'తలైవి' సినిమా విషయంలో కంగనా హైలెట్ అవుతుందనుకుంటే.. అనూహ్యంగా అరవింద్ స్వామి హైలెట్ అవుతున్నాడు! తలైవి చూసిన ప్రతి ఒక్కరూ అరవింద్ స్వామిని ప్రస్తావిస్తూ ఉన్నారు. అరవింద్ స్వామి నటనను ప్రశంసిస్తున్నారు. సినిమా చూసినంత సేపూ తమకు అరవింద్ స్వామి ఎక్కడా కనపడలేదని, తెరపై ఎంజీఆర్ ను చూసినట్టే ఉందని వారు అంటున్నారు.
తలైవి విడుదల అయిన తర్వాత అంతటా అరవింద్ స్వామి పేరే మార్మోగుతూ ఉంది. ఎంజీఆర్ రూపు రేఖల్లో అరవింద్ స్వామి స్టిల్స్ విడుదల అయినప్పుడే అవి ట్రెండ్ అయ్యాయి. గెటప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, అరవింద్ ను అచ్చంగా ఎంజీఆర్ లా చూపించారనే ప్రశంసలు వచ్చాయి. సినిమా విడుదల అయ్యాకా కూడా ఆ ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది.
కంగనా నటన కన్నా.. అరవింద్ గురించినే ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ప్రధాన పాత్ర కంగనాది అయినా.. అరవింద్ నే చాలా మంది కీర్తిస్తున్నారు. ఎంజీఆర్ లా అరవింద్ అదిరిపోయాడంటూ వారు కితాబులిస్తున్నారు. అరవింద్ స్వామి ప్రతిభావంతమైన నటుడని వేరే చెప్పనక్కర్లేదు. తొలి ఇన్నింగ్స్ లో చేసిన ప్రేమకథలు, సాఫ్ట్ పాత్రల సంగతలా ఉంచితే.. ధ్రువ తమిళ, తెలుగు వెర్షన్లలో కోల్డ్ బ్లడెడ్ విలనిజాన్ని చాలా చక్కగా ప్రదర్శించాడు అరవింద్ స్వామి.
ఇప్పుడు ఒక మహానటుడి పాత్రను తెరపై బాగా ప్రజెంట్ చేశాడనే పేరును తెచ్చుకున్నాడు. గతంలో ఎంజీఆర్ పాత్రను మోహన్ లాల్ పోషించాడు. అందులో కొంత సేపు మోహన్ లాల్ ను చూసినట్టుగా, మరి కొంతసేపు ఎంజీఆర్ ను చూసినట్టుగా ఉంటుంది. అయితే అరవింద్ స్వామి హీరోగా మరీ ఎక్కువ సినిమాలు చేసిన నటుడు కాదు.
చేసినవన్నీ ఒకదానితో మరోటి పొంతన లేని పాత్రలే. ఈ క్రమంలో ఎలాంటి ఇమేజ్ చట్రంలో లేని అరవింద్ ను ఎంజీఆర్ లా చూడటం పెద్ద సర్ ప్రైజ్ అవుతూ ఉండొచ్చు కూడా. మరి ప్రస్తుత ప్రశంసల వర్షాన్ని బట్టి చూస్తే అరవింద్ స్వామిని తలైవి సినిమా మరింత బిజీ ఆర్టిస్టుగా మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.