అధికారం పోతే తప్ప టీడీపీ నేతలకు రాయలసీమ సమస్యలు గుర్తు రావు. నవ్విపోతారనే స్పృహ కూడా లేకుండా రాయలసీమ కోసమంటూ టీడీపీ నేతలు సమావేశం కావడం విమర్శలకు తావిస్తోంది. రాయలసీమ సాగునీటి ప్రాజెెక్టుల భవిష్యత్తుపై సీమ జిల్లాల టీడీపీ నేతలు అనంతపురంలో సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంపై స్వయంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇదంతా కాలవ శ్రీనివాసులు, మరో వ్యక్తి కనుసన్నల్లో జరుగుతోందని, ఏ టీడీపీ కార్యకర్తను పిలిచారని ఆయన నిలదీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం పుణ్యాన అనంతపురం జిల్లా టీడీపీలో నెలకున్న విభేదాలు బయటపడ్డాయి. ఇదిలా ఉండగా ఈ సమావేశంలో 18 అంశాలపై తీర్మానాలు చేయడం గమనార్హం.
‘రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే హంద్రీనీవా, గాలేరు-నగరిలకు అధికారికంగా నీటిని కేటాయించాలని, వీటిని ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, జీవో 69 మేరకే తెలంగాణ విద్యుత్తు అవసరాలకు శ్రీశైలం నీటిని వాడుకునేలా చూడాలని, హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచాలని, వేదావతి ఎత్తిపోతల పథకం పనుల్ని తక్షణం ప్రారంభించడంతో పాటు మరికొన్ని అంశాల్ని తీర్మానించారు.
ఈ సమస్యలేవో తమ పాలనలో చేసి వుంటే, నేడు తీర్మానాల అవసరం ఉండేది కాదు కదా అని సీమ ప్రజానీకం ప్రశ్నిస్తోంది. టీడీపీ అధికారంలో ఉంటే కృష్ణా జిల్లా తప్ప మరే ప్రాంతం పట్టదని సీమ రైతాంగం విమర్శిస్తోంది. సీమపై చంద్రబాబు ప్రభుత్వం చూపిన తీవ్ర నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించిందని సీమ విద్యావంతులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సీమ సమస్యలపై మాట్లాడుతున్నారని నిలదీస్తున్నారు.
చంద్రబాబు హయాంలో ఒక్క ఏడాది పంటలు ఎండిపోతాయనే బాధతో కృష్ణా జిల్లా రైతాంగం కోసం పట్టిసీమ కట్టారని, అదే సీమ కోసం ఏం చేశారో చెప్పాలని సీమ సమాజం డిమాండ్ చేస్తోంది. టీడీపీ నేతల ఆరాటం, పోరాటం అంతా తన పార్టీ భవిష్యత్ కోసమో తప్ప, తమ కోసం ఎంత మాత్రం కాదని సీమ సమాజం స్పష్టం చేస్తోంది.