ప్రభుత్వ లబ్ధి పొందిన రంగం కొందరికి గుత్తాధిపత్యమైపోయి తక్కిన వారికి నష్టాలు మిగులుస్తున్నా, కొందరు మాత్రం కోట్లకి పడగలెత్తేసి కొందరు అప్పుల్లో కూరుకుపోతున్నా దానిని సెట్ చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవడంలో తప్పేముంది? 

దళారీ వ్యవస్థల్ని రూపు మాపడానికి రైతు బజార్లొచ్చాయి. రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి రైతుభరోసాకేంద్రాలొచ్చాయి. సమాజమంటే రైతులొకరే కాదు. అందరూనూ! 

ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో సమయంలో ఒక్కో వ్యవస్థని ప్రక్షాళణ చేసే ఆలోచన వస్తుంది. ఇప్పుడున్న ఆ.ప్ర ప్రభుత్వం దృష్టి సినిమా రంగంపై పడింది. పారదర్శకత కోరుతోంది, నేరుగా పర్యవేక్షించడానికి పూనుకుంది. ఇది స్వాగతించదగిన పరిణామమే కదా. 

స్వాగతించనివాళ్లు పీడించి కోట్లకు పడగలెత్తినవాళ్లైనా అయ్యుండాలి, దొంగసొమ్ము వెనకేసుకునే వాళ్లైనా అయ్యుండాలి, అటువంటి వారిని సమర్ధించే వాళ్లైనా అయ్యుండాలి. ఏదీ కాకపోతే ప్రభుతం ఏం చేసినా విమర్శించాలనుకునే ప్రతిపక్ష వర్గమైనా అయ్యుండాలి. తక్కువ సంఖ్యలో ఉన్న ఈ గ్రూపుల్ని మినహాయిస్తే మిగతా ప్రజానీకానికంతటికీ ఈ నిర్ణయం వల్ల నష్టమేమీ లేనట్టే, వారు స్వాగతిస్తున్నట్టే. 

గ్రేటాంధ్రా బ్యూరో