రాయలసీమవాసి అయినా కూడా ఆ ప్రాంతంపై చంద్రబాబుకి ఎప్పుడూ ప్రేమ లేదు. ఆమాటకొస్తే రాష్ట్రంలోని ఏ ప్రాంతంపై కూడా ఆయనకి అభిమానం లేదు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందనే ఉద్దేశంతోటే ముందుగా స్థలాలు పోగేసుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించారనే విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలో ఇటీవల రాయలసీమపై లేనిపోని ప్రేమ కురిపిస్తున్నారు బాబు. రాయలసీమ నీటి ప్రాజెక్ట్ ల భవిష్యత్తుపై సీమ నేతల సదస్సు అంటూ టీడీపీ ఆధ్వర్యంలో అనంతపురంలో ఓ మీటింగ్ జరిగింది.
కాస్తో కూస్తో పార్టీలో చలనం ఉంటుంది, సీమలో మైలేజీ పెరుగుతుందన్న భావనతో ఏర్పాటు చేసిన ఈ సదస్సు కాస్తా అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. సొంత పార్టీ నేతలపైనే జేసీ ప్రభాకర్ రెడ్డి రివర్స్ అయ్యారు. సీమలో ప్రాజెక్ట్ ల కంటే ముందు కార్యకర్తల్ని కాపాడండి అంటూ ఆయన వేదికపైనే కుండబద్దలు కొట్టారు.
సమావేశానికి అందరికీ ఆహ్వానం లేదని, ఒకరిద్దరు నేతల కనుసన్నల్లో ఆ మీటింగ్ జరిగిందని మండిపడ్డారు ప్రభాకర్ రెడ్డి, ముందు కార్యకర్తలతో సమావేశం పెట్టండని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఈ విషయాలపై దృష్టిపెట్టాలని సమావేశం వేదికగా ఆయన కోరారు. అనంతపురం జిల్లాలో రెండేళ్ల నుంచి టీడీపీ కార్యకర్తల్ని నాయకులు పట్టించుకోలేదన్నారు. అప్పుడు వదిలేసి, ఇప్పుడు మీటింగ్ లకు రావాలంటే ఎవరొస్తారని ప్రశ్నించారు. కార్యకర్తల మీటింగ్ పెడితే ప్రయోజనం ఉంటుందని, ఇలాంటి సదస్సుల వల్ల ఉపయోగం ఉండదని తేల్చి చెప్పారు.
జేసీ వ్యాఖ్యలతో టీడీపీ ఇబ్బంది పడుతుంటే, ఇటు సీమ వైసీపీ నేతలు కూడా టీడీపీ సదస్సుపై సెటైర్లు పేలుస్తున్నారు. కమ్మ భవన్ లో సదరు సమావేశం నిర్వహించడంలో టీడీపీ ఆంతర్యమేంటని ప్రశ్నించారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. 15 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు, ఇప్పుడు జగన్ ని విమర్శించేందుకే సదస్సుల పేరుతో సీమలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాజకీయ నిరుద్యోగంతో ఉన్న నాయకులంతా తమ అస్తిత్వం కోసం కలిశారని ఎద్దేవా చేశారు.
సాగునీటి పథకంగా ఉన్న హంద్రీ-నీవా ను తాగునీటి పథకంగా మార్చిన దద్దమ్మ చంద్రబాబు అని తీవ్రంగా తప్పుబట్టారు. అటు ప్రతిపక్షాలకు బుక్కైపోయి, ఇటు స్వపక్ష నేతలూ విమర్శించడంతో అనంతపురం సదస్సు అసలు ఎందుకు పెట్టామా అని చంద్రబాబు తలపట్టుకున్నారు. లేనిపోని మైలేజీ కోసం ట్రై చేస్తే.. ఉన్న పరువు కూడా పోయిందని బాధపడుతున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిని దూరం పెట్టాలనుకున్నా.. ఏపీలో టీడీపీ పరువు నిలబెట్టిన ఏకైక మున్సిపల్ చైర్మన్ కావడంతో పార్టీకి తప్పలేదు. అయితే అక్కడికి వచ్చినా తన సహజ ధోరణిలో సొంత పార్టీపైనే విమర్శలు సంధించారు జేసీ. ముందు కార్యకర్తల్ని కాపాడుకోండి అంటూ చంద్రబాబుకి హితవు పలికారు. దీంతో అనంతపురం సదస్సు వేదికగా తెలుగుదేశం పార్టీలో డొల్లతనం బయటపడింది.