జయలలిత జీవితం ఆధారంగా ఇప్పటికే పలు సినిమాల ప్రకటనలు వచ్చాయి. ఒక వెబ్ సీరిస్ కూడా వచ్చేసింది. తాజాగా *తలైవి* సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో జయలలిత పాత్రను పోషించింది కంగనా రనౌత్. వ్యక్తిగతంగా ఆమె సంగతెలా ఉన్నా.. కంగనా నటనా ప్రతిభ విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. ఈ సినిమాకు సంబంధించి కంగనా లుక్స్ కు ఆదిలోనే ప్రశంసల వర్షం కురిసింది.
ఇక సినిమా విడుదల నేపథ్యంలో కూడా ఎవరూ కంగనా నటనను విమర్శించలేకపోతున్నారు. ఆమె ఎంతో కొంత న్యాయం చేసిందనే మాటే వినిపిస్తోంది. అయితే ముందు ముందు తన జీవిత కథ ఆధారంగా సినిమా అంటూ వస్తే.. తన పాత్రలో ఎవరు నటించాలనే అంశం గురించి జయలలిత ఒక సారి చెప్పిందట. గతంలో జయలలితను ఇంటర్వ్యూ చేసిన సిమిగరేవాల్ ఈ అంశం గురించి స్పందించారు.
తన బయోపిక్ లో తన పాత్రలో నటి ఐశ్వర్యరాయ్ చేస్తే బాగుంటుందని తనతో జయలలిత అన్నట్టుగా సిమిగరేవాల్ ట్వీట్ చేశారు. తన పాత్రకు తగిన పర్సనాలిటీ ఐశ్వర్యనే అని జయలలిత చెప్పిందట. ఇలా ఐశ్వర్యపై జయలలిత తన అభిమానాన్ని చాటుకున్నట్టుగా ఉంది. అయితే గతంలో ఒకసారి ఐశ్వర్య జయలలిత ను పోలిన పాత్రను చేసిందని వేరే చెప్పనక్కర్లేదు. మణిరత్నం తీసిన *ఇద్దరు* సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించింది.
అందులో ఎంజీఆర్, కరుణానిధిల జీవిత కథ లాంటి ఇద్దరు సినిమాలో ఐశ్వ్య చేసింది జయలలిత పాత్రే! అయితే మణిరత్నం ఆ సినిమాలో ఆ పాత్రను అర్ధాంతరంగా ముగించేశాడు. ఆ సినిమానే ఐశ్వర్యకు తొలి సినిమా లాంటిది. మరి ఆ సినిమాను జయలలిత కూడా వీక్షించి ఉండవచ్చు. ఐశ్వర్య నటన ఆమెకు నచ్చి ఉండొచ్చు కూడా. అందుకే తన బయోపిక్ ను తీస్తే అందులో ఐశ్వర్యే నటించాలని ఆమె అని ఉండవచ్చు.
మరి ఇప్పుడు ఇంకా అవకాశం ఉన్నట్టే. జయలలిత బయోపిక్ ఒకటి వచ్చేసినా, వెబ్ సీరి స్ కూడా ఇప్పటికే విడుదల అయినా.. మరో కోణంలో జయ జీవితాన్ని చూపించే అవకాశాలు మిగిలే ఉంటాయి. ఆమె జీవితంలో లెక్కలేనన్ని చాప్టర్లు జన జీవితంలో బాగా చర్చకు నోచుకున్నాయి. ఆ పరిణామాల ఆధారంగా వేర్వేరుగా సినిమాలు రావొచ్చు. కంగనా జయపాత్రలో నటించగా ఒక సినిమా వచ్చినా, ఉత్సాహం ఉంటే మరొకరు ఎవరైనా ఐశ్వర్యరాయ్ ను జయ పాత్రలో చూపుతూ ఒక సినిమాను రూపొందించే అవకాశాలు మిగిలే ఉన్నట్టే. మరి ఆ ప్రయత్నం ఎవరైనా ముందు ముందు చేస్తారో!