బండ్ల గణేశ్ మాటలు కామెడీ కావచ్చేమో కానీ, ఆయన చర్యలు మాత్రం సీరియస్‌గానే ఉన్నాయి. “మా” ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు.”మా” ఎన్నికల షెడ్యూల్‌కు ఎంతో ముందుగానే టాలీవుడ్‌లో ఎత్తుకు పైఎత్తులకు “తెర”లేపారు.
“మా” బరిలో ప్రముఖంగా ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్యే పోటీ ఉండే అవకాశాలున్నాయి. అంతకు ముందు ప్రచారం జరిగినట్టు… జీవితా రాజశేఖర్, హేమ “మా” అధ్యక్ష బరిలో లేరు. వీళ్లద్దరితో ప్రకాశ్‌రాజ్ సయోధ్య కుదుర్చుకుని తన ప్యానల్ లోకి తెచ్చుకున్నారు. ప్యానల్‌ను ప్రకటించి తనది బలమైన టీం అనే సంకేతాలు పంపారు.
ప్యానల్ ప్రకటించిన మరుసటి రోజే …బండ్ల గణేశ్ ప్రకటనతో కలకలం. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లోకి జీవితా రాజశేఖర్ రావడం తన కిష్టం లేదని బహిరంగంగా ప్రకటించారు. తన ఆరాధ్య హీరోలపై అనేక సందర్భాల్లో జీవితా రాజశేఖర్ విమర్శలు గుప్పించారని, అలాంటి వ్యక్తి ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి కీలక పదవికి పోటీ చేయడం సుతారమా ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా జీవిత, బండ్ల గణేశ్ మధ్య మాటల తూటాలు పేలాయి.
తాను జనరల్ సెక్రటరీ పదవికి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, గెలిచి చూపిస్తానని బండ్ల గణేశ్ ధీమాగా ప్రకటించారు. బండ్ల గణేశ్ పదేపదే పాత గాయాలను తవ్వడం వెనుక పక్కా వ్యూహం ఉందనేది బహిరంగ రహస్యమే. తద్వారా ఇండస్ట్రీలో మెగా వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలన్న ఆయన ప్రయత్నాలు కొంత మేరకు సఫలీకృతమయ్యాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో మెగా అభిమానులు, అనుచరుల మద్దతు కూడగట్టుకోడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా ఆయన విడిచిపెట్టడం లేదు. తాజాగా మెగాస్టార్ మేనల్లుడు , హీరో సాయిధరమ్‌తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలు కావడంపై ప్రస్తుత “మా” అధ్య క్షుడు నరేశ్ వ్యాఖ్యలను బండ్ల గణేశ్ వివాదాస్పదం చేయడంపై చర్చ జరుగుతోంది. బండ్ల గణేశ్ అన్న మాటల్లో ప్రధానంగా… “తప్పు కదా సర్. సాయి తేజ్ తొందరగా కోలుకోవాలని ప్రార్థించాలి తప్ప, ఇలాంటి టైమ్ లో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు, ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి సర్” అని పేర్కొన్నారు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలనే చందంగా, ఒకవైపు నరేశ్‌కు హితవు చెప్పడం, మరోవైపు మెగాస్టార్ అనుచరుల మద్దతు కూడ గట్టడం… రెండూ జరిగిపోయాయనే అభిప్రాయాలు టాలీవుడ్‌లో వ్యక్తమవుతున్నాయి. బండ్ల గణేశ్ పైకి మాట్లాడుతున్నట్టు, కనిపిస్తున్నట్టు అమాయకుడేమీ కాదని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. బండ్ల గణేశ్ ప్రతి మాట వెనుక “మా” ఎన్నికల ముందు చూపు ఉందంటున్నారు. ఇదే సమయంలో “మా” ఎన్నికల చదరంగంలో “మెగా” కుటుంబ సభ్యులు పావులుగా మిగులుతున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు.