ఆయన నోరు జారాడు.. ఈయన తగులుకున్నాడు

టాలీవుడ్ లో డిస్కషన్ అంతా ఇప్పుడు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ పైనే నడుస్తోంది. వీలున్న సెలబ్రిటీలు హాస్పిటల్ కు వెళ్లి సాయితేజ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు.  Advertisement వీలు కాని సెలబ్రిటీలు సాయితేజ్ త్వరగా…

టాలీవుడ్ లో డిస్కషన్ అంతా ఇప్పుడు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ పైనే నడుస్తోంది. వీలున్న సెలబ్రిటీలు హాస్పిటల్ కు వెళ్లి సాయితేజ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. 

వీలు కాని సెలబ్రిటీలు సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమైంది. దీనికి కారణం సీనియర్ నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలే.

ఇంతకీ నరేష్ ఏమన్నాడు..?

సాయిధరమ్ తేజ్ తనకు కొడుకు లాంటోడన్నాడు. తన కొడుకు, సాయితేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. ఇంత వరకు బాగానే ఉంది కానీ నరేష్ చేసిన రెండు వ్యాఖ్యలు మాత్రం కలకలం రేపాయి. 

సాయితేజ్ కు, తన కొడుక్కి 5 రోజుల కిందటే బైక్ డ్రైవింగ్ కు సంబంధించి కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నానని అన్నారు నరేష్. అక్కడితో ఆగకుండా బైక్ రేసులు అనే పదం వాడారు. అక్కడితో కూడా ఆగలేదు. కోట శ్రీనివాసరావు అబ్బాయి, బాబుమోహన్ అబ్బాయి యాక్సిడెంట్స్ లో మరణించారనే విషయాన్ని ప్రస్తావించారు.

వివాదానికి మూలం ఇదే..!

సరిగ్గా ఈ వ్యాఖ్యానాలే వివాదానికి మూలకారణం అయ్యాయి. సాయితేజ్ బాగానే ఉన్నాడు. ఈరోజు కాస్త కోలుకొని తన కుటుంబ సభ్యులతో ఓ నిమిషం పాటు వీడియో కాల్ లో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కోలుకొని ఇంటికొస్తాడు కూడా. కానీ నరేష్ వ్యాఖ్యలు మాత్రం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

మెగా కాంపౌండ్ కు అత్యంత సన్నిహితులైన ప్రముఖులంతా వరుసపెట్టి నరేష్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. వీళ్లలో బండ్ల గణేశ్ కూడా ఒకరు.

ఇంతకీ బండ్ల కౌంటర్ ఏంటి..?

నరేష్ వ్యాఖ్యలపై కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేశ్. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయొద్దని, ఎలా మాట్లాడుకోవాలో నేర్చుకోవాలని హితవు పలికారు. ఆయన ఏమన్నారో యథాతథంగా ఇక్కడ చూద్దాం.

“చిన్న ప్రమాదం జరిగింది. ఈ టైమ్ లో నరేష్ గారు, ప్రమాదవశాత్తూ మరణించిన వాళ్ల పేర్లు చెప్పడం, అలా మాట్లాడ్డం కరెక్ట్ కాదు. ఇప్పుడెందుకు సర్ ఇవన్నీ. రేసింగ్ చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు, మీ ఇంటికొచ్చాడు… ఇప్పుడెందుకు సర్ ఇలాంటివన్నీ. తప్పు కదా సర్. సాయి తేజ్ తొందరగా కోలుకోవాలని ప్రార్థించాలి తప్ప, ఇలాంటి టైమ్ లో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు, ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి సర్.”

ఇలా నరేష్ వ్యాఖ్యలతో టాలీవుడ్ లో కొత్త వివాదం రాజుకుంది. ఓవైపు “మా” రాజకీయం రంజుగా సాగుతున్న వేళ.. ఇప్పుడు సాయితేజ్ యాక్సిడెంట్ కూడా వివాదాస్పదమవ్వడం బాధాకరం.