గ్రేట్ ఆంధ్ర రిపోర్ట్: సీటీమార్ Vs టక్ జగదీష్

ఒక సినిమా నేరుగా థియేటర్లలో రిలీజైంది. మరో సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. కానీ ఒకే రోజు విడుదలవ్వడంతో సహజంగానే పోటీ ఏర్పడింది. ఏ సినిమా సక్సెస్ అయిందనే చర్చ మొదలైంది. అవే సీటీమార్,…

ఒక సినిమా నేరుగా థియేటర్లలో రిలీజైంది. మరో సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. కానీ ఒకే రోజు విడుదలవ్వడంతో సహజంగానే పోటీ ఏర్పడింది. ఏ సినిమా సక్సెస్ అయిందనే చర్చ మొదలైంది. అవే సీటీమార్, టక్ జగదీష్ సినిమాలు.

థియేటర్లలోకొచ్చిన సీటీమార్ సినిమాపై ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఓటీటీలోకొచ్చిన టక్ జగదీశ్ పై స్పందన ఏంటి? దీనిపై గ్రేట్ ఆంధ్ర ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. వేల సంఖ్యలో పాల్గొన్న ప్రేక్షకులు ఈ రెండు సినిమాలపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

ముందుగా థియేటర్లలో రిలీజైన సీటీమార్ విషయానికొద్దాం. గోపీచంద్-తమన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సక్సెస్ అంటూ సర్వేలో పాల్గొన్న 75.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక 18శాతం మంది యావరేజ్ అని చెప్పగా.. 6.5శాతం మంది ఫ్లాప్ అన్నారు.

ట్రేడ్ పరంగా చూసుకుంటే.. కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సీటీమార్ సినిమాకు ఓపెనింగ్స్ బాగున్నాయి. థియేట్రికల్ మార్కెట్లో గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ.. బి, సి సెంటర్ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారని మేకర్స్ అంటున్నారు. అయితే వసూళ్లు ఏ స్థాయిలో వచ్చాయనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు మొదటి రోజు 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది.

ఇక టక్ జగదీష్ విషయానికొద్దాం. నాని నటించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. గ్రేట్ ఆంధ్ర పోల్ లో ఈ సినిమాను యావరేజ్ అని 39.8 మంది అభిప్రాయపడగా.. 33.6 శాతం మంది హిట్ రిపోర్ట్ ఇచ్చారు. ఇక 26.6 శాతం మంది ఫ్లాప్ అన్నారు. ట్రేడ్ పరంగా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికేం లేదు. సదరు ఓటీటీ కి ఎంతమంది సబ్ స్కైబర్లు పెరిగారు, ఎన్ని గంటల వ్యూయర్ షిప్ వచ్చిందనే లెక్కలు మాత్రమే దీనికి ఉంటాయి. ఆ అంకెల్ని ఓటీటీ జనాలు రిలీజ్ చేయరు, ఒకవేళ చేసినా సామాన్య జనాలకు అది అనవసరం.