పెద్ద కుటుంబాల్లో ప్రమాదాలు జరిగితే తెలుగు మీడియా రియాక్షన్ మరీ అతిగా ఉంటుందనే విషయాన్ని కాదనలేం. భౌతికంగా తగిలిన దెబ్బ కంటే, మీడియా చేసిన రచ్చతో తగిలిన మానసిక గాయాలే మరింత ప్రమాదంగా తయారవుతుంటాయి.
సినిమావాళ్లు, లేదా వారి కుటుంబ సభ్యులు వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురైతే ఆ రచ్చ మరో లెవల్ లో ఉంటుంది. డాక్టర్ల కంటే ముందు కుటుంబ సభ్యులు మీడియా వారితో మాట్లాడాల్సిన పరిస్థితి. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత అల్లు అరవింద్ అంత త్వరగా ఆస్పత్రి బయటకు వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వడానికి కూడా కారణం అదే.
సాయి తేజ్ యాక్సిడెంట్ తర్వాత యూట్యూబ్ ఛానెళ్లు థంబ్ నెయిల్స్ తో విరుచుకుపడ్డాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా రేటింగ్స్ కోసం అంతకంటే చీప్ గా మారిపోయింది. అసలు ట్రయాంప్ బైక్ ఇలా తయారు చేసి ఉండాల్సింది కాదు అని ఒక రిపోర్టర్ ఇచ్చిన విశ్లేషణ చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. గతంలో బాత్ టబ్ లో యాంకర్ శవాసనం వేయడం మరీ చీప్ గా తోస్తే, ఇప్పుడు బైక్ కంపెనీకే సదరు ఛానెల్ రిపోర్టర్ పాఠం చెప్పడం మరింత విడ్డూరం అనిపిస్తుంది.
యాక్సిడెంట్ పేరుతో ఛానెళ్లలో రిపోర్టర్లు, న్యూస్ ప్రజెంటర్లు వేస్తున్న వెకిలి వేషాలను జనం అసహ్యించుకుంటున్నారు. మొన్నటికిమొన్న భారీ వర్షాల గురించి చెబుతూ.. ఓ యాంకరమ్మ.. రుధిరం విరుచుకుపడింది, అంబులెన్సులు కొట్టుకుపోతున్నాయంటూ చేసిన ఓవరాక్షన్ ను జనాల మరిచిపోకముందే.. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఉదంతం మీడియా అతిని మరోసారి ప్రేక్షకుల కళ్లకు కట్టింది. అయితే ఛీ కొట్టినా సరే మాకు కావాల్సింది రేటింగేనంటూ.. హాయిగా తుడిచేసుకుని వెళ్తున్నారు సదరు స్వయం ప్రకటిత మేథావులు.
ఛానెళ్లపై సోషల్ మీడియాలో మీమ్స్..
సాయితేజ్ యాక్సిడెంట్ విషయంలో మీడియా చేసిన, చేస్తున్న అతిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సెటైర్లు పడుతున్నాయి. సాయి తేజ్ హెల్మెట్ పెట్టుకోవడం, ఆయన ఆల్కహాల్ తీసుకోకపోవడంతో మీడియా బాగా డిజప్పాయింట్ అయిందని మీమ్స్ వచ్చేశాయి. సదరు బైక్ కంపెనీకి కోట్ల రూపాయల ఉచిత ప్రచారం రాత్రికి రాత్రే లభించింది.
ఇక ఆస్పత్రుల వద్ద కెమెరాలు, సెల్ ఫోన్ల హడావిడి చూస్తే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు సాయి తేజ్ ని పరామర్శించడానికి కూడా రాలేకపోతున్నారు. కారు డోరు తీయగానే కనీసం ఆస్పత్రిలోకి వెళ్లకుండా మైక్ లు, కెమెరాలు అడ్డుపడుతున్నాయి. కుటుంబ సభ్యులు బాధలో ఉంటే.. యాక్షన్, రియాక్షన్ అంటూ హడావిడి చేస్తున్నాయి కెమెరాలు, మైక్ లు.
హరీష్ శంకర్ అదిరిపోయే పంచ్..
సాయితేజ్ విషయంలో మీడియా అతిని సోషల్ మీడియాలో తిట్టిపోశారు దర్శకుడు హరీష్ శంకర్. “హ్యాట్సాఫ్ తమ్ముడు, ఆస్పత్రి బెడ్ పై ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావు. నీ యాక్సిడెంట్ వంకతో తప్పుడు వార్తలు అమ్ముకుని బతికేస్తున్న అందరు బాగుండాలి, వారికి ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నా..” అంటూ సాయి ధరమ్ తేజ్ విషయంలో మీడియాలో జరుగుతున్న అతి ప్రచారంపై సెటైర్ వేశారు హరీష్ శంకర్.
పెద్ద కుటుంబాలు, సినిమా వాళ్ల ఫ్యామిలీస్ విషయంలో మీడియా ఎంత అతి చేస్తుందన్న విషయం మరోసారి రుజువైంది. అయితే ఇప్పుడు థంబ్ నెయిల్స్ పార్టీలు వీరికి అదనం. ఈ ప్రచారంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేక.. కుటుంబ సభ్యులు కూడా బాధితులుగా మారుతున్నారు.