వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీయలోని అన్ని ఎంపీ సీట్లలోనూ నేతలు జయకేతనం ఎగురవేశారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు అనుకున్న ఎంపీ సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయం సాధించడమే కాదు, భారీ భారీ మెజారిటీలు కూడా సాధించారు. ఒకరకంగా సంచలన విజయాలు అవి. ఆఖరి నిమిషంలో అభ్యర్థులుగా రంగంలోకి దిగిన వారు కూడా అపూర్వ విజయాలను సాధించారు.
తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన షాక్ ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంభ్రమాశ్చర్యాన్ని కలిగించారు వారంతా. ఆ గెలుపుకు దాదాపు రెండున్నర సంవత్సరం కావొస్తోంది. మరి ఇంతకీ ఎంపీల పనితీరు ఎలా ఉందంటే.. పనెలా ఉన్నా.. వారి సందడి మాత్రం లేదని స్పష్టం అవుతోంది. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు క్యాడర్ ను కలుపుకుపోవడంలో కానీ, తమకంటూ ఒక ఉనికిని ఏర్పరుచుకోవడంలో కానీ విజయవంతం కావడం సంగతలా ఉంటే.. అనాసక్తిగా సాగినట్టు అనిపిస్తుంది.
గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్, అనంతపురం నుంచి తలారి రంగయ్య, కర్నూలు నుంచి డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి, కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, చిత్తూరు నుంచి రెడ్డెప్ప, తిరుపతి నుంచి ఇటీవలి ఉప ఎన్నికలో డాక్టర్ గురుమూర్తిలు విజయం సాధించారు. వీరిలో రాజకీయంగా అప్పుడప్పుడైనా హడావుడి చేస్తున్న వారు తక్కువమందే.
మిథున్ రెడ్డేమో లోక్ సభలో డిప్యూటీ స్పీకర్లలో ఒకరిగా ఉంటూ అప్పుడప్పుడు జాతీయ స్థాయిలో హైలెట్ అవుతున్నారు. అలాగే మిథున్ తండ్రి మంత్రి హోదాలో ఉండటం, వారి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకం అనే పేరును తెచ్చుకోవడం, మిథున్ కన్నా ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరచూ రాజకీయ ప్రకటనలు, ప్రత్యర్థులకు సవాళ్లను చేస్తూ కాక రేపుతూ ఉంటారు.
మిథున్ రెడ్డి అప్పుడప్పుడు మాత్రమే రాజకీయ పరమైన అంశాల గురించి స్పందిస్తూ ఉంటారు, ప్రధానంగా ఢిల్లీ నుంచినే స్పందనలు ఉంటాయి. అయితే రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయి స్పందనలతో తండ్రీ కొడుకుల్లో ఎవరు స్పందించినా ఒకటే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానపరమైన అంశాల్లో కూడా మిథున్ రెడ్డి అండర్ కరెంట్ వర్క్ ఉంటుందంటారు.
కడపను మినహాయిస్తే మిగిలిన రాయలసీమలోని నేతలను కలుపుకుపోవడం, ఎవరికేం కావాలనే అంశాల గురించి మిథున్ రెడ్డి వర్క్ జరుగుతూ ఉంటుందంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ విభాగం అధ్యక్షుడు కూడా కావడంతో మిథున్ రెడ్డికి తగిన గుర్తింపు కూడా ఉంది.
గొప్ప వక్తలు కారా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల్లో విద్యాధికులు ఉన్నారు. డాక్టర్ గురుమూర్తి, డాక్టర్ సంజీవ్ కుమార్.. లు వృత్తి రీత్యా ఆ హోదాలను పెట్టుకున్నారు. అయితే వీరి వాగ్ధాటి ఏమిటనేది ఇప్పటి వరకూ బయటపడలేదు, లోక్ సభ లో మంచి ప్రసంగాలతోనో, రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన అంశాల్లోనే వీరి ప్రసంగాల సత్తా ఏమిటో బయటపడలేదు. ఇంకెప్పుడు బయటపడుతుందో కూడా తెలియదు. వ్యాపారవేత్త అయిన పోచా, ప్రభుత్వ వ్యవస్థలో చాలా కాలం పాటు పని చేసిన తలారి రంగయ్య లు కూడా తెలుగు వారికి వినిపించేలా పార్లమెంటులో గళమెత్తిన దాఖలాలు లేవు.
ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ… ఎంపీలు గొప్పగా స్పందించే అవకాశాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కనీసం రాష్ట్ర సమస్యలను అధ్యయనం చేసి, తమ నియోజకవర్గం అంశాలనైనా దేశ పార్లమెంట్ లో ప్రస్తావిస్తే అంతకన్నా ప్రజలకు కావాల్సింది ఏమీ లేదు. దేశంలోనే రాయలసీమ ప్రాంతం అత్యంత కరువుతో కూడుకున్న ప్రాంతంగా నిలుస్తూ ఉంటుంది. ఆ ప్రాంతం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అంశాలను తలెత్తుకుంటున్నారు. వాటిల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకంతో సహా పలు అంశాలున్నాయి. వాటికి జాతీయ స్థాయిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి.
కేంద్రమే వాటికి అడ్డుపుల్లలు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనా ఫర్వాలేదు కానీ, రాయలసీమ వైపు మాత్రం వరద నీటిని మళ్లించడానికి కుదరదని తెలంగాణ ప్రభుత్వంతో పాటు, రివర్ బోర్డులు స్పందిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎంపీలు ఇలాంటి అంశాలను పార్లమెంట్ చర్చలో చేరిస్తే, సీమ పరిస్థితి ఏమిటో వివరించి, జరుగుతున్నది ఏమిటో చెప్పి.. ఒక చర్చనీయాంశంగా మార్చగలగాలి. అయితే కనీసం ఈ పాటి చొరవ కూడా ఎంపీల్లో లేకపోవడం గమనార్హం.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తెర మీదకు తీసుకురాగలిగింది. ఈ విషయంలో అభినందనలే. అయితే… ఈ విషయంలో అన్ని రకాల అస్త్రాలనూ ప్రయోగించి, అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుని పూర్తి చేయాల్సిన బృహత్తర బాధ్యత కూడా ఆ పార్టీ మీదే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఇలాంటి అంశాలను కేంద్రం దృష్టికి, దేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం చాలానే ఉంది.
అత్యల్ప స్థాయి వర్షపాతం ఉన్న ప్రాంతం విషయంలో కాస్తంత కరుణ చూపించండి అని దేశం మొత్తానికీ, కేంద్రానికి అర్థమయ్యేలా చేయాలనే గొప్ప కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టవచ్చు. దీని వల్ల వాళ్లకే రాజకీయ మైలేజ్ కూడా వస్తుంది. ఎంపీలు అడిగితే అయిపోతుందా? అనే ప్రశ్నే వద్దు. ఎంపీలు స్పందిస్తే ఇదో చర్చ అవుతుంది. మీడియాలో కవరేజ్ వస్తుంది. ఇతర ప్రాంతాల ప్రజలకూ ఇదెంత చిన్నపాటి అంశమో అర్థం అవుతుంది. వృథాగా సముద్రంలోకి కలిసే నీళ్లతో రాయలసీమ గతి మారిపోతుందని కేంద్రానికి, ప్రజలకు విశదీకరించాల్సిన అవసరం చాలానే ఉంది. మరి ఇలాంటి విషయాల్లో ఎంపీలు ఎందుకు బాధ్యతను తీసుకోకూడదు?
కేవలం ఇదొక్క అంశం మాత్రమే కాదు.. ఎంపీ స్థాయిలో ఉన్న వారికి ఇలాంటి అంశాలు బోలెడన్ని వారి దృష్టికి వస్తూ ఉంటాయి. వాటిల్లో తీవ్రమైన సమస్యలు, చిన్న పాటి పరిష్కారాల మీద ఆధారపడినవి ఎన్నో ఉంటాయి. వాటి మీద స్పందిస్తే.. ఎంపీలపై వారి ప్రజలకు కూడా కొంత నమ్మకం పెరుగుతుంది. ఎంపీలు అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం లేదు. కేవలం తమ నియోజకవర్గం, తమ జిల్లా, తమ ప్రాంత సమస్యలను హైలెట్ చేయగలిగినా.. చాలు. అయితే ఇలాంటి చొరవ మాత్రం పెద్దగా కనిపించడం లేదు.
ఎనిమిది మంది ఎంపీలున్నారు. వీరు ఈ టర్మ్ లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఒకటీ నెత్తికెత్తుకుని దానికి అన్ని అనుమతులూ సాధించగలిగితే వారి జీవితాలే చరితార్థం అవుతాయి కూడా. ఎంపీ హోదాలను ఇచ్చిన ప్రజల రుణాన్ని కూడా వారు తీర్చుకున్నట్టుగా అవుతుంది . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ దిశగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విషయంలో వారే ఒక ప్రణాళికను రచించుకుని ముందుకు వెళితే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు.
రాయలసీమలో ఇంకాస్త మెరుగుపడితే పరిస్థితులనే మార్చే అంశాలు మరిన్ని ఉన్నాయి. ఒకవైపు సీమ హార్టికల్చర్ హబ్ గా మారుతోంది. వందల, వేల ఎకరాల్లో పళ్ల తోటలు సాగవుతున్నాయి. మామిడి, అరటి, చీనీ, నల్ల నేరేడు వంటి పంటలు విస్తృతంగా సాగవుతున్నాయి. పరిమిత నీటి వనరుల్లోనే ఇలా హార్టికల్చర్ హబ్ గా మారుతోంది రాయలసీమ. రాబోయే సంవత్సరాల్లో ఇంకా కొన్ని వేల ఎకరాల్లోని పళ్ల తోటలు పంటను ఇవ్వబోతున్నాయి. భారీ ఎత్తున పండించడం ఒక ఎత్తు అయితే, వాటి మార్కెటింగ్ మరో ఎత్తు. రానున్న రోజుల్లో మార్కెటింగ్ అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉంది.
నాణ్యమైన పళ్లే పండుతాయి కాబట్టి… వాటికి బయట కూడా బోలెడంత మార్కెట్ ఉంటుంది. చేయాల్సిందల్లా అనుసంధానం మాత్రమే, పళ్ల ఎగుమతుల అవకాశాలు గురించి ఎంపీలు కాస్త దృష్టి పెట్టాలి. అరటి, మామిడికి విదేశాల్లో కూడా డిమాండ్ ఉంటుంది. అయితే ఎగుమతులకు ట్రాన్స్ పోర్ట్ తో సహా అనేక ఆటంకాలు ఉండనే ఉంటాయి. ఇలాంటి సమస్యలపై కూడా దృష్టి పెట్టి, అన్ని రకాలుగానూ లైన్లను క్లియర్ చేయవచ్చు. ఇటీవలే కిసాన్ ఎక్స్ ప్రెస్ రైలు ఒకటి ప్రారంభం అయ్యింది. రానున్న రోజుల్లో వాటి అవసరం మరింత కూడా ఏర్పడవచ్చు. ఇలాంటి అంశాల మీద కూడా ఎంపీలు దృష్టి పెట్టి, తమ ప్రాంతాల్లోని రైతులకు ఎంతో కొంత మేలు చేయవచ్చు.
ఇవన్నీ ఎంపీలు తమ శ్రద్ధతో చేయదగిన పనులే. ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెడితే ఎప్పుడో ఫలితాలు రావొచ్చు. అప్పుడు కూడా వీరి పేరే ప్రస్తావనకు వస్తుంది. ప్రజలు దేన్నీ మరిచిపోరనే విషయాన్ని గుర్తించి, ప్రజలు ఇచ్చిన పదవులకు సార్థకతను కలిగించాలి.